ఎన్నికల కమిషన్ విఫలమైంది: ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించడంలో విఫలం అయిందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నికల కమిషన్ విఫలమైంది: ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
  • అన్ని వ్యవస్థలు మసగపారాయి
  • నేను కూడా ముదిరిపోయా
  • దేశంలో మెజారిటీ ప్రజల అభ్యర్థి అయినందుకు గర్వంగా ఉంది

హైదరాబాద్, సెప్టెంబర్ 1(విధాత): ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించడంలో విఫలం అయిందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించడంలో విఫలం అయిందని ఆరోపించారు. ఎన్నికలు ఫ్రీ అయ్యాయి కానీ అందులో ఫేర్ పోయిందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. కులం, మతం లేని జాబితా కేవలం ఓటర్ల జాబితానేనని ఆయన వెల్లడించారు. అలాంటి ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం మాత్రామే కాకుండా న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు కూడా న్యాయంగా లేరన్నారు, వారికి న్యాయం అనిపించినదాన్నే తీర్పుగా ఇస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు మసగపారిపోయాయన్నారు.

ఈ పది రోజుల కాలంలో చాల ముదిరిపోయానని అందుకు కారణం రాజకీయ సహవాసం ఒకటైతే, మీడియాతో మాట్లాడటం రెండో విషయం అన్నారు. ఈ రెండింటి వళ్ల తాను కూడా ముదిరిపోయనన్నారు. ఈ వయసులో ఎందుకీ ముళ్ల కిరీటం అన్న ప్రశ్నలు వస్తున్నాయి.. కానీ రాజకీయం ముళ్ల కిరీటం కాదన్నారు. ఉప రాష్ట్రపతి రాజకీయ పదవి కాదని స్పష్టం చేశారు. మొదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే నాకు ఇబ్బంది అని చెప్పాను, ఇండియా కూటమి అభ్యర్థిగా అయితే ఆలోచిస్తానని చెప్పానన్నారు.

ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెంటనే ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పారన్నారు. మీము ఢిల్లీ వెళ్ళే సరికి 20 మంది ఎంపీలు వచ్చారన్నారు. ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధిగా మారిపోయానన్నారు. కొందరు తటస్థులు కూడా ఫోన్‌ చేసి మద్ధతు పలికారని, దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థిని అని గొప్పగా ఫీల్ అవుతున్నానని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

అయితే గతంలో జగదీప్‌ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేయడంతో దేశంలో ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయింది. దీంతో ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధా కృష్ణన్‌ను ఎంపిక చేయగా, ఇండియా కూటమి తరుపున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది.