ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే. తమకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాన్ని ఇష్టంగా ఆరగిస్తారు. చాలా మంది మటన్, చికెన్ వంటకాల్లో వెరైటీల కోసం ప్రయత్నిస్తుంటారు.
ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే. తమకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాన్ని ఇష్టంగా ఆరగిస్తారు. చాలా మంది మటన్, చికెన్ వంటకాల్లో వెరైటీల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక మటన్‌ను ఫ్రై లేదా కర్రీగా వండేస్తారు. మటన్ పులుసు కూడా వండొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. మటన్ పులుసు చాలా రుచికరమైన వంట. మరి మటన్ పులుసు చేసుకోవడం కూడా చాలా సులభం. తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..
మటన్ – అరకిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 8.
మటన్‌ను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కుక్కర్‌లో మటన్‌ను వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఒక పాత్రలో వెల్లుల్లి తప్ప మిగిలిన మసాలా పదార్థాలు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించిన తరువాత జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఆ తర్వాత పాత్రలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కాసేపటి తర్వాత టమాట ముక్కలు వేసి వేయించాలి. ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత ఉడికించిన మటన్‌ను నీటితో సహా వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ పులుసు తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ మటన్ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.