Drinking Water From Air | గాలిలోనుంచి తాగునీరు.. విద్యుత్తు కూడా అవసరం లేదు!

నీటి ఎద్దడి ఉన్న మారుమూల ప్రాంతాల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ, లేదా వాహనాల్లో నీళ్లు తెచ్చుకోవడం చూస్తూనే ఉంటాం. దీనికి మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (Massachusetts Institute of Technology) శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు తయారు చేసిన ఒక పరికరంతో.. గాలిలో నుంచే నీటిని ఉత్పత్తి చేయవచ్చు.

  • Publish Date - September 12, 2025 / 01:55 PM IST

Drinking Water From Air | గాలిలో నుంచి ఏం సృష్టించగలం? అంటే.. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నీటిని సృష్టించవచ్చని చెబుతున్నారు. చెప్పటమే కాదు.. విద్యుత్‌ కూడా అవసరం లేకుండా ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా గాలిలో నుంచి స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను Nature Water జర్నల్‌లో ప్రచురించారు. తీవ్ర నీటిఎద్దడి ఉండే ఎడారుల వంటి ప్రాంతాలు, కరువు ప్రభావిత ప్రాంతాలకు ఇది గొప్ప ఉపశమనం కల్పిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణం నుంచే నీటిని ఉత్పత్తి చేసే ఈ పరికరంలో మెటల్‌– ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (MOF) అనే మెటీరియల్‌నుగాలిలో ఉండే తేమను ఇది adsorption ప్రక్రియలో గ్రహిస్తుంది. ఈ పరికరం పూర్తిగా సౌర విద్యుత్తు ఆధారంగా పనిచేస్తుంది. కనుక దీనికి విద్యుత్‌ సరఫరా అవసరం లేదు. ఎలాంటి మారుమూల ప్రాంతాల్లోనైనా దీనిని అమర్చేందుకు అవకాశం ఉంటుంది. ఒక కిలో ఎవోఎఫ్‌ మెటీరియల్‌తో ప్రతి రోజూ సుమారు 2.8 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుంది. పొడి వాతావణం ఉన్న ప్రదేశాల్లో అంటే.. 20 శాతం మాత్రమే తేమ ఉన్నా కూడా ఈ పరికరం పనిచేస్తుంది.

  • ఇదీ దాని నిర్మాణం..
    మొత్తం రహస్యం దీని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎంవోఎఫ్‌ మెటీరియల్‌లోనే ఉంది.
  • ఇది సూక్ష్మ రంథ్రాలు కలిగిన స్ఫటిక రూపంలో ఉంటుంది.
  • ఇవి గాలిలో నీటి అణువులను సంగ్రహిస్తాయి. తిరిగి సూర్యకాంతి వేడితో జలరూపంలో విడుదల చేస్తాయి.

నీటి ఎద్దడి సమస్య ఉన్న ప్రాంతాలవారికి ఇది game-changer వంటిదని ఎంఐటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎవెలిన్‌ వాంగ్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందుబాటులో లేని వారు 220 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా. తాజా సాంకేతిక పరిజ్ఞానం.. ఆఫ్రికా, మధ్య ఆసియా వంటి నీటి ఎద్దడి ప్రాంతాలకే కాకుండా.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరిజోనా ఎడారి వాతావరణంలో దీనిని పరీక్షించగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నీటిని అందించగలదని రుజువైంది. సైనిక అవసరాలకు, అంతరిక్ష యాత్రల్లో సైతం ఇది పనికి వస్తుందని చెబుతున్నారు.

ఖర్చు కూడా తక్కువే

ఈ పరికరాలు ఉపయోగించి భారీ స్థాయిలో నీటిని ఉత్పత్తి చేస్తే.. ఒక లీటరు నీటికి 2 రూపాయల ఖర్చు మాత్రమే ఉంటుందని దీనిని తయారు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి తక్కువ మెయింటనెన్స్‌తో ఈ పరికరం పదేళ్లపాటు నిరాటంకంగా పని చేయగలదు. ఆఫ్రికా దేశాలు, మధ్య ఆసియా తదితర నీటి కొరత కలిగిన ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టులను 2026 నుంచి చేపట్టాలని ఎంఐటీ బృందం భావిస్తున్నది. దీనికోసం పలు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నది. వాణిజ్యపరంగా రాబోయే మూడేళ్లలో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పరికరాలను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు వివిధ కంపెనీలు లైసెన్స్‌లు పొందేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తున్నది.