HANOOMAN AI – India’s own multi-lingual AI Platform హనూమాన్​ ఏఐ – భారత కృత్రిమ మేధ వ్యవస్థ

భారత్​ సాంకేతిక రంగంలో మరో పురోగతి సాధించింది. తన స్వంత కృత్రిమ మేధ ఉపకరణం ‘హనూమాన్​ ఏఐ’ని విడుదల చేసింది. ఇది మొట్టమొదటి భారత ఉత్పాదక కృత్రిమ మేధ వ్యవస్థ. దీంతో ఇతర దేశాలతో పాటు ఇండియా కూడా ఏఐ రేసులో ప్రవేశించినట్లయింది.

  • Publish Date - May 13, 2024 / 01:09 PM IST

హనూమాన్​ ఏఐ(Hanooman AI).. ఇది ఉచిత బహుళభాషా కృత్రిమ మేధ ఉపకరణం(Mutli-lingual Generative AI). ఈ టూల్​ ఏకంగా 98 భాషలను(98 Languages) వాడగలదు. అందులో హిందీ, తమిళ్​, తెలుగు లాంటి 12 భారతీయ భాషలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఇది అర్థం చేసుకోగలదు, వాటిలోనే స్పందించగలదు కూడా. దీన్ని భారత కంపెనీ అయిన సీతా మహాలక్ష్మి హెల్త్​కేర్​ ఇండియా(SML India) అనే దేశీయ ఏఐ కంపెనీ, దుబాయ్​కి చెందిన ఏఐ కంపెనీ 3ఏఐ హోల్డింగ్స్​ లిమిటెడ్(3AI Holdings Limited)​తో కలిసి భారత్​లో అందరికీ కృత్రిమ మేధ అందుబాటులో ఉండాలని సంకల్పించి తయారుచేసింది. దీన్ని ప్రపంచం కోసం భారత్​ తయారుచేసింది అని ఎస్​ఎంఎల్​ సహవ్యవస్థాపకుడు, సిఈఓ విష్ణువర్ధన్​ సగర్వంగా ప్రకటించారు.

హనూమాన్​ ప్రత్యేకతలు:

1. బహుళభాషా సమాచార వ్యవస్థ(Multilingual Communication) : 12 భారతీయ భాషలతో కలిపి మొత్తం 98 భాషలలో సమాచా మార్పిడి, స్పందించడం చేయగలదు. దీంతో భాషల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించినట్లవుతుంది.

2. విషయ సృష్టి – సరళీకరణ(Content creation & Summarization) ): ఏదైనా సృజనాత్మక విషయాన్నితయారుచేయడంలో సహకరించడం, క్లిష్టమైన సమాచారాన్ని విపులీకరించడంలో హనూమాన్​ సహాయపడుతుంది.

3. సంభాషణా మేధ( Conversational AI): హనూమాన్​ సంభాషణలలో కూడా సహాయం చేస్తుంది. మన సంభాషణ అర్థవంతంగా, ఆసక్తి కలిగించేలా మార్చగలదు.

4. సాంకేతిక విషయాలు(Technical tasks): హనూమాన్​ కొన్ని సాంకేతికమైన పనులు కూడా చేయగలదు. అవి ఏమిటి అన్నదానిపై ప్రస్తుతానికి పూర్తి సమాచారం లేదు.

ఎలా వాడాలి.?

హనూమాన్​ ప్రస్తుతం ఇంటర్​నెట్​ వెబ్​సైట్​ ద్వారా, ఆండ్రాయిడ్​(Android) అప్లికేషన్​ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. నెట్​లో చూడాలనుకునేవారు www.hanooman.ai ద్వారా గానీ, సింపుల్​గా గూగుల్​లో hanooman అని సెర్చ్​ చేసినా సైట్​ లభిస్తుంది.
ఇక ఫోన్​లోనైతే, గూగుల్​ ప్లే స్టోర్​కు వెళ్లి, hanooman అని వెతికితే యాప్​ కనబడుతుంది. దాన్ని ఇన్​స్టాల్​ చేసుకోవాలి. యాప్​ లాంచ్​ అయిన తర్వాత మీ ఫోన్​ నెంబర్ ద్వారా కానీ, గూగుల్​ అకౌంట్​ ద్వారా కానీ రిజిస్టర్​ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్​ పూర్తయిన తర్వాత మీరు ఎంచుకోవాలనుకుంటున్న భాషను అడుగుతుంది. అందులో మీరు తెలుగు ఆప్షన్​ను ఎంచుకుంటే చాలు. హనూమాన్​ మీ కోసం సిద్ధం. మీరు ప్రశ్నలడగండి. హనూమాన్​ తెలుగులో సమాధానమిస్తుంది.

హనూమాన్​ విడుదల సందర్భంగా ఎస్​ఎంఎల్​, పెద్ద పెద్ద కంపెనీలైన హెచ్​పీ, నాస్​కామ్​, యోట్టా తదితరులతో జట్టు కట్టనున్నట్లు ప్రకటించింది. చాట్​జీపీటీ లాంటి ఇంగ్లీష్​ ఏఐ ఉపకరణాల్లా కాకుండా ఆంగ్లేతర భాషలు(హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, కన్నడ, తెలుగు, తమిళ్​, మలయాళం ఇంకా సింధీ) మాత్రమే తెలిసిన భారతీయుల అవసరాల కోసం హనూమాన్​ రూపొందించబడింది. హనూమాన్​, చాట్​జీపీటీ అందించే సౌలభ్యాలైన టెక్స్ట్​ ఉత్పాదన, భాషల తర్జుమా ఇంకా సొంతంగా సృజనాత్మక కంటెంట్​ను కూడా తయారుచేయగలదు. ఇది చాట్​బాట్లలాంటి పరస్పర స్పందనల ఆధారంగా పనిచేసే అప్లికేషన్లను మన భాషలో అందించి ఎంతో సహాయం చేయగలదని ఎస్​ఎంఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం హనూమాన్​ ఏఐ వెబ్​ ద్వారా, ఆండ్రాయిడ్​ ఫోన్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ల కోసం కొన్ని నెలల తర్వాత విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే హనూమాన్​ ఇంకా భారతీయ భాషలు నేర్చుకుంటోంది. వినియోగదారులతో ముఖాముఖి పెరిగితే తదనుగుణంగా భాషలపై పట్టు సాధిస్తుంది. దీన్లో ప్రీమియం మాడల్​ కూడా ఉంది. కానీ అది కొంతకాలం తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం 20 కోట్ల వినియోగదారులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Latest News