విధాత : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్‌లో.. సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) పడిపోతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-6’ నివేదిక ప్రకారం భారత్‌లో ఫెర్టిలిటీ రేటు గణనీయంగా తగ్గింది. భారతదేశ చరిత్రలో ఫెర్టిలిటీ రేటు రీప్లేస్‌మెంట్‌ కంటే కిందకి పడిపోయినట్లు వెల్లడించింది. సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 కంటే అధికంగా ఉండాలి. అయితే, దేశం మొత్తంలో ఈ టీఎఫ్‌ఆర్‌ 2.3 నుంచి 1.9కి పడిపోయింది. ప్రస్తుతం దేశ జాతీయ సగటు 2.0గా ఉంది.

ఈ గణాంకాలను ఓ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిపై తాజాగా టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా స్పందించారు. భారత్‌లో జననాల రేటు రీప్లేస్‌మెంట్‌ కంటే కిందకు పడిపోతోందని పేర్కొన్నారు. దీన్ని మస్క్‌ రీపోస్టు చేశారు. భారత్‌లో జనన రేటు చాలా ఏళ్ల క్రితమే రీప్లేస్‌మెంట్ కంటే కిందకి పడిపోయిందని పేర్కొన్నారు. అత్యంత విద్యావంతులు ఉన్న ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఉత్తరాదిలో తగ్గుదల…దక్షిణాదిలో స్వల్ప పెరుగుదల

ఒకప్పుడు అత్యధిక జనాభా వృద్ధిరేటుతో దేశానికి పెద్ద సవాలుగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-6’ నివేదిక వెల్లడించింది. ఈ రాష్ట్రాలు ఇప్పుడు జాతీయ సగటుకు అత్యంత సమీపంలోకి వచ్చాయి. బాలికల విద్య పెరగడం, బాల్య వివాహాలు తగ్గడంతో పాటు ప్రభుత్వాలు విస్తృతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. తాజా నివేదికలోని రాష్ట్రాల వారీ వివరాలను పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు గతంలో 2.4గా ఉండగా, అది ఇప్పుడు 2.2కు పడిపోయింది. దేశంలోనే ఎల్లప్పుడూ అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదు చేసే బిహార్‌లో సైతం తగ్గుదల నమోదు కావడం విశేషం. బీహార్ లో గత సర్వేలో 3.0గా ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.7కు తగ్గింది.

అతి తక్కువ రాష్ట్రంగా సిక్కిం

దేశంలోనే అత్యంత తక్కువ సంతానోత్పత్తి రేటు కలిగిన రాష్ట్రంగా సిక్కిం 1.0తో నిలిచింది. ఇకపోతే దేశంలోనే అత్యంత వేగంగా సంతానోత్పత్తి రేటు తగ్గిన ప్రాంతంగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రికార్డు సృష్టించింది. ఇక్కడ గతంలో 2.7గా ఉన్న సంతానోత్పత్తి రేటు ఏకంగా 2.2కు పడిపోయింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మిజోరాం వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాలలో కూడా జననాల రేటు సగటున 0.3 చొప్పున క్షీణించింది. మరోవైపు గతంలో జనాభా నియంత్రణ కఠినంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలలో క్రమంగా సంతానోత్పత్తి రేటు.. ప్రస్తుతం స్వల్ప పెరుగదల కనిపిస్తోంది. తెలంగాణలో గతంలో 1.8గా ఉన్న రేటు, తాజా సర్వేలో అది 1.9కి పెరిగింది. ఏపీ, కర్ణాటకల్లో ఈ రేటు 1.7 నుంచి 1.8కి చేరింది. కేరళలో కూడా 1.8కి పెరిగింది. ఆయా రాష్ట్రాలలో జనాభా నియంత్రణ నిబంధనల సఢలింపు..జనాభా పెరుగుదల ఆవశ్యకతపై జనాల్లో అవగాహాన వంటి కారణాలు సంతానోత్పత్తి రేటు పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని అంచనా వేశారు.