Teja | దర్శకుడు తేజ కుటుంబంలో కలకలం… కుమారుడు అమితోవ్ తేజపై కిడ్నాప్ కేసులు
Teja | ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుటుంబం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆయన కుమారుడు అమితోవ్ తేజ, తల్లి శ్రీవల్లిపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు తీవ్రమైన కేసులు నమోదు చేశారు.
Teja | ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుటుంబం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆయన కుమారుడు అమితోవ్ తేజ, తల్లి శ్రీవల్లిపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు తీవ్రమైన కేసులు నమోదు చేశారు. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, బెదిరించి ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించుకున్నారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.
ఫిర్యాదు వివరాలు ఇలా…
హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన కె. ప్రణీత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమితోవ్ తేజ కోరిక మేరకు ఆయన తల్లి శ్రీవల్లి పేరిట ఉన్న డీమ్యాట్ ఖాతాను తాను ఆపరేట్ చేశానని, ఈ క్రమంలో ట్రేడింగ్‌లో సుమారు రూ.11 లక్షల నష్టం వాటిల్లిందని ప్రణీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటూ అమితోవ్ తేజ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడని, తాను అందుకు నిరాకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసి ఇంట్లో అక్రమంగా నిర్బంధించారని, ఈ సందర్భంగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ప్రణీత్ వాపోయారు.
మరో కోణం కూడా…
ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇదే కేసుకు సంబంధించి ఈ నెల 12న అమితోవ్ తేజ జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రణీత్‌పై ఫిర్యాదు చేశారు. స్టాక్ మార్కెట్ లాభాల పేరుతో ప్రణీత్ తనను రూ.60 లక్షలకు పైగా మోసం చేశాడని అమితోవ్ తేజ ఆరోపించారు. అయితే, మొదట ప్రణీత్ పోలీసులను ఆశ్రయించినప్పుడు కేసు నమోదు కాకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలతో కేసులు
కోర్టు ఆదేశాల మేరకు తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు అమితోవ్ తేజ, ఆయన తల్లి శ్రీవల్లి సహా మరో ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ట్రేడింగ్ నష్టాలు, పరస్పర ఆరోపణలు, క్రిమినల్ కేసులతో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ కేసులో అసలు నిజానిజాలు ఏమిటన్నది పోలీసు విచారణ పూర్తయ్యాకే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram