గీతాంజలి జెమ్స్ అధినేత మొహుల్ చోక్సీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నుంచి సుమారు 13వేల కోట్ల రూపాయల రుణాలుతీసుకుని.. అసలు కాదు కదా.. మిత్తీ కూడా చెల్లించలేదు. 2007 నుంచి ఈయన దోపిడీ ప్రారంభం అవుతుంది. ఆ ఏడాది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతోపాటు.. ప్రైవేటు బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. 31 బ్యాంకులతో కన్సార్టియం ఏర్పాటు చేసిన ఐసీఐసీఐ బ్యాంకు.. గీతాంజలి జెమ్స్‌కు రూ.5,200 కోట్ల రుణం మంజూరు చేసింది. రుణాలు ఎగ్గొట్టి పోయిన మెహోల్ చోక్సీపై 2018లో కేసులు నమోదు చేసిన ఈడీ.. విచారణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న గీతాంజలి షోరూమ్‌లు, దాని అనుబంధ కంపెనీల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి.. రికార్డులు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈడీ మెహుల్ చోక్సీతో పాటు ఇతరులపై తొలిసారి మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. 2010 సంవత్సరం నుంచి బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను ఇతర కంపెనీలకు మళ్లించడం మొదలు పెట్టారు. ఎల్ఓయూ (లెటర్స్ ఆప్ అండర్ టేకింగ్స్) సదుపాయాన్ని దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. తొలుత ఎల్ఓయూను 90 రోజులకు తీసుకుని దాన్ని 365 రోజులకు పొడిగించుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగం. రుణాలు విదేశాలలోని కంపెనీలకు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. 2017లో నక్షత్ర వరల్డ్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలని ప్లాన్ చేసి, ఐపీవో ద్వారా వచ్చిన నిధులను బ్యాంకులకు తిరిగి చెల్లించారా లేదా అనేదానిపై విచారించగా… లిస్టింగ్ చేయలేదని వెలడైంది. ఈ కుంభకోణం కుంభకోణం బయటకు రాగానే 2018 సంవత్సరంలో చోక్సీ దేశం విడిచి పరారీ అయ్యాడు. ఆంటిగ్వా చేరుకుని పౌరసత్వం తీసుకున్నాడు. 2023లో వైద్య పరీక్షల కోసం బెల్జియం చేరుకోగా, భారత ప్రభుత్వం వినతి మేరకు బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్టు చేశారు. ఇంకా ఆయనను భారత్‌కు అప్పగించలేదు.
నీరవ్ మోదీ కథ
గుజరాత్‌లోని పాలన్ పూర్‌లో జన్మించిన నీరవ్ మోదీది మరో కథ. బెల్జియంలోని ఆంట్‌వెర్స్‌లో పెరిగిన నీరవ్ మోదీ.. కుటుంబం తరాలుగా వజ్రాల వ్యాపారం చేస్తున్నది. 19 సంవత్సరాల వయస్సులో తన మేనమామ మెహుల్ చోక్సీతో కలిసి ముంబై వెళ్లాడు. తదుపరి మోదీ యూఎస్‌లోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూలులో చేరినప్పటికీ, చదువు అబ్బక మధ్యలోనే మానేశాడు. 1989లో ఇండియా వచ్చి.. 1999లో ఫైర్ స్టోన్ కంపెనీ ప్రారంభించాడు. ఇది వజ్రాల సేకరణ, వ్యాపార సంస్థ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018లో హాంగ్ కాంగ్‌లోని మోదీ కంపెనీలపై రిట్ వేసింది. రుణాలు తిరిగి చెల్లింపులో విఫలమైనట్లు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు 2018లో ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఎల్ఓయూ పొందడం ద్వారా మోదీ ఆయన కంపెనీలు పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.28వేల కోట్లు మోసం చేశారని వెల్లడైంది. ఈ కేసును ఈడీ విచారిస్తోంది. ఆయనపై అరెస్టు వారంట్ జారీ తరువాత 2019 మార్చిలో లండన్‌లో అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన చేసుకున్న బెయిల్ దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. 2025 లో యూకే కోర్టుకు భారత్ హామీ ఇచ్చింది. మోదీని అప్పగిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు బకాయిల కేసులో ఆయనను ప్రశ్నించబోమని అఫిడవిట్ సమర్పించింది. తనను భారతదేశానికి అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని మొరపెట్టుకోగా.. మానవతా దృక్ఫథంతో అప్పగింత వినతిని కోర్టు తిరస్కరించింది. రూ.523 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. ఆయన భార్యకు ముంబైలో ఉన్న రూ.900 కోట్ల విలువైన ఇంటిని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు. రాజస్థాన్‌లో పవన విద్యుత్ ప్లాంట్లు, అహ్మద్ నగర్ జిల్లా కర్జత్‌లో సౌర విద్యుత్ ప్లాంట్ స్వాధీనం చేసుకున్నారు. 2020లో మనీ లాండరింగ్ కింద రూ.1,400 కోట్ల ఆస్తిని జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించడంతో ఈడీ చర్యలు తీసుకున్నది. ఇందులో రూ.1,052 కోట్ల ను స్వాధీనం చేసుకుని, ఆ సొమ్మును బ్యాంకులకు తిరిగి ఇచ్చారు.
మెహుల్ చొక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు జంప్…
నీరవ్ మోదీ, మెహుల్ చొక్సీ పెద్ద ఎత్తున బ్యాంకులకు బకాయి పడ్డారు. ఇద్దరూ మొత్తం 9 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసి విదేశాలకు పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎస్.బీ.ఐ, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంకు, పంజాబ్ అం సింధ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులకు రూ.54,225 కోట్లు బకాయి పడ్డారు.
ఐవీఆర్‌సీఎల్ మొత్తం అప్పులు రూ.27,418 కోట్లు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పనిచేస్తున్న ఐ.వీ.ఆర్.సీ.ఎల్ దాదాపు రూ.27,4418 కోట్లకు పైగా పలు బ్యాంకులకు బకాయిలు పడింది. ఈ కంపెనీని ఈ.సుధీర్ రెడ్డి ప్రారంభించారు. గతేడాది ఆయన మరణించారు. ఎస్.బీ.ఐ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి రూ.4,800 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి. అప్పులు చెల్లించలేని దుస్థితికి చేరుకోవడంతో దివాలా చట్టం కింద 2019లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లిక్విడేషన్ కు ఆదేశించింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల ప్రకటన తరువాత మొండి బకాయిల ఖాతాల జాబితాలోని 28 పెద్ద రుణ గ్రహీతలలో ఐ.వీ.ఆర్.సీ.ఎల్ ఒకటి. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ నిర్మాణ సంస్థలో మెజారిటీ వాటాను దక్కించుకోవాలని ఒకనొక దశలో బ్యాంకులు నిర్ణయించాయి. ఇందుకోసం ఎస్.బీ.ఐ నాయకత్వంలో ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐఓబీ, కెనెరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లు కన్సార్టియాం గా ఏర్పడ్డాయి. ఎస్.బీ.ఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులకు ఎగవేసిన ప్రధాన రుణధాతలలో ఒకటిగా ఉంది. అయితే ఆస్తుల అమ్మకం ప్రక్రియ మొదటికి వచ్చింది. ఐ.వీ.ఆర్.సీ.ఎల్ ను రూ.1,200 కోట్లకు దక్కించుకున్న బిడ్డర్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి నిర్ణీత సమయంలోగా కంపెనీ రుణదాతలకు చెల్లింపులు జరపడంలో విఫలం అయ్యారు. దీంతో ఎస్.బీ.ఐ నాయకత్వంలోని కన్సార్టియం 2017 నుంచి సాగుతున్న దివాలా పరిష్కార ప్రక్రియను మళ్లీ ప్రారంభించాల్సిన దుస్థితి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ లోని కొలకతా గిరీష్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని 2016 మార్చి నెలలో వివేకానంద ఫ్లైఓవర్ లో ఒక భాగం ప్రజలపై కూలింది. దీని కింద నలిగి 26 మంది మరణించగా, దీనిని నిర్మాణం చేసిన ఐ.వీ.ఆర్.సీ.ఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఏజీకే మూర్తి మాట్లాడుతూ, ఇది కార్యమని ఘోరంగా వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు దక్కించుకోవడానికి అత్యల్ప బిడ్ సమర్పించి, ప్రతి స్థాయిలో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మూలంగా నాణ్యత దెబ్బతిని 26 మంది చనిపోయారని ఐఐటీ ఖరగ్ పూర్ తన నివేదికలో స్పష్టం చేసింది.