CM Revanth Reddy | కాళేశ్వరం ప్రజల సొత్తు.. దాన్ని నిరుపయోగం కానీయం… : సీఎం రేవంత్‌ రెడ్డి

కాశేళ్వరం ప్రాజెక్టు బీఆరెస్‌ నేతల సొంత ఆస్తి కాదని, అది ప్రజల సొత్తని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దానిని వృథా కానీయబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తుల్లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటి మరమ్మతును పూర్తి చేస్తామని తెలిపారు.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 22, 2026 8:29 PM IST
CM Revanth Reddy | కాళేశ్వరం ప్రజల సొత్తు.. దాన్ని నిరుపయోగం కానీయం… : సీఎం రేవంత్‌ రెడ్డి
  • ప్రజా తీర్పులెన్ని వచ్చినా బీఆరెస్‌ నేతల్లో మార్పులేదు
  • ఇంకా ప్రజలే తప్పు చేశారనే భావనలోనే గులాబీ నాయకత్వం
  • వచ్చే 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే
  • కేసీఆర్ చినజీయర్ సూక్తులు వింటూ గడపాలి
  • మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

CM Revanth Reddy | తెలంగాణలో ప్రజా తీర్పులెన్ని వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో మార్పు రావడంలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ, ఉప ఎన్నికలు, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజా తీర్పు వచ్చినా వాళ్లలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. పైగా ప్రజలు తప్పు చేసారన్న భావన లో నే మాట్లాడుతున్నారని, ప్రజల పైన విషం కక్కే ప్రయత్నం చేయొద్దని సీఎం హితవుపలికారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం ఆయన పై విధంగా స్పందించారు. ఎంత జటిలమైన సమస్య కైనా చర్చలతో నే పరిష్కారం దొరుకుతుందని పక్క రాష్ట్రాలతో చర్చలకు ఎలాంటి భేషజాలు లేవంటూ స్పష్టం చేశారు. ప్రతి పొలానికి సాగు నీరు, ప్రతి ఇంటికి తాగు నీరు అందిచడమే తమ లక్ష్యంగా చెప్పారు. 2034 వరకు అధికారం మాదేనంటూ మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ హక్కులు కాపాడుకుంటాం

నికర,వరద జలాలలో హక్కులను వదులుకోబోమని సీఎం తేల్చిచెప్పారు. గోదావరి జలాల వివాదం రాజకీయ రంగు పులుముకుందని, ఆరోపణలు,అబద్ధాల ప్రచారాల వల్ల ప్రయోజనం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, అప్పుడే ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తే బాగుండేదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్ట్ లు నిర్లక్ష్యానికి గురయ్యాయని, నిధులు,నీళ్ల నినాదంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. పదేళ్ళలో చిత్త శుద్ధితో ప్రాణహిత, ఎస్ ఆర్ ఎస్ పి, దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 967 టీఎంసీ వాటాను వినియోగించు కుంటే బాగుండేదన్నారు. అప్పుడు మనం వరద జలాల్లో వాటా అడిగే వాళ్ళమని, కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకు వెళ్లే అవకాశం ఉండేదన్నారు. గోదావరి పైన కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోలేదని, 2001 లో దేవాదులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటి కి నిర్మాణం కొనసాగుతుందన్నారు. చిత్త శుద్ధితో నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నా మాకు నిధుల కొరత ఉందన్నారు. 8.11 లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ పైన ఉందన్నారు. రెండేళ్లలో ఎట్టి పరిస్థితిలో ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలన్న చిత్త శుద్ధి మాకు ఉందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సత్వరమే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. రూ. 6000 కోట్ల అంచనాల తో మొదలైన దేవాదుల ఇప్పుడు 18,500 కోట్లకు చేరిందన్నారు. తుమ్మిడి హట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పైన ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.

కాళేశ్వరం నిరుపయోగం కానివ్వం

కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగం కానివ్వమని, భూమి లోపల ఎలాంటి మార్పులు వచ్చేయో ఏజెన్సీ లు పరిశీలిస్తున్నవంటూ భవిష్యత్ లో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కాళేశ్వరం వాళ్ల సొంత ఆస్తి కాదు..ప్రజల సొమ్ము..గాలికి వదిలేయమని, మళ్లీ ఉపయోగం లోకి తీసుకు వస్తామన్నారు. రెండేళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తి పోయకున్నా, వరి దిగుబడి లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలబడిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కల్పించినవన్ని భ్రమలేనని తేలిపోయిందన్నారు. మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల ఎందుకు నిర్మించారో మేము ఇప్పుడు విమర్శలు చేయడం లేదు, కృష్ణా నది జలాల పైన అపోహలు సృష్టించారు..అసెంబ్లీ లో చర్చ పెట్టి అన్నిటికీ సమాధానం ఇచ్చామన్నారు. పైగా పక్కరాష్ట్రానికి సహకరిస్తుమంటున్నారని, తెలంగాణలో పోటీ చేసి ప్రజా ప్రతినిధి ఎవరైనా ఏపీ కి సహకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలి..చింత వద్దన్నారు. కేసీఆర్ వాకింగ్,యోగ చేయాలి మంచి పుస్తకాలు చదవాలి..చిన జీయర్ స్వామి సూక్తులు, ప్రవచనాలు వినాలంటూ ఆకాక్షించారు.