Kaleshwaram Project CBI | క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత? రాహుల్ అలా.. రేవంత్ ఇలా..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన మంత్రివర్గ నిర్ణయమా? లేదా సీఎం హోదాలో రేవంత్ తీసుకున్న సొంతంగా నిర్ణయమా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విధాత):
‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగం దాడికి గురవుతున్నది. దానిని (రాజ్యాంగాన్ని) కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను విభాగం, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థలను బీజేపీ నియంత్రిస్తున్నది’
– 2024, అక్టోబర్ 19న రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో రాహుల్ గాంధీ..
‘ఈడీ, సీబీఐ, ఐటీ మొదలైనవి ఇంకెంత మాత్రం ప్రభుత్వ సంస్థలు కావు. అవి బీజేపీ ‘ప్రతిపక్ష నిర్మూలన సెల్’గా మారిపోయాయి. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ.. తన అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని నడిపిస్తున్నది.’
– 2024 జనవరి 31న ట్వీట్..
Kaleshwaram Project CBI | కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన మంత్రివర్గ నిర్ణయమా? లేదా సీఎం హోదాలో రేవంత్ తీసుకున్న సొంతంగా నిర్ణయమా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటం చేస్తున్నది. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్‌ల వంటివాటిని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నదని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాటిపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో అదే సీబీఐకి కాళేశ్వరం కేసును రేవంత్ రెడ్డి అప్పగించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే దక్కన్ హెరాల్డ్ కేసులో సీబీఐ రాహుల్‌కు, సోనియా గాంధీలకు నోటీస్‌లు ఇచ్చి, విచారణకు పిలిచిన విషయం రేవంత్‌కు తెలియనిది కాదు. రాహుల్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాడు.. తెలంగాణ సీఎంగా నేడు మద్దతు తెలిపి క్రియాశీల పోరాటంలో భాగస్వామి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సీబీఐని రంగంలోకి దింపడం, రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి ఇప్పటి వరకూ ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అన్నింటికి మించి సీబీఐ విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కాదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఆ విషయం అప్పటి వరకూ సహచర మంత్రులకు కూడా తెలియదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఆదివారానికి వాయిదా పడిన తర్వాత క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో చర్చలో ఎవరెవరు పాల్గొనాలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మొత్తంగా బీఆరెస్‌ను దోషిగా నిలబెట్టేలా చర్చ ఉండాలని అనుకున్న సమయంలో కూడా సీబీఐ విచారణకు ఆదేశించే అంశం ప్రస్తావనకు రాలేదని ఒక మంత్రి తన సన్నిహితులకు చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్‌లో అనుకున్న మేరకు ముందుగా ప్రిపేర్ కావడంతో అసెంబ్లీలో బీఆరెస్ వాదనకు గట్టిగానే కౌంటర్ ఇచ్చి, ఇరుకున పడేశారు. సభలో కాంగ్రెస్ పైచేయి సాధించిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరిగింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ ఫలించిందని చెపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సీబీఐకు అప్పగించాలన్న నిర్ణయాన్ని చివరి వరకు మంత్రివర్గ సహచరులకు కూడా చెప్పకుండా ఎందుకు రహస్యంగా ఉంచారన్న చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది.
ఒక పక్క సీబీఐ, ఈడీ, ఎన్నిక కమిషన్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్న ఈ సమయంలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీబీఐ విచారణ కోరడం గమనార్హం. దీనిపై ముందుగా పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకున్నారా? రాహుల్ గాంధీకి తెలిసే ప్రకటన చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్‌ను టేబుల్ చేసిన తరువాత కేరళలో ఏఐసీసీ సెక్రటరీ జనరల్ కేసీ వేణుగోపాల్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్‌తో కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించే విషయాన్ని చర్చించారా? చర్చిస్తే ఆయన అంగీకారం తెలిపారా? లేదా అసలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారా? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జరుగుతున్నది. ఇది ఇలా ఉండగా బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మరుసటి రోజు గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయంపైనే కాంగ్రెస్ అగ్రనేతలకు ఫిర్యాదు చేయడానికి వీరు ఢిల్లీకి వెళుతున్నారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతున్నది.