• Telugu News
  • /Business

Reid Hoffman | ఇంకో పదేళ్లలో ఆ ఉద్యోగాలు మాయం.. తగ్గిపోతున్న మనుషుల అవసరం..!

Reid Hoffman | తరతరాలుగా మనిషి అభివృద్ధి చేస్తూ వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మనిషి అవసరాన్నే తలదన్నే స్థాయికి చేరింది. ఇప్పుడంతా టెక్నాలజీదే హవా. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా కొద్ది వివిధ రంగాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి.

Reported by: Thyagi | వాణిజ్యం | Jul 27, 2024, 9:50 am IST
Read Time: 5 mins
Reid Hoffman | ఇంకో పదేళ్లలో ఆ ఉద్యోగాలు మాయం.. తగ్గిపోతున్న మనుషుల అవసరం..!

Reid Hoffman | తరతరాలుగా మనిషి అభివృద్ధి చేస్తూ వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మనిషి అవసరాన్నే తలదన్నే స్థాయికి చేరింది. ఇప్పుడంతా టెక్నాలజీదే హవా. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా కొద్ది వివిధ రంగాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), రోబోటిక్స్‌ (Robotics) ప్రవేశంతో పలు రంగాల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతున్నది. రానురాను పరిశ్రమలకు మనిషి అవసరమే ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఉద్యోగులు చేసే పనిని ఏఐ, రోబోలు చేస్తాయని, దాంతో కంపెనీలకు మానవ వనరుల అవసరం భారీగా తగ్గిపోతుందని నిపుణులు ఇప్పటికే బాంబులు పేల్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా మాధ్యమం లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్‌ మన్‌ మరో బాంబు పేల్చారు. వచ్చే పదేళ్లలో కొన్ని ఉద్యోగాలు ఉండవని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉండనున్నాయో తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఉద్యోగ ప్రపంచంలో పెద్ద చర్చకు తెరలేపారు.

2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని హాఫ్‌ మన్‌ వ్యాఖ్యానించారు. ఫలితంగా కొత్త అవకాశాలతోపాటు సవాళ్లూ ఉంటాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగు కావడంతో స్థిరమైన ఉద్యోగాలు ఉండవని హాఫ్‌ మన్‌ అన్నారు. అంతేగాక ఆయా రంగాల్లో నిపుణులు ఒకేచోట దీర్ఘకాలం పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

ఒక వ్యక్తి ఒక కంపెనీకే పరిమితం కాకుండా ఏకకాలంలో వివిధ కంపెనీల్లో తన ప్రతిభ, నైపుణ్యాలకు అనుగుణంగా పనిచేసే అవకాశం దక్కుతుందని హాఫ్‌ మన్‌ అంచనా వేశారు. దాంతో ఆయా కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)తో సహా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేశారు. సాంకేతిక రంగంలో హాఫ్‌మన్‌కు విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి.

సోషల్‌ మీడియా మాధ్యమాలకు విపరీతమైన ఆదరణ దక్కుతుందని హాఫ్‌ మన్‌ అంచనా వేశారు. అలాగే గిగ్‌ ఎకానమీ ఊపందుకుంటుందని ఎన్నో ఏళ్ల క్రితమే వెల్లడించారు. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి అయితే హాఫ్‌ మన్‌ 1997లోనే ఊహించడం గమనార్హం. ప్రపంచంలో ఏఐ విప్లవం సృష్టిస్తుందని ఆయన దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. ఈ క్రమంలో మరో పదేళ్లలో సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయని హాఫ్‌ మన్‌ చెప్పడం సంచలనంగా మారింది.