Nirav Modi | నీరవ్‌ మోదీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ విక్రయించేందుకు లండన్‌ కోర్టు అనుమతి

Nirav Modi | నీరవ్‌ మోదీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ విక్రయించేందుకు లండన్‌ కోర్టు అనుమతి

Nirav Modi | లండన్‌లోని నీరవ్ మోదీ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను విక్రయించేందుకు లండన్ హైకోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. 52.5 లక్షల పౌండ్లకు తగ్గకుండా (రూ.55కోట్లు) తగ్గకుండా విధించాలని షరతులు విధించింది. న్యాయమూర్తి మాస్టర్‌ జేమ్స్‌ బ్రైట్‌వెల్‌ ఈ కేసు విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఆగ్నేయ లండన్‌లోని థేమ్‌సైడ్‌ జైలు నుంచి నీరవ్‌ మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. 103 మారథాన్‌ హౌస్‌ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో ఫ్లాట్‌ను నిర్వహించే ట్రస్టు చెల్లింపులన్నీ పోగా మిగతా సొమ్మును సురక్షిత ఖాతాలో ఉంచుతామన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ప్రతిపాదనలకు న్యాయమూర్తి అంగీకరించారు.

ఈ కేసులో ట్రైడెంట్‌ ట్రస్ట్‌ కంపెనీ (సింగపూర్‌)పీటీఈ లిమిటెడ్‌ హక్కుదారుగా ఉంది. సెంట్రల్‌ లండన్‌లోని మేరీలెబోన్‌ ప్రాంతంలో తమకు చెందిన ఆస్తిని విక్రయించేందుకు ఈడీ అనుమతిని కోరింది. అయితే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ట్రస్టు ఆస్తులు సూచిస్తాయంటూ ఈడీ వాదనలు వినిపించింది. చివరకు ఫ్లాట్‌ అమ్మకానికి న్యాయమూర్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ పేరుతో 2017 డిసెంబరులో ట్రస్టు ఏర్పాటుపై ఈడీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 2బిలియన్ డాలర్ల మేర మోసగించినట్లు నీరవ్ మోదీపై ఆరోపణలు ఆ తర్వాత ఆయన లండన్‌కు పరారైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.