సర్కారుకు డ్రగ్‌ స్మగ్లర్ల సవాల్‌! తయారీ నుంచి అమ్మకాల వరకూ హైదరాబాద్ అడ్డ

రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్‌పై ఉక్కుపాద మోపుతానని టీచ‌ర్స్ డే రోజున ప్ర‌క‌టించి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే ముంబై పోలీసులు హైద‌రాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున డ్ర‌గ్స్ త‌యారు చేస్తున్న ప‌రిశ్ర‌మ‌పై దాడి చేసి, దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

సర్కారుకు డ్రగ్‌ స్మగ్లర్ల సవాల్‌! తయారీ నుంచి అమ్మకాల వరకూ హైదరాబాద్ అడ్డ
  • తయారీ నుంచి అమ్మకాల వరకూ హైదరాబాద్‌ నగరమే కేంద్ర స్థావరం
  • కఠిన చట్టాలూ వారికి చుట్టాలేనా? పదేళ్లలో బాగా పెరిగిన వినియోగం
  • ఫ్యాష‌న్‌, పార్టీ క‌ల్చ‌ర్‌తో పాటు ఒత్తిడి, డిప్రెష‌న్ కార‌ణ‌ం
  • విశ్లేషిస్తున్న మానసిక నిపుణులు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్‌ 6 (విధాత‌): డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎన్ని ర‌కాల చ‌ర్య‌లు చేప‌ట్టినా… త‌మ‌ను అడ్డుకునే వాళ్లు లేర‌న్నతీరుగా స్మ‌గ్ల‌ర్లు పాల‌కుల‌కు స‌వాల్ విసురుతున్నారు. స్మ‌గ్ల‌ర్లు డ్ర‌గ్స్ య‌థేచ్ఛగా అమ్మ‌డ‌మే కాదు.. యూనివ‌ర్సిటీలు, కాలేజీలు, చివ‌ర‌కు పాఠ‌శాల‌లు, ఐటీ కంపెనీల సెంట‌ర్ల‌ను త‌మ అడ్డాలుగా మార్చుకున్నార‌ని తెలుస్తున్నది. ఇటీవ‌లే మ‌హేంద్ర యూనివ‌ర్సిటీలో డ్ర‌గ్స్ దొర‌క‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం అంద‌రికి తెలిసిందే. డ్ర‌గ్స్ వినియోగపై కాంప్రెన్సివ్ నేష‌న‌ల్ స‌ర్వే (2019) ప్ర‌కారం తెలంగాణ‌లో 19.07 ల‌క్ష‌ల మందికి వివిధ డ్ర‌గ్స్ వినియోగ వ్య‌స‌నం ఉన్న‌ట్లు తెలిసింది. ఇది దేశంలోని వ్య‌స‌న ప‌రుల‌లో 2.47 శాతంకు స‌మాన‌మ‌ని పేర్కొన్న‌ది. డ్ర‌గ్స్ కేసులను ప‌రిశీలిస్తే ఎన్‌డీపీఎస్ చ‌ట్టం కింద 2014లో 148 అరెస్టులు జ‌రిగితే 2023లో 1218 కేసులలో 1991 మంది అరెస్టు కాగా 20,904 కిలోల డ్ర‌గ్స్ ధ్వంసం చేశారు. 2024 జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కే 1982 కేసులు న‌మోదు చేసి 3,792 మంది అరెస్టు చేసి, రూ.179 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకొని రూ. 47 కోట్ల ప్రాప‌ర్టీ స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. ఈ లెక్క‌ల‌ను ప రిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో డ్ర‌గ్స్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు అర్థం అవుతున్న‌ది.

డ్ర‌గ్స్ వినియోగం పెరుగుతున్న తీరు.. మ‌రో వైపు ఇక్క‌డే త‌యారీ యూనిట్లు వెలిసిన తీరును ప‌రిశీలిస్తే స్మ‌గ్ల‌ర్లు తమనేమీ చేయలేరంటూ పాల‌కుల‌కు స‌వాల్ విసురుతున్నార‌ని పరిశీలకులు అంటున్నారు. డ్ర‌గ్స్ స్మ‌గ‌ర్ల‌కు కూడా బ‌డా నేత‌ల‌తో ఏవైనా సంబంధాలు పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారా? అనే సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత వ‌రుస‌గా 10 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కేసీఆర్.. కేంద్రం 1985లో తీసుకు వ‌చ్చిన ఎన్‌డీపీఎస్ చ‌ట్టాన్ని క‌ఠినంగా అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. జామీన్లు ఇవ్వ‌కుండా ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాటు చేసి, సెక్ష‌న్ 27(ఏ) కింద డ్ర‌గ్ ట్రాఫికింగ్‌, ఫండింగ్ కింద శిక్ష‌లు విధించారు. ఎక్సైజ్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసి అధికారుల‌కు ప్ర‌త్యేక అధికారాలు క‌ల్పించారు. టాలీవుడ్ డ్ర‌గ్ కేసులు వెలుగులోకి రాగానే ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసి సినీ ప్ర‌ముఖులు, కాలేజీ విద్యార్థుల‌పై విచార‌ణ జ‌రిపించారు. అయినా హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ పెరుగుతుండ‌టంతో 2021లో సైబ‌ర్ నార్కొటిక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2022లో హైద‌రాబాద్ సిటీ పోలీస్ కింద ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (హె- న్యూ) ఏర్పాటు చేసి ప‌బ్‌లు, బార్‌లు, కాలేజీ వద్ద నిఘా పెంచారు.

ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ డ్ర‌గ్స్ వినియోగం మాత్రం పెరిగిందని అర్థం అవుతున్న‌ది. దీంతో 7 డిసెంబ‌ర్‌ 2023 లో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ డ్ర‌గ్స్‌కు అడ్డాగా మారింద‌ని ఆరోపించారు. తెలంగాణ అంటే ఉద్య‌మాలు, పోరాటాల గ‌డ్డ‌- డ్ర‌గ్స్‌కు అడ్డాగా మారితే అవ‌మాన‌క‌రం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డ్ర‌గ్ ఫ్రీ తెలంగాణ ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం మోపుతాన‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి ఈగ‌ల్‌ (ఎలైట్ యాక్ష‌న్ గ్రూప్ ఫ‌ర్ డ్ర‌గ్ లా ఎన్ ఫోర్స్ మెంట్‌) టీమ్‌ను ఏర్పాటు చేశారు.

రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్‌పై ఉక్కుపాద మోపుతానని టీచ‌ర్స్ డే రోజున ప్ర‌క‌టించి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే ముంబై పోలీసులు హైద‌రాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున డ్ర‌గ్స్ త‌యారు చేస్తున్న ప‌రిశ్ర‌మ‌పై దాడి చేసి, దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్ర‌గ్స్ ఫ్యాక్ట‌రీని సీజ్ చేసి, 13 మందిని అరెస్టు చేశారు. డ్ర‌గ్స్ ఉత్ప‌త్తి కేంద్రం బ‌య‌ట ప‌డ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కలవరపరిచింది. తెలంగాణ ఏటు పోతుంద‌న్న సందేహాన్ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. హైద‌రాబాద్ లో వినియోగం స్థాయి నుంచి ఉత్ప‌త్తి చేసే స్థాయికి పెరిగిందా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి.

నిఘా వైఫ‌ల్యంతోనేనా..?
ప్ర‌భుత్వాధినేత‌లు డ్ర‌గ్స్ ప‌ట్ల క‌ఠినంగా ఉంటామ‌ని ఎంత చెప్పినా.. ఆ స్థాయిలో నిఘా క‌రువ‌వ‌డంతోనే డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా నుంచి ఉత్ప‌త్తి కి కేంద్రంగా మార్చుకునే వ‌ర‌కు స్మ‌గ్ల‌ర్లు ఎదిగార‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. 2021లో మ‌ల్కాజిగిరి, బోడుప్ప‌ల్ ప్రాంతాల్లో ఎండీఎంఏ త‌యారీ లాబ్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. అలాగే 2022లో జీడిమెట్ల ఇస్మాయిల్ ఖాన్ గూడ‌లో స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ ర‌హ‌స్యంగా న‌డుస్తున్న‌ ఐస్ డ్ర‌గ్ త‌యారీ ల్యాబ్‌ను ప‌ట్టుకున్న‌ది. తాజాగా భారీ ఎత్తున డ్ర‌గ్స్ త‌యారు చేసి దేశ‌, విదేశాల‌కు స‌ర‌ఫ‌రా చేసే ఒక ఫార్మా కంపెనీ మేడ్చ‌ల్‌లో బ‌య‌ట ప‌డింది. దీంతో ఇంకా ఏమైనా త‌యారీ కేంద్రాలున్నాయా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌భుత్వాలు వినియోగ దారుల‌పై కేంద్రీక‌రించి త‌యారీ దారుల‌పై త‌గిన దృష్టి పెట్ట‌లేద‌న్నవిమ‌ర్శ‌లున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం.. ఇక్క‌డ ఐటి ప‌రిశ్ర‌మ భారీ ఎత్తున విస్త‌రించింది. ఇక్క‌డ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉన్న‌బందు వ‌ల్ల చిన్న ల్యాబ్‌ల‌ను గుర్తించ‌డం క‌ష్ట‌మ‌ని స్మ‌గ్ల‌ర్లు భావించిన‌ట్లు అర్థం అవుతున్న‌ది. మ‌రో వైపు హైద‌రాబాద్‌ ఫార్మాకు హ‌బ్ కావ‌డంతో సుల‌భంగా డ్ర‌గ్స్ త‌యారీకి కావాల్సిన రా కెమిక‌ల్స్ సుల‌భంగా దొరుకుతాయ‌ని భావించ‌డమే ప్ర‌ధాన కార‌ణం.. మ‌రో వైపు ఫార్మాసిటీకి ఉన్న అధారాన్ని కొంత మంది దుర్వినియోగం చేసి డ్ర‌గ్స్ త‌యారీ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తుకున్న‌ట్లు అర్థం అవుతుంద‌ని నిపుణులు చెపుతున్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన త‌రువాత‌నే కొన్ని ల్యాబ్‌ల‌ను గుర్తించి కూల్చిన‌ట్లు పోలీసులు చెపుతున్నారు.

బ‌ల‌హీనతే ఆస‌రాగా..
పోటీ ప్ర‌పంచంలో విద్యార్థులు, యువ‌త తీవ్ర ఒత్తిడికి గురై డిప్రెష‌న్‌కు గుర‌వుతున్నార‌ని సైకాల‌జీ నిపుణులు చెపుతున్నారు. ఇలా ఒత్తిడికి గుర‌వుతున్నవారితో పాటు యువ‌త‌లో ఫ్యాష‌న్, పార్టీ క‌ల్చ‌ర్ కూడా తోడు కావ‌డంతో హైద‌రాబాద్‌లో డ్ర‌గ్ క‌ల్చ‌ర్ పెరుగుతుంద‌న్న అభిప్రాయం ఏర్ప‌డుతున్న‌ది. డీ అడిక్ష‌న్ సెంట‌ర్ల‌లో పెరుగుతున్న కేసుల‌ను పరిశీలిస్తే డ్ర‌గ్స్ వినియోగం పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతున్న‌ది. డి అడిక్షన్ సెంట‌ర్‌లో 2023-24లో 6,995 మంది చేర‌గా, 2024-2025లో 12,032 మంది చేరారు. ఇది ఒక్క ఏడాదిలో డి ఆడిక్ష‌న్ సెంట‌ర్‌లో చేరిన వారి పెరుగుద‌ల 72 శాతం పెరిగింద‌ని చెపుతున్నారు. విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, ఇత‌ర రంగాల‌లో ప‌ని చేస్తున్న‌వారిపై ఒత్తిడి లేని విధంగా ప‌ని చ‌దువు ఉండాల‌ని నిపుణులు చెపుతున్నారు.