Monkey | కోతి క‌రెన్సీ నోట్ల వ‌ర్షం కురిపించ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇది నిజ‌మే..! ఎంతో చురుకుగా ఉండే కోతులు.. ఆహారం కోసం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో సంచ‌రిస్తుంటాయి. ఈ క్ర‌మంలో మ‌న‌షుల చేతుల్లో ఏవి ఉంటే వాటిని ఎత్తుకుపోతాయి. ఆహార ప‌దార్థాలే కాదు.. చంటి పిల్ల‌ల‌ను ఎత్తుకుపోయిన ఘ‌ట‌న‌లు కూడా అనేకం చూశాం. తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ కోతి క‌రెన్సీ నోట్ల మూట‌ను ఎత్తుకెళ్లింది. ఇక చెట్టుపైకి ఎక్కి నోట్ల వ‌ర్షం కురిపించింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవ‌ర‌ణ‌లో మే 30న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

బులంద్‌షార్‌కు చెందిన ర‌వీంద్ర అనే వ్య‌క్తి స్టాంప్ పేప‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు రూ. 2 ల‌క్ష‌ల‌తో కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించాడు. ఇక న‌డుచుకుంటూ వెళ్తున్న ర‌వీంద్రను కోతి గ‌మ‌నించింది. అత‌ని చేతిలో ఉన్న నోట్ల క‌ట్ట‌ల బ్యాగును అప‌హ‌రించింది కోతి. దీంతో ర‌వీంద్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాడు.

క్ష‌ణాల్లోనే చెట్టుపైకి ఎక్కిన కోతి.. ఆ బ్యాగును ఓపెన్ చేసింది. ఇక చెట్టుపై నుంచే క‌రెన్సీ నోట్ల‌ను కింద‌కు విసిరేసింది. దీంతో అక్క‌డున్న వారంతా ఆ నోట్ల‌ను ఏరి.. ర‌వీంద్ర‌కు అప్ప‌జెప్పారు. మొత్తం రూ. 2 ల‌క్ష‌లు కోతి కింద‌కు విసిరేసింద‌ని, ఎలాంటి నష్టం జ‌ర‌గ‌లేద‌ని ర‌వీంద్ర తెలిపాడు. ప్ర‌స్తుతం కోతి చిలిపిచేష్ట‌ల వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి.