కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారతీయ విద్యార్థులు క్షేమం: జైశంకర్
మధ్య ఆసియా దేశం కిర్గిస్థాన్‌లో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. కిర్గిస్థాన్ – ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణ దాడులకు దారి తీసింది

విధాత: మధ్య ఆసియా దేశం కిర్గిస్థాన్‌లో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. కిర్గిస్థాన్ – ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణ దాడులకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు శుక్రవారం వైరల్ కావడం హింసకు దారి తీసింది. కిర్గిస్థాన్‌లో అరబ్ దేశానికి చెందిన యువతీ యువకులు కలిసి ఉంటున్నారు. అమ్మాయిలను కిర్గిస్థాన్ యువకులు ర్యాగింగ్ చేయడంతో అరబ్ యువకులు అడ్డుకున్నారు.
దీంతో అదే రోజు సాయంత్రం యువకులు మూకుమ్మడిగా అరబ్ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడులు జరిగాయి. అల్లర్లపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ఎంబసీని సంప్రదించాలని తెలిపారు. హెల్ఫ్‌లైన్ నెంబర్ (0555710041)ను షేర్ చేశారు.
కాగా దాడిలో పాక్‌కు చెందిన విద్యార్థులు గాయపడ్డారని, కొందరు చనిపోయారన్న సమాచారం వచ్చినా ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదని పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని పాక్ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో దాదాపు 10,000 మంది పాకిస్థానీ విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
కిర్గిస్తాన్ ముస్లిం దేశమే అయినా అరబ్బు దేశాల తరహాలో సంప్రదాయాలు, కట్టుబాట్లు కఠినంగా ఉండవని, గతంలో రష్యా పాలనలో ఉన్న ఈ దేశం 1991లో సోవియెట్ యూనియన్ పతనం తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించిందని, సున్ని ముస్లింలు అధికంగా ఉండే కిర్గిజ్ రాజకీయాల్లో క్రమంగా ఇస్లాం ప్రాధాన్యత పెరగటం సెక్యులర్ వాదులలో ఆందోళన రేపుతుంది.