Prathyusha case| నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్దార్ధ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు సిద్దార్ధ రెడ్డికి విధించిన రెండేళ్ల శిక్షను సమర్ధిస్తూ తుది తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.

Prathyusha case| నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

విధాత : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్దార్ధ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సిద్దార్ధ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రత్యూష తల్లి సరోజిని సైతం నిందితుడికి సరైన శిక్ష పడలేదని,శిక్షను పెంచాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు సిద్దార్ధ రెడ్డికి విధించిన రెండేళ్ల శిక్షను సమర్ధిస్తూ తుది తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.

అయితే సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రత్యూష తల్లి సరోజిని మాత్రం కోర్టు తీర్పు గౌరవిస్తానంటునే సరైన న్యాయం జరుగలేదని  అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో రాష్ట్ర పోలీసులు, సీబీఐ విచారణ సరైన కోణంలో జరుగలేదని, పోస్టుమార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకోకపోవడంతో నిందితుడు పెద్ద శిక్షను తప్పించుకున్నాడని ఆరోపించింది. మునుస్వామి పోస్టుమార్టమ్ రిపోర్టులో ప్రత్యూషను ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా పేర్కొన్నారని, న్యాయస్థానాలు మాత్రం త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగానే విచారణ, తీర్పు వెలువరించాయని సరోజిని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..?

తెలుగు సినిమా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న దశలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రత్యూష అనుమానస్పద స్థితిలో చనిపోయారు. సినిమాల్లోకి రాకముందే నటి ప్రత్యూష తనతోపాటు ఇంటర్ చదువుతున్న సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడినట్లుగా అప్పట్లో కేసు విచారణలో వెలుగు చూసింది. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి రాగా.. సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30 నుంచి 8 గంటల మధ్యలో వీరిద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24వ తేదీన చనిపోగా.. సిద్దార్ధ రెడ్డి మాత్రం ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. వారిద్దరూ తాగిన కూల్ డ్రింక్ లో పురుగుమందు కలుపుకున్నట్లు పరీక్షలో గుర్తించారు. ఆర్గానోఫాస్పేట్ కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం.. మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది.

ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడిపై సెక్షన్ 306 (ఆత్మహత్య ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు..రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు.

ఈ తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సీబీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది నచికేత జోషి వాదనలు వినిపిస్తూ… కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని అన్నారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని.. అలా కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని అన్నారు. ఇద్దరూ కలిసి పురుగుమందు తీసుకున్నందు వల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థ్ రెడ్డి తరపు న్యాయవాది నాగముత్తు, ఎల్, నరసింహారెడ్డి వాదించారు. 24 ఏళ్ల క్రితం చనిపోయిన ప్రత్యూష కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పుపై..  సుప్రీంకోర్టులో  14ఏళ్ల విచారణ  అనంతరం  తుది తీర్పు వెలువడటం  విశేషం.