త్వరలో డిజిటల్ మీడియా ప్రారంభిస్తున్నా: విజయసాయిరెడ్డి ట్వీట్

త్వరలోనే తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వార్తల కోసం ఒక డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించబోతున్నట్లుగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలాగే ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Apr 11, 2026, 6:28 pm IST
Read Time: 4 mins
త్వరలో డిజిటల్ మీడియా ప్రారంభిస్తున్నా: విజయసాయిరెడ్డి ట్వీట్

విధాత: త్వరలోనే తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వార్తల కోసం ఒక డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించబోతున్నట్లుగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. నేను ప్రారంభించబోయే మీడియా వేదిక సమతుల్యంగా, నిష్పక్షపాతంగా,సత్యానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్లాట్‌ఫామ్ పేరు త్వరలో ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.

ప్రజలకు గొంతుకను ఇవ్వడం, అలాగే సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాలకు సంబంధించిన నిజమైన సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం అని విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో తెలిపారు. ఈ వేదిక స్వతంత్రంగా ఉంటుందని, ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు. విజయవంతంగా డిజిటల్ మీడియా వేదిక ప్రారంభించిన తర్వాత, ఇదే దృక్పథం , విలువలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా ప్రారంభించాలని మేము యోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వేదిక పేరును త్వరలో ప్రకటిస్తాం అని, వేచి ఉండండని తెలిపారు.

త్వరలో డిజిటల్ మీడియా, తెలుగు శాటిలైట్ చానల్ ప్రారంభించబోతున్నట్లుగా విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైసీపీని నడిపించినట్లుగా మీ కొత్త డిజిటల్ మీడియాను చేయవద్దని కొందరు, పెడితే పెట్టారుగాని ఏపీ విజయవాడ కేంద్రంగా పెట్టాలని మరికొందరు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఒకరు మరో పచ్చ చానల్ అని, ఇంకొకరు సాక్షి 2.0 అని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాలకు విరామం ప్రకటించి వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు డిజిటల్ మీడియా పెడితే..మరి వ్యవసాయం ఏమైపోవాలని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.