బ్రిటన్ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే గురువారం ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయంతో విజయం సాధించింది.
విధాత, హైదరాబాద్ : బ్రిటన్ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే గురువారం ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయంతో విజయం సాధించింది. లేబర్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కింది. ఈ పార్టీ మెజార్టీ మార్క్ ను దాటి 360కి పైగా స్థానాలను సొంతం చేసుకోగా.. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 80 సీట్లు దాటింది. సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు. బ్రిటన్ ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈసారి ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాలి. ముందస్తు అంచనాలలో లేబర్‌పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకే పరిమితమవుతుందని తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ 400స్థానాల్లో, కన్జర్వేటీవ్ పార్టీ 121స్థానాల్లో ఆధిక్యత చాటాయి. రెండు ప్రధాన పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్ఎల్పీ, డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ, షిన్ ఫీన్, ప్లయిడ్ కమ్రి వర్కర్స్ పార్టీ, యాంటీ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పార్టీతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులు కూడా పోటీ పడ్డారు. కన్జర్వేటీవ్ పార్టీకి ప్రజాదరణ ఉన్నప్పటికి తరచూ ప్రధానులు మారడం, ప్రభుత్వ నిర్ణయాలపై సొంత నేతల నుంచి విమర్శలు వ్యక్తమవడంతో ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి.ఇదే సమయంలో ప్రధాని రిషి సునాక్పైన కూడా వ్యతిరేకత తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని లేబర్ పార్టీ బలంగా ప్రచారం చేసింది.
ఓటమికి బాధ్యత వహిస్తున్నాను: ప్రధాని రిషి సునాక్
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమిని ప్రధాని రిషి సునాక్ ఆంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని, అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ తెలిపారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్లోని పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ, ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాకో ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా కన్జర్వేటీవ్ పార్టీ ఘోర ఓటమి పాలైంది.
కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్ధాం : కీర్ స్టార్మర్
ఎన్నికల్లో ఘన విజయం అనంతరం లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ ప్రసంగించారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన తన మద్దతుదారులతో మాట్లాడుతూ ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచిందన్నారు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని, దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలు పెడదాం” అని పిలుపునిచ్చారు. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. మీ అందరికి కృతజ్ఞతలని, మన దేశాన్ని మీరు మార్చారని వ్యాఖ్యానించారు.
పార్లమెంటుకు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానిగా కీర్ స్టార్మర్
కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంటు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం. సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష ప్రభావాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్‌డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సాధించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. తొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్ లోని పోలీసులు- మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్సు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.
2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, ఇంగ్లాండ్‌లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మర్‌కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా, ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్‌లో అక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.
సుధీర్ఘకాలం న్యాయవాద వృత్తిలో..
రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్‌లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన తీరును ఆయన ప్రచారంలో దుయ్యబట్టారు. ప్రజలు ప్రజలు మార్పును కోరుకుంటే లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికల్లో ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెడుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవ పైన తమ దృష్టి ఉంటుందని చెప్పారు. యూకే భారత్ సంబంధాలను బలోపేతం చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్మార్టర్ తెలిపారు. భారత్‌తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారత్‌తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.