• Telugu News
  • /National

కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి!

కొడుకు చదువు కోసం ఓ తండ్రి చేసిన సాహసం సోషల్ మీడియాను ఊపేస్తుంది. కళ్ల ముందు ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న నది వరద ఉదృతిని లెక్క చేయకుండా ఆ తండ్రి తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకుని ప్రాణాలకు తెగించి నదిని దాటిన వీడియో వైరల్ అవుతోంది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 17, 2026, 12:34 pm IST
Read Time: 3 mins
కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి!

కొడుకు చదువు కోసం ఓ తండ్రి చేసిన సాహసం సోషల్ మీడియాను ఊపేస్తుంది. కళ్ల ముందు ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న నది వరద ఉదృతిని లెక్క చేయకుండా ఆ తండ్రి తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకుని ప్రాణాలకు తెగించి నదిని దాటిన వీడియో వైరల్ అవుతోంది. ఆ తండ్రి తన కొడుకు కోసం చేసిన సాహసం చూస్తుంటే భగవాన్ శ్రీ కృష్ణుడిని తండ్రి వసుదేవుడు యమునా నదిని దాటించిన ఘట్టం గుర్తుకు రాకమానదు.

నేపాల్‌లో భారీ వర్షాలతో బీహార్‌లోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మసాన్ నది కూడి భీకర వరదలతో పోటెత్తింది. అయితే బగాహా ప్రాంతంలో మసాన్ నది వరద ఉదృతితో ఆవలి వైపు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే స్కూల్‌కు వెళ్లాల్సిన తన కుమారుడిని సమయానికి పాఠశాలకు చేర్చేందుకు తండ్రి చేసిన ప్రయత్నాలను మాత్రం ఆ నది వరదలు భయపెట్టలేకపోయాయి. తండ్రి తన కుమారుడిని భుజాలపై ఎత్తుకుని కళ్ల ముందు వరద పోటుతో ఊరకలెత్తుతున్న మాసాన్ నదిని దాటాడు.

ఈ ప్రయత్నంలో ఏ మాత్రం తేడా జరిగినా వారికి ప్రాణాపాయం తప్పని పరిస్థితి ఉంది. తన పిల్లాడిని స్కూల్ కు పంపే బాధ్యత ముందు ప్రమాదం కూడా చిన్నదేనని ఆ తండ్రి నిరూపించాడు. అయినా కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి చేసిన ఈ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత సమస్యలను ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.