kavitha liquor scam kaleshwaram | లిక్కర్ స్కాం సమయంలో మౌనం.. పరువుకు ఇప్పుడే నష్టం జరిగిందా?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. లిక్కర్ స్కాంలో నిందితురాలుగా మారడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందనే చర్చ ఆ పార్టీలో ఇప్పటికీ ఉంది. కవిత వల్ల పార్టీకి బాగా డ్యామేజీ జరిగినా అప్పుడు ఎలాంటి చర్యలకు ఉపక్రమించని అధినేత కేసీఆర్ తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కవిత ఆరోపణలు చేయడంతో తీవ్రంగా ప్రతిస్పందించడం చర్చనీయాంశంగా మారింది.

విధాత ప్రత్యేక ప్రతినిధి:
kavitha liquor scam kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మంగళవారం పార్టీ అధిష్టానం తీసుకున్న చర్యపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలై అధికారాన్ని కోల్పోగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవిత అరెస్టయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కాం, కాళేశ్వర్ ప్రాజెక్టులో కుంగుబాటు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని పక్కనపెడితే కవిత లిక్కర్ స్కాంలో నిందితురాలుగా మారడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందనే చర్చ ఆ పార్టీలో ఇప్పటికీ ఉంది. కవిత వల్ల పార్టీకి బాగా డ్యామేజీ జరిగినా అప్పుడు ఎలాంటి చర్యలకు ఉపక్రమించని అధినేత కేసీఆర్ తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కవిత ఆరోపణలు చేయడంతో తీవ్రంగా ప్రతిస్పందించడం చర్చనీయాంశంగా మారింది. స్వంత బిడ్డపై సస్పెన్షన్ వేటు వేయడంలో కీలకమైన అంశాలున్నాయనే చర్చసాగుతోంది. ఇప్పుడు హరీశ్‌కు పార్టీ అండగా నిలువకుంటే మరో తీవ్ర పరిణామం జరిగే అవకాశం ఉందంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా కేసీఆర్ బిడ్డను పార్టీ నుంచి పంపించేశారని భావిస్తున్నారు.
అప్పుడెందుకు మౌనం?
అధినేత బిడ్డగా, ఎమ్మెల్సీగా, జాగృతి నాయకురాలిగా ప్రధాన పాత్ర పోషిస్తున్న కవిత.. మహిళలు తీవ్రంగా పరిగణించే లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం తీవ్ర సమస్యగా మారింది. మరో మాటలో చెప్పాలంటే కవిత సారా వ్యాపారంలో నిందితురాలిగా ఉండటం పార్టీకి, అధిష్ఠానానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తి, దీని పర్యావసానాలను పార్టీ చవిచూసినట్లుగా పలువురు భావిస్తారు. కానీ.. పార్టీ ప్రతిష్ఠకు, పరువుకు భంగకరమైన కేసులో నిందితురాలిగా స్వంత బిడ్డ కవిత ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఒక్క సందర్భంలో ఈ కేసును బీజేపీ ప్రణాళిక ప్రకారం కవితపై మోపినట్లు పొడిపొడిగా స్పందించారు. ఎక్కడా విమర్శించిందీ లేదూ.. ఖండించిందీ లేదూ. ఈ స్థానంలో వేరే నాయకులుంటే ‘ఇలా ఉదాసీనంగా’ వ్యవహరించే వారా? అనే చర్చ కూడా అప్పట్లో సాగింది. పైగా ఈ సమయంలో తన బిడ్డను జైలులో పెట్టడం వల్ల కేసీఆర్ బాధ పడుతున్నారనే అంశాన్ని పార్టీ నేతలు బాగా చర్చల్లో పెట్టి.. సానుభూతి సంపాదించే ప్రయత్నాలు కూడా చేశారు తప్ప పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరించిన కవితపై చర్యలకు డిమాండ్ చేయలేదు.
ఇప్పుడెందుకు ఈ తీవ్ర చర్య?
గత మూడు నెలలుగా కవిత వివిధ సందర్భాల్లో తిరుగుబాటు స్వరాన్ని, పార్టీ పైన ధిక్కారాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక విధంగా ఆమె పార్టీకి దూరం జరుగుతున్నట్లు నాయకత్వం గుర్తించింది. ఈ మేరకు కవిత కూడా తన భవిష్యత్తును నిర్ధేశించుకునే దిశగా పావులు కదిపారు. నిన్నమొన్నటి వరకు కవిత ఏం మాట్లాడినా ఏ చర్యలు చేపట్టని అధిష్టానం.. తాజాగా కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందంటూ ఆరోపించడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఆ వ్యాఖ్యతో పార్టీలో పరిణామాలు వేగంగా సాగాయి. స్వంత బిడ్డ కవిత కంటే హరీశ్‌కు అండగా నిలుస్తున్నట్లు పార్టీ, కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు స్పందించకుంటే పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు రూపంలో మరో అల్లకల్లోలానికి దారితీస్తుందనే ముందు ‘జాగ్రత్త’లో భాగంగా కవితను పార్టీ నుంచి సాగనంపేందుకు వెంటనే ఈ చర్యలు చేపట్టినట్లు అభిప్రాయపడుతున్నారు. జనాదరణ నాయకునిగా గుర్తింపు పొందిన హరీశ్‌ను కాపాడుకోకుంటే పార్టీలో మరో నూతన పరిణామం జరిగే అవకాశం ఉందంటున్నారు. లాభ, నష్టాలు పార్టీ ప్రయోజనాల పైన లెక్కలేసుకున్న తర్వాతనే కేసీఆర్ బిడ్డ పై వేటు వేసేందుకు సిద్ధమైనట్లుగా అంచనా వేస్తున్నారు. పార్టీకి కవిత వల్ల అంటిన లిక్కర్ మరకలను ఈ రూపంగా తొలగించుకోవచ్చని కేసీఆర్ భావించారనే మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ఇదంతా కేసీఆర్ కుటుంబం పైకి ఆడుతున్న ‘డ్రామా’గా అభివర్ణిస్తున్నవారు కూడా మరి కొందరున్నారు.
కోరుకున్నదే జరిగిందా?
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో ప్రారంభమైన విభేదాలు.. దాదాపు వందరోజుల్లో చివరి దశకు చేరుకున్నాయి. కవిత కోరుకున్నదీ.. బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయం ఒక్కటే అంటున్నారు. కవిత కూడా తనదైన పద్ధతిలో అంతర్గతంగా సన్నాహాలు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఒక విధంగా ఇదంతా కవిత ముందుగా ఊహించిందేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇంతకాలం పార్టీని, పదవిని అంటిపెట్టుకుని ఉన్న కవిత ఇప్పుడు ఈ రెండింటినీ త్యజించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్నప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయని కవిత ఇప్పుడు దీనికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో జరిగిన ఈ పరిణామం, బహిరంగమై మరో అంకంలోకి ప్రవేశించిందని భావిస్తున్నారు. ఇంతకాలం పార్టీ సమస్యగా ఉండగా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబ విభేదాల సమస్యగా మారిందని, నిన్నటి వరకు ఒక పార్టీగా ఉన్న కుటుంబ సభ్యులు ప్రత్యర్ధులుగా మారారని, ఈ నూతన పాత్రల ప్రభావం ఏ విధంగా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.