CPI(M) protest Delhi| మార్చి 24న ఢిల్లీలో సీపీఎం ధ‌ర్నా

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొస్తున్న ప్ర‌జా, కార్మిక‌, రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మార్చి 24న ధ‌ర్నా చేయ‌బోతున్న‌ట్టు సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఏ.బేబీ ప్ర‌క‌టించారు. అమెరికాతో ఇటీవ‌ల మోడీ స‌ర్కారు చేసుకున్న స్వేచ్ఛా ఒప్పందం దేశ స‌మగ్ర‌త‌కే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు.

CPI(M) protest Delhi| మార్చి 24న ఢిల్లీలో సీపీఎం ధ‌ర్నా

ప్ర‌జా, కార్మిక‌, రైతు వ్య‌తిరేక చ‌ట్టాలు తీసుకొస్తున్న మోడీ స‌ర్కారు

అమెరికాతో స్వేచ్ఛా ఒప్పందం దేశానికే ప్ర‌మాద‌కరం

వాటిని నిర‌సిస్తూ ఉత్త‌రాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున్న రైతు జాతాలు

చ‌మురు కొనుగోళ్ల‌ను ట్రంప్ నిర్ణ‌యిస్తే ప్ర‌ధాని ఎందుకు? చ‌మురు మంత్రి ఎందుకు?

మోడీ స‌ర్కారు న‌యా ఫాసిస్టు విధానాలు దేశానికి న‌ష్ట‌దాయ‌కం సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఏ.బేబీ

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌ను నెర‌వేర్చాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ

విధాత, హైద‌రాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొస్తున్న ప్ర‌జా, కార్మిక‌, రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మార్చి 24న ధ‌ర్నా చేయ‌బోతున్న‌ట్టు సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఏ.బేబీ ప్ర‌క‌టించారు. అమెరికాతో ఇటీవ‌ల మోడీ స‌ర్కారు చేసుకున్న స్వేచ్ఛా ఒప్పందం దేశ స‌మగ్ర‌త‌కే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు. దీని ప్ర‌భావం ఒక్క వ్య‌వ‌సాయ రంగానికే ప‌రిమితం కాకుండా అన్ని రంగాల‌పైనా, జీడీపీపైనా ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిపై సంయ‌క్త కిసాన్ మోర్చా ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న పోరాటాల‌ను ప్ర‌స్తావించారు.  హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు బీవీ.రాఘ‌వులు, రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీతో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

దేశ పాల‌న‌ను మార్కెట్ వ్య‌వ‌స్థ న‌డిపిస్తుండ‌టం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇండియా ఏ దేశం నుంచి చ‌మురును దిగుమ‌తి చేసుకోవాల‌నే విష‌యాన్ని ట్రంప్ నిర్ణ‌యించ‌డ‌మేంటి? అలాగైతే ప్ర‌ధాని మోడీ, చ‌మురు మంత్రి ఎందుకు అని ప్ర‌శ్నించారు. న‌రేగా పేరును వీబీజీఆర్ ఏ ఎమ్‌జీ గా పేరు మార్చ‌డం, వంద రోజుల ప‌నిని 125 రోజుల‌కు పెంచుతామ‌ని మోడీ స‌ర్కారు ప్ర‌చారం చేయ‌డం పెద్ద చీటింగ్ అని చెప్పారు. అన్ని ప‌నిదినాలు క‌ల్పించాలంటే మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కుపైగా అవ‌స‌రం కాగా బ‌డ్జెట్‌లో అంతంత మాత్ర‌మే కేటాయించ‌డం దారుణ‌మ‌నీ, దాంతో 125 రోజుల ప‌నిక‌ల్ప‌న అసాధ్య‌మ‌ని తేల్చి చెప్పారు. గ్రామీణ పేద‌ల ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డాల‌నే ఉద్దేశంతో వామ‌ప‌క్షాలు చేసిన పోరాటాలు, 60 మంది లెఫ్ట్ పార్టీల ఎంపీల ఒత్తిడితో యూపీఏ1 ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్రం నిధుల‌తో న‌రేగా చ‌ట్టం రూపుదాల్చింద‌ని వివ‌రించారు. ఇప్పుడు మోడీ స‌ర్కారు గ్రామీణ పేద‌ల‌కు ప‌ని క‌ల్పించాల‌నే చ‌ట్టాన్ని నిర్వీరం చేసింద‌ని విమ‌ర్శించారు. ఆ చ‌ట్టానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధుల్లో 40 శాతం రాష్ర్టాలే భ‌రించాల‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. విద్యుత్ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో వ్య‌వ‌సాయ రంగానికి, పేద వినియోగ‌దారుల‌కు, ఆస్ప్ర‌తులకు, విద్యాల‌యాల‌కు స‌బ్సిడీ విద్యుత్ సౌక‌ర్యం పోతుంద‌ని వివ‌రించారు.

యూనివ‌ర్సీటీల బిల్లు కూడా ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌కు, లేబ‌ర్ కోడ్‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ఈ నెల 12న జ‌రిగిన దేశ‌వ్యాప్త స‌మ్మేలో 25 నుంచి 30 కోట్ల మంది పాల్గొన్నార‌ని గుర్తుచేశారు. లేబ‌ర్ కోడ్‌ల‌ను అమ‌లు చేయ‌బోమ‌ని కేర‌ళ‌లోని వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. ఓవైపు బీజేపీ ప్ర‌భుత్వ విధానాల‌పై పోరాటం చేస్తున్నామని చెబుతూనే క‌ర్నాట‌క‌లోని కాంగ్రెస్ స‌ర్కారు లేబ‌ర్ కోడ్ ల అమలు దిశ‌గా చ‌ర్య‌లు మొద‌లుపెట్టింద‌నీ, తెలంగాణ‌లోని కాంగ్రెస్ స‌ర్కారు కూడా లేబ‌ర్ కోడ్‌ల నోటిఫికేష‌న్లు జారీ చేసింద‌ని విమ‌ర్శించారు. ఆ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

స‌ర్ పేరుతో ఈసీ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఓట్ల‌ను తొల‌గించ‌డాన్నిత‌ప్పుబ‌ట్టారు. బీజేపీకి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కొమ్ము కాస్తున్నార‌ని విమ‌ర్శించారు. కేర‌ళ స్థానిక ఎన్నిక‌ల్లో లెఫ్ట్ ఫ్రంట్‌కు కాస్త‌ సీట్లు త‌గ్గిన‌ప్ప‌టికీ ఓటింగ్ శాతం పెరిగింద‌ని తెలిపారు. అయితే, దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉంటుంద‌నీ, మ‌ళ్లీ లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఓ స‌ద‌స్సులో కేర‌ళ క‌మ్యూనిస్టుల పాల‌న‌ను కొనియాడార‌ని గుర్తుచేశారు. పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌భుత్వంలో మ‌త విద్వేషాల‌కు అవ‌కాశం లేని శాంతియుత వాతావ‌ర‌ణంలో కేర‌ళ ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నార‌ని ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ సెమినార్‌లో అమ‌ర్త్య‌సేన్ చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అలాంటి చోట కూడా బీజేపీ ఎంపీ సీటు గెల‌వ‌డం ఆందోళ‌న‌క‌ర‌మ‌న్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ సీపీఐ(ఎం) వైపు యువ‌త పెద్ద ఎత్తున వ‌స్తున్నార‌నీ, అక్క‌డ త‌మ పార్టీ బ‌ల‌ప‌డుతున్న‌ద‌ని తెలిపారు. ముస్లింల‌పై గ‌న్ను పెడుతూ అస్సాం సీఎం హేమంత్ బిశ్వ‌శ‌ర్మ బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేయ‌డాన్నిత‌ప్పుబ‌ట్టారు. సుప్రీం కోర్టు జోక్యంతో త‌న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న వెన‌క్కి తీసుకున్నార‌ని గుర్తుచేశారు. ప్ర‌తిప‌క్ష నేతల‌పై మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును త‌ప్పుబ‌ట్టారు. జాతీయ గీతం జ‌న‌గ‌న‌మ‌న‌తో పాటు వందేమాత‌రానికి స‌మ‌ప్రాధాన్య‌త ఇచ్చేలా బీజేపీ చూస్తోంద‌నీ, వందేమాత‌రం, కాళీమాత‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. వాటిని అమ‌లు చేయ‌క‌పోతే పోరాటాల‌ను ఉధృతం చేస్తామ‌న్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డ‌కుంటున్న‌దే బీజేపీ అని విమ‌ర్శించారు. తెలంగాణ ఇవ్వాల్సిన నిధుల విష‌యంలోనూ వివ‌క్ష చూపుతున్న‌ద‌న్నారు. అందుకే బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మ‌ల్యేలు, ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్నా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాలు రాలేద‌న్నారు. రాష్ట్రంలో క‌మ్యూనిస్టులు ఎక్క‌డ అని కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించ‌డాన్ని త‌ప్ప‌బట్టారు.

మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే విధానాల‌ను బీజేపీ అనుస‌రిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. దాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. విద్యుత్ కంపెనీల‌ను ప్ర‌యివేటుప‌రం చేయ‌డాన్ని మానాల‌న్నారు. ప్ర‌జా ఉద్య‌మాల‌ను నిర్మించ‌డం ద్వారా బ‌లోపేతం అవుతామ‌న్నారు. ఎక్కువ సీట్ల‌లో సొంతంగా పోటీ చేశామ‌నీ, గ‌తంలో 12 సీట్లు ఉండ‌గా ఇప్పుడు 13 గెలిచామ‌నీ, భ‌విష్య‌త్తులో త‌మ పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే విద్య‌కు 20 శాతం నిధులు కేటాయిస్తామ‌న్న హామీని రేవంత్‌రెడ్డి స‌ర్కారు నెర‌వేర్చాల‌నీ, పేద‌ల‌కు మెరుగైన విద్య‌ను అందించాల‌ని కోరారు.