భారత్ సాంకేతిక రంగంలో మరో పురోగతి సాధించింది. తన స్వంత కృత్రిమ మేధ ఉపకరణం ‘హనూమాన్ ఏఐ’ని విడుదల చేసింది. ఇది మొట్టమొదటి భారత ఉత్పాదక కృత్రిమ మేధ వ్యవస్థ. దీంతో ఇతర దేశాలతో పాటు ఇండియా కూడా ఏఐ రేసులో ప్రవేశించినట్లయింది.
హనూమాన్ ఏఐ(Hanooman AI).. ఇది ఉచిత బహుళభాషా కృత్రిమ మేధ ఉపకరణం(Mutli-lingual Generative AI). ఈ టూల్ ఏకంగా 98 భాషలను(98 Languages) వాడగలదు. అందులో హిందీ, తమిళ్, తెలుగు లాంటి 12 భారతీయ భాషలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఇది అర్థం చేసుకోగలదు, వాటిలోనే స్పందించగలదు కూడా. దీన్ని భారత కంపెనీ అయిన సీతా మహాలక్ష్మి హెల్త్‌కేర్ ఇండియా(SML India) అనే దేశీయ ఏఐ కంపెనీ, దుబాయ్‌కి చెందిన ఏఐ కంపెనీ 3ఏఐ హోల్డింగ్స్ లిమిటెడ్(3AI Holdings Limited)తో కలిసి భారత్‌లో అందరికీ కృత్రిమ మేధ అందుబాటులో ఉండాలని సంకల్పించి తయారుచేసింది. దీన్ని ప్రపంచం కోసం భారత్ తయారుచేసింది అని ఎస్ఎంఎల్ సహవ్యవస్థాపకుడు, సిఈఓ విష్ణువర్ధన్ సగర్వంగా ప్రకటించారు.
హనూమాన్ ప్రత్యేకతలు:
1. బహుళభాషా సమాచార వ్యవస్థ(Multilingual Communication) : 12 భారతీయ భాషలతో కలిపి మొత్తం 98 భాషలలో సమాచా మార్పిడి, స్పందించడం చేయగలదు. దీంతో భాషల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించినట్లవుతుంది.
2. విషయ సృష్టి – సరళీకరణ(Content creation & Summarization) ): ఏదైనా సృజనాత్మక విషయాన్నితయారుచేయడంలో సహకరించడం, క్లిష్టమైన సమాచారాన్ని విపులీకరించడంలో హనూమాన్ సహాయపడుతుంది.
3. సంభాషణా మేధ( Conversational AI): హనూమాన్ సంభాషణలలో కూడా సహాయం చేస్తుంది. మన సంభాషణ అర్థవంతంగా, ఆసక్తి కలిగించేలా మార్చగలదు.
4. సాంకేతిక విషయాలు(Technical tasks): హనూమాన్ కొన్ని సాంకేతికమైన పనులు కూడా చేయగలదు. అవి ఏమిటి అన్నదానిపై ప్రస్తుతానికి పూర్తి సమాచారం లేదు.
హనూమాన్ ప్రస్తుతం ఇంటర్నెట్ వెబ్సైట్ ద్వారా, ఆండ్రాయిడ్(Android) అప్లికేషన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. నెట్లో చూడాలనుకునేవారు www.hanooman.ai ద్వారా గానీ, సింపుల్‌గా గూగుల్‌లో hanooman అని సెర్చ్ చేసినా సైట్ లభిస్తుంది.
ఇక ఫోన్‌లోనైతే, గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి, hanooman అని వెతికితే యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ లాంచ్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ, గూగుల్ అకౌంట్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఎంచుకోవాలనుకుంటున్న భాషను అడుగుతుంది. అందులో మీరు తెలుగు ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. హనూమాన్ మీ కోసం సిద్ధం. మీరు ప్రశ్నలడగండి. హనూమాన్ తెలుగులో సమాధానమిస్తుంది.
హనూమాన్ విడుదల సందర్భంగా ఎస్ఎంఎల్, పెద్ద పెద్ద కంపెనీలైన హెచ్‌పీ, నాస్కామ్, యోట్టా తదితరులతో జట్టు కట్టనున్నట్లు ప్రకటించింది. చాట్‌జీపీటీ లాంటి ఇంగ్లీష్ ఏఐ ఉపకరణాల్లా కాకుండా ఆంగ్లేతర భాషలు(హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఇంకా సింధీ) మాత్రమే తెలిసిన భారతీయుల అవసరాల కోసం హనూమాన్ రూపొందించబడింది. హనూమాన్, చాట్‌జీపీటీ అందించే సౌలభ్యాలైన టెక్స్ట్ ఉత్పాదన, భాషల తర్జుమా ఇంకా సొంతంగా సృజనాత్మక కంటెంట్‌ను కూడా తయారుచేయగలదు. ఇది చాట్బాట్లలాంటి పరస్పర స్పందనల ఆధారంగా పనిచేసే అప్లికేషన్లను మన భాషలో అందించి ఎంతో సహాయం చేయగలదని ఎస్ఎంఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం హనూమాన్ ఏఐ వెబ్ ద్వారా, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ల కోసం కొన్ని నెలల తర్వాత విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే హనూమాన్ ఇంకా భారతీయ భాషలు నేర్చుకుంటోంది. వినియోగదారులతో ముఖాముఖి పెరిగితే తదనుగుణంగా భాషలపై పట్టు సాధిస్తుంది. దీన్లో ప్రీమియం మాడల్ కూడా ఉంది. కానీ అది కొంతకాలం తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం 20 కోట్ల వినియోగదారులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.