స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా నామినేటెడ్ పోస్టుల్లో యువ రక్తం! జాబితా ఫైనల్ అవగానే ప్రకటన
నామినేటేడ్ పదవులను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే భర్తీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే 37 కార్పోరేషన్ పదవులను భర్తీ చేయగా.. మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

- నామినేటెడ్ పోస్టుల్లో యువ రక్తం!
- 50 ఏళ్లలోపు వారికి అవకాశాలు
- ఏడాదిగా ఆశావహుల ఎదురుచూపు
- జాబితా ఫైనల్ అవగానే ప్రకటన
- సుముఖంగా ఉన్న మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విధాత): నామినేటేడ్ పదవులను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే భర్తీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే 37 కార్పోరేషన్ పదవులను భర్తీ చేయగా.. మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటడంతో నామినేటేడ్ పోస్టుల కోసం ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌తో కూడా పీసీసీ నాయకత్వం నామినేటేడ్ పోస్టుల భర్తీపై చర్చించింది. నెల రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నామినేటేడ్ పోస్టుల అంశంపై కూడా చర్చించారు. నామినేటేడ్ పోస్టులకు సంబంధించిన జాబితాను ఇస్తే వెంటనే ఆర్డర్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానని సీఎం ఈ సమావేశంలో చెప్పారు. కానీ, జాబితా ఇంతవరకు ఫైనల్ కాలేదు. నామినేటేడ్ పోస్టుల భర్తీపై జిల్లా ఇంచార్జీ మంత్రులు జిల్లాల వారీగా జాబితా ఇవ్వాలని సీఎం సూచించారు.
జాబితా తయారీలో ఆలస్యమెందుకు?
నామినేటేడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, జాబితా మాత్రం ఫైనల్ కాలేదు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం లేదా జిల్లాకు ప్రాధాన్యత దక్కేలా ఛైర్మన్, డైరెక్టర్ పోస్టులకు జాబితాను పంపాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేని చోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు ఈ జాబితా తయారీ చేసి పీసీసీకి పంపాలి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలను కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోనుంది. అయితే జాబితా తయారీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పాటు ప్రజా ప్రతినిధులు నామినేటేడ్ పోస్టుల భర్తీ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవడం కూడా ఆలస్యానికి కారణం అవుతున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం ఫైనల్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ షెడ్యూల్ విడుదలకు ముందే నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న వారిని నామినేటేడ్ పోస్టుల జాబితా నుంచి మినహాయించనున్నారు. నామినేటేడ్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి నామినేటేడ్ పోస్టుల్లో మరొకరికి అవకాశం కల్పించాలని అధిష్టానం సూచించింది. నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని తమ వైపునకు తిప్పుకోవాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది.
50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యం
నామినేటేడ్ పోస్టుల భర్తీలో 50 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. జాబితా తయారీలో 50 ఏళ్లలోపువారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాల్లోని పార్టీ నాయకులకు సమాచారం పంపారు. అదే సమయంలో బీసీలకు కూడా నామినేటేడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత దక్కేలా హస్తం పార్టీ జాగ్రత్తలు తీసుకుంటుంది. నామినేటేడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల్లో యువతకు పెద్దపీట వేయడం ద్వారా హస్తం పార్టీకి యువ రక్తం ఎక్కించాలని హస్తం పార్టీ భావిస్తోంది.