తిరుమల, యాదాద్రిలలో భక్తుల తాకిడి.. కిక్కిరిసిన క్యూలైన్లు
వేసవి సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏపీలో తిరుమల గిరులు, తెలంగాణలో యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతున్నాయి

విధాత : వేసవి సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏపీలో తిరుమల గిరులు, తెలంగాణలో యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపైన ఉన్న కంపార్టుమెంట్లన్నీనిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు నిండిపోయి గోగర్భం జలాశయం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
కాగా.. టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైబడి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలిపిరి గుండా కాలినడకన వచ్చిన భక్తులకు సుమారు 25 వేల టికెట్లను పంపిణీ చేశారు. ఇటు యాదాద్రిలోనూ భక్తుల రద్ధీ పెరిగింది. క్యూలైన్లు కిక్కిరిసిపోగా, కొండపైన ఎటుచూసిన భక్తుల రద్ధీ కనిపించింది. స్వామివారి దర్శనానికి సాధారణ భక్తులకు మూడు గంటలకుపైగా, ప్రత్యేక టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల సమయం పట్టింది. స్వామివారి నిత్యకల్యాణోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.