Congress Party | సంబురాలు సరే..! సమీక్షించుకునేది ఉందా..?
Congress Party | మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు సంబురాల్లో మునిగిపోయారు. విజయోత్సవాల్లో మునిగిపోయి, వాస్తవ పరిస్థితులపై సమీక్షించుకోకుంటే రానున్న రోజుల్లో గడ్డుపరిస్థితిని ఎదుర్కోక తప్పదంటున్నారు.
కాంగ్రెస్ నేతల తీరుపై భిన్నమైన చర్చ
మున్సిపల్ ఫలితాలు ముందస్తు హెచ్చరిక
వరంగల్ జిల్లాలో విజయమంత సులువుగా దక్కలేదు
Congress Party | విధాత, ప్రత్యేక ప్రతినిధి: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు సంబురాల్లో మునిగిపోయారు. విజయోత్సవాల్లో మునిగిపోయి, వాస్తవ పరిస్థితులపై సమీక్షించుకోకుంటే రానున్న రోజుల్లో గడ్డుపరిస్థితిని ఎదుర్కోక తప్పదంటున్నారు. మున్సిపోల్స్ ఫలితాలు ఆపార్టీకి ముందస్తు హెచ్చరికగా భావిస్తున్నారు. నిజమే రాష్టవ్యాప్తంగా మెజార్టీ జిల్లాల్లో మెజార్టీ మున్సిపాలిటీలు, కొర్పొరేషన్ లలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ పలు చోట్ల విపక్షాల నుంచి గట్టిపోటీ నెలకొంది. అనేక చోట్ల అతికష్టం మీద అభ్యర్ధులు గట్టెక్కారు. అధికార పార్టీ కావడంతో పోటాపోటీ నెలకొన్న మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు చేయూత నివ్వడంతో విజయం వరించింది. మరికొన్ని చోట్ల నెక్ టూ నెక్ అనే రీతిలో సమ ఉజ్జీలుగా సమాన స్థానాలు గెలుచుకున్న చోట్ల ఎక్స్ అఫిషియో ఓటుతో గండం గట్టెక్కించారు. ఇంకొన్ని చోట్ల డ్రా తీస్తే అందులో కూడా అధికారపార్టీకి అదృష్టం తోడై బయటపడ్డారు. ఈ విజయాలతో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సంబురాల్లో మునిగిపోయారు. నిజమే విజయాన్ని ఎంజాయ్ చేయడంలో తప్పులేదుగానీ, నిజానిజాలు పసిగట్టి జరిగిన పొరపాట్లు, తప్పులను సరిదిద్దుకునేందుకు సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే కాకుండా రాజకీయ పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాలవారీగానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా దీనిపై అవలోకనం చేసుకోకుంటే రానున్న రోజుల్లో మరింత ప్రమాదంతప్పదంటున్నారు. చివరికి ఈ ఉత్సవాలు, విజయాల భ్రమల్లో మునిగి పుట్టిమునిగినా మునుగుతోందంటున్నారు.
ఢిల్లీ నుంచి సున్నిత హెచ్చరిక చేసిందా?
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాగానే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించకముందే పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇతర ముఖ్యనేతలతో ఢిల్లీ స్థాయిలో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితి, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చర్చకు వచ్చినప్పటికీ, విజయానికి పొంగిపోయి భేష్ అంటూ వెన్నుతట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీ పీసీసీ నాయకత్వానికి, మంత్రులకు వెన్నంటి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తుచేస్తూ సున్నితమైన హెచ్చరిక కూడా చేసి ఉంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకుంటే గెలుపు భ్రమల్లో చిక్కుకుని వాస్తవాలు విస్మరిస్తే పార్టీకి రానున్న నష్టాన్ని ఎవరూ పూడ్చలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీల బలాబలాలు
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగాయి. క్యాతం పల్లి, ఖనాపూర్ మున్సిపాలిటీలు మినహా అన్ని పాలకవర్గాల ఎన్నికలు పూర్తయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్ సీపీఐ ఖాతాలోపడగా, కాంగ్రెస్ అధికారాన్ని పంచుకోవాలనే ఒప్పందం చేసుకున్నారు. ఇక మున్సిపాలిటీల్లో 96 కాంగ్రెస్, 17 బీఆర్ఎస్, ఒకటి బీజేపీ కైవసం చేసుకున్నది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు స్థానిక బలాబలాలను బట్టి జట్టుకట్టారు. ఇదిలా ఉండగా మరో రెండు పాలకవర్గాలు తేలాల్సి ఉంది. ఏ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది పక్కన పెడితే వాస్తవ బలాబలాలు తేలాలంటే వార్డుల్లో విజయం ప్రధానమైంది. చైర్మన్ ఎవరనేది తేల్చేది వార్డులనేది ఇక్కడ గమనార్హం. దీంతో పాటు ఓట్ల శాతం కూడా ముఖ్యం. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలుండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 2581 వార్డులు, బీఆర్ఎస్ 718 వార్డులు, బీజేపీ 269 వార్డులు, ఇతరులు 254 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 52శాతం, బీఆర్ఎస్ 27 శాతం, బీజేపీ 19శాతం, ఇతరులు 9 శాతం వరకు ఓట్లు సాధించారు. ఇదే విధంగా రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్ లుండగా 411 డివిజన్లున్నాయి. ఇందులో కాంగ్రెస్ 191 వార్డులతో 47శాతం, బీఆర్ఎస్ 63 డివిజన్లతో 15శాతం, బీజేపీ 75 డివిజన్లతో 18శాతం, ఇతరులు 82 డివిజన్లతో 19 శాతం ఓట్లు సాధించారు. కార్పొరేషన్లతో పోల్చుకుంటే మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ కు విపక్షాల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీల్లో అత్యధిక భాగం నియోజకవర్గ కేంద్రాలుగా, ఆ నియోజకవర్గంలోని మరో పట్టణంగా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ రాజకీయాలే ఆయా నియోజకవర్గాలకు రాజకీయ కేంద్రాలుగా మారి సమీకరణలను మార్చడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఆయా ఎమ్మెల్యేల బలాబలాలకు, పట్టుకు ఇవి నిదర్శనంగా కనిపిస్తాయి. అందుకే ఎమ్మెల్యేలుగా ఈ మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు సర్వశక్తులొడ్డారనేది నిశితంగా పరిశీలిస్తే అర్ధమవుతోంది.
వరంగల్ విజయమంత సులువుకాదు
మున్సిపాలిటీల్లోనే కాంగ్రెస్ పార్టీకి ముప్పుపొంచి ఉంది. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిశీలిస్తే తెలిసిపోతోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 12 మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. అయితే ఇదంతా సులభంగా దక్కలేదు. కన్నుతప్పి లొట్టపోయినట్లు ఆ పార్టీ అపదలో చిక్కి, ఆఖరున గట్టెక్కింది. దీనికి అధికారంతోపాటు డ్రాలో అదృష్టం కూడా కలిసొచ్చింది. 12 మున్సిపాలిటీల్లో భూపాలపల్లి, ములుగు, పరకాల,నర్సంపేట, మరిపెడ, డోర్నకల్, స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ మెజారిటితో గెలుచుకున్నది. అయినప్పటికీ ఈ అన్నిచోట్ల బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చిందనేది వాస్తవం. ఇక ఐదు మున్సిపాలిటీలు మహబూబాద్, తొర్రూరు, కేసముద్రం, వర్ధన్నపేట, జనగామల్లో హంగు ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ కు ఎక్స్ అఫిషియో ఓటు రక్షణగా నిలిచింది. తొర్రూరు, జనగామల్లో డ్రా కాంగ్రెస్ నే వరించింది. హంగు ఏర్పడిన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. ఈ మున్సిపాలిటీల్లో సీపీఐ, సీపీఎం, బీజేపీ, ఇండిపెండెంట్లు ఇరువైపులా చీలిపోయారు. ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు కాంగ్రెస్ ను ఓటమి గండం నుంచి రక్షించాయి. మహబూబాబాద్ లో ఇండిపెండెంట్లు, సీపీఎం, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ ఓటు వల్ల కాంగ్రెస్ గట్టెక్కింది. కేసముద్రంలో మహబూబాద్ ఎంపీ బలరామ్ నాయక్ ఓటు పీఠం దక్కించింది. వర్ధన్నపేటలో ఇండిపెండెంట్ సభ్యురాలి ఓటుకు ఎమ్మెల్యే నాగరాజు ఓటు తోడుకావడంతో గండం నుంచి బయటపడ్డారు. తొర్రూరులో వరంగల్ ఎంపీ కడియం కావ్య, జనగామలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్అఫిషియో ఓటుతో డ్రాగా మారింది. చివరి వరకు అత్యంత ఉత్కంటగా మారిన ఈ రెండు స్థానాల్లో అదృష్టం కాంగ్రెస్ వైపు నిలిచింది. అధికారంలేకుంటే ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలం సమానమని భావించాల్సి ఉంటోంది. రానున్న రోజుల్లో ఏ కొంచెం తేడా జరిగినా జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోతాయనేది వాస్తవం. స్థానిక ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఇండిపెండెంట్లు రాజకీయంగా మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. తొర్రూరు లాంటి చోట్ల ఎన్నికల ఫలితాలొచ్చిన రోజు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సంబురాలు చేసుకుంటే డ్రాలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నేతలు యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిలు విజయోత్సవాలు నిర్వహించుకోవడం ఈ గెలుపు వెనుక దాగిన పోటీ ప్రభావమేనని గుర్తించాలని చెబుతున్నారు. అందుకే ఇప్పటికైనా అధికారం దక్కిందని కాంగ్రెస్, అసలే ఒక్క మున్సిపాలిటీ రాలేదని బీఆర్ఎస్, బీజేపీలు పొంగిపోవడమో, కుంగిపోవడమో చేయకుండా సమీక్షించుకుంటే తప్పొప్పులు వెలుగుచూసే అవకాశముందంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram