Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలకు దారి తీసిన 30 శాతం రిజర్వేషన్ల చరిత్ర ఇదీ!

బంగ్లాదేశ్‌ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఇస్తున్న రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని కుదిపివేసింది. ఆందోళనకారులు, అధికార అవామీ లీగ్‌ కార్యకర్తల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది

Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలకు దారి తీసిన 30 శాతం రిజర్వేషన్ల చరిత్ర ఇదీ!

(విధాత ప్రత్యేకం)

బంగ్లాదేశ్‌ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఇస్తున్న రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని కుదిపివేసింది. ఆందోళనకారులు, అధికార అవామీ లీగ్‌ కార్యకర్తల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. ఇది సివిల్‌ వార్‌కు దారితీసింది. విద్యార్థుల ఆందోళనలతో దేశమంతా కర్ఫ్యూ విధించారు. ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీలన్నీ మూసివేశారు. ఒక జిల్లా జైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు. అందులో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేయించారు. జాతీయ మీడియా చానల్‌ ఆఫీస్‌పై దాడి చేశారు. ప్రధాని కార్యాలయం, బంగ్లాదేశ్ సెంట్రల్‌ బ్యాంక్‌, బంగ్లాదేశ్‌ పోలీస్‌ చీఫ్‌ వెబ్‌సైట్‌లు హ్యాక్‌ అయ్యాయి, ఆందోళకారులను అదుపు చేయడానికి జరిపిన కాల్పుల్లో 150 మందికిపైగా మృతి చెందారని వార్తలు వచ్చాయి. గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లోనే ఉంటుందని చెబుతున్నారు. అయినా ఆందోళకారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరకు తమ డిమాండ్‌ను నెరవేర్చుకున్నారు.

ఢాకా యూనివర్సిటీలో మొదలైన ఈ నిరసన వారంలో రోజుల్లోనే 64 జిల్లాలున్న బంగ్లాదేశ్‌లోని 47 జిల్లాలకు వ్యాపించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రిజర్వేషన్లను ప్రధాని షేక్‌ హసీనా సమర్థించడమే కాకుండా దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. నిరసనకారులను తీవ్రంగా విమర్శించారు. నిరసనకారులను రజాకార్లతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా ప్రజలంతా ఒకవైపు ఉంటేవారికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు అనుకూలంగా బంగ్లాదేశ్‌లోనే సాయుధ మూకలు పనిచేసి నిరసరకారులపై దాడులు చేసి హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డాయి.

పాకిస్థాన్‌ సైన్యం, రజాకార్‌ సాయుధమూకలు కలిసి ఈ దురాగతాలకు పాల్పడ్డాయి. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య పోరాటంలో సుమారు 30 లక్షల మంది చనిపోయారని అంచనా. అలాంటి రజాకార్‌లతో విద్యార్థి ఉద్యమకారులను షేక్‌ హసీనా పోల్చారు. ఆందోళనల వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఉన్నదనే అనుమానాలను అధికార పార్టీ అవామీ లీగ్‌ నేతలు వ్యక్తం చేశారు. హసీనా ప్రభుత్వాని వ్యతిరేకిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ, ఇతర ఇస్లామిక్‌ పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. నిరసనల్లో పాల్గొనడంతో ఆందోళనలు మరింత ఉధృతరూపం దాల్చాయి.

ఇదీ నేపథ్యం..

ఇప్పటి బంగ్లాదేశ్‌ను అప్పట్లో తూర్పు పాకిస్తాన్‌గా పిలిచేవారు. ఆ ప్రాంత ప్రజల భాష, సంస్కృతి బెంగాలీ. బంగబంధుగా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రహమాన్‌ నాయకత్వంలో అవామీ లీగ్‌ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌ విమోచన పోరాటం జరిగింది. వారి స్వాతంత్ర్య పోరాటం వెనుక భాషా జాతీయవాదం ఉన్నది. వీరి పోరాటాన్ని అణిచివేయడానికి పాకిస్థాన్‌ విచక్షణారహితంగా హింసాకాండను జరిపింది. పాక్‌ మద్దతుగా బంగ్లాలోనే ఉన్న సాయుధ మూకలు ఉపయోగపడ్డాయి. బంగ్లాదేశ్‌ స్వతంత్ర పోరాటానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మద్దతు తెలిపి, భారత సైన్యాన్ని దించడంతో పాకిస్థాన్‌ ఓడిపోయింది. బంగ్లాదేశ్‌కు 1971 స్వాతంత్య్రం వచ్చింది. 1972లో అక్కడ రిజర్వేషన్ విధానం మొదలైంది. ఈ విధానం కాలక్రమంలో అనేక మార్పులకు గురైనా 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వ్‌ చేశారు. ఇందులో 30 శాతం బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారి కుటుంబాలకు రిజర్వ్‌ చేశారు. అవి నాటి నుంచి ఇప్పటివరకు కొనసాగాయి.

ఇవే కాకుండా 10 శాతం మహిళలకు, 10 శాతం వెనుకబడిన జిల్లాల వారికి, 5 శాతం ఇండీజీనస్‌ (ఆదివాసీలకు), 1 శాతం దివ్యాంగులకు కేటాయించారు. అవామీ లీగ్‌ అధికారంలో ఉన్నంత కాలం ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. మిలిటరీ నియంత్రణలోకి అధికారం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు అమలు కాలేదు. 2018లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌ విధానాన్ని రద్దు చేసింది. ఇటీవల ఈ రద్దును సవాల్‌ చేస్తూ స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు సంఘం పిల్లలు బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోర్టులో కేసు వేశారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇస్తూ రిజర్వేషన్లను పునరుద్ధరించింది. దీనికి వ్యతిరేకంగానే విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్‌ చేసింది. ఆగస్టు మొదటివారంలో విచారణ జరుపుతామని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు వరకు వేచిచూద్దామని అప్పటివరకు ఆందోళనలు వద్దని ప్రభుత్వం చెప్పినా దీని వెనుక అనేక రాజకీయ కారణాలు ఉండటంతో నిరసనకారులు వినలేదు. మరోకారణం బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. నిరుద్యోగం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఉద్యోగ భద్రత ఉంటుంది. మంచి వేతనాలు ఉంటాయని అక్కడి నిరసన కారుల భావన. అందుకే ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. బంగ్లా స్వతంత్ర పోరాట కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని రోడ్డెక్కారు. వారం రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం, కర్ఫ్యూ, పోలీసుల కాల్పులు, హింస తర్వాత సుప్రీంకోర్టు నిరసనకారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.