Tirumala | తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు.. మూడురోజులు ఆర్జితసేవలు రద్దు
Tirumala | తిరుమల క్షేత్రంలో పద్మావతి - శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
Tirumala | తిరుమల క్షేత్రంలో పద్మావతి – శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మూడురోజులపాటు జరుగనున్న వేడుకలో తొలిరోజు మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరో వైపు ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేయనున్నారు. ఆ తర్వాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాల సందర్భంగా 17 నుంచి 19 తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
పౌరాణిక ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం సుమారు 5వేల ఏళ్ల కిందట.. అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిని వేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి-శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తున్నది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram