Project REBIRTH | ఇక విమానాలు క్రాష్​​ ప్రూఫ్​ :  ఏఐ ఆధారిత ఎయిర్​ బ్యాగుల ఆవిష్కరణ దిశగా భారతీయ విద్యార్థులు

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, ఇద్దరు భారతీయ ఇంజినీర్లు రూపొందించిన 'REBIRTH' ప్రాజెక్ట్ ఇప్పుడు AI-ఆధారిత ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌తో విమానాలకు క్రాష్-ప్రూఫ్ రక్షణను అందించే దిశగా కొత్త అడుగులు వేస్తోంది.

  • Publish Date - September 13, 2025 / 04:24 PM IST

హైదరాబాద్‌:
Project REBIRTH | 12 జూన్‌ 2025న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ 171 దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. టేకాఫ్‌ అయిన 30 సెకన్లలోనే ఇంధన సరఫరా ఆగిపోవడంతో విమానం కూలిపోయి 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ప్రయాణికులు మాత్రమే కాకుండా నేలమీద ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా చలించిపోయిన ఇద్దరు యువ ఇంజినీర్లు విమానయాన భద్రతపై ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. దుబాయ్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (BITS, Dubai)లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎషెల్‌ వాసిం, ధర్శన్‌ శ్రీనివాసన్‌ రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ పేరు “REBIRTH(పునర్జన్మ)”. ఇది విమానాన్ని “క్రాష్‌–ప్రూఫ్‌” చేసే  కృత్రిమ మేధ ఆధారిత ఎయిర్‌బ్యాగ్‌ సిస్టమ్‌. ఈ ప్రాజెక్ట్‌  జేమ్స్‌ డైసన్‌ అవార్డు కోసం ఫైనలిస్టుగా ఎంపికైంది.

REBIRTH ఎలా పనిచేస్తుంది?

ఈ ప్రాజెక్ట్‌ వెనుక ఉన్న భావన చాలా సులభంగా చెప్పాలంటే – విమానానికి ఒక రక్షణ గూడు (Protective Cocoon) తయారు చేయడం. AI ఆధారిత సెన్సార్లు ఎత్తు, వేగం, ఇంజిన్‌ పనితీరు, అగ్ని, పైలట్‌ స్పందన వంటి ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. విమానం 3,000 అడుగుల కిందకి పడిపోయే అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే వ్యవస్థ ఆటోమేటిక్‌గా యాక్టివేట్‌ అవుతుంది. రెండు సెకన్లలో విమానం ముక్కు, పొట్ట, తోక నుంచి భారీ ఎయిర్‌బ్యాగ్‌లు బయటకు వస్తాయి. ఇవి విమానాన్ని ఒక పెద్ద గాలి ‘గూడు’లా చుట్టేసి తాకిడి ప్రభావాన్ని తగ్గిస్తాయి. అదనంగా రివర్స్‌ త్రస్ట్‌ లేదా గ్యాస్‌ బూస్టర్లు విమాన వేగాన్ని తగ్గిస్తాయి.

విమాన లోపలి గోడల్లో, సీట్లలో ప్రత్యేకమైన ద్రవాలు నింపుతారు. ఇవి సాధారణ పరిస్థితుల్లో మృదువుగా ఉంటాయి, కానీ దేన్నైనా బలంగా ఢీకొనే సమయంలో గట్టిపడి ప్రయాణికులను రక్షిస్తాయి. ప్రమాదం తర్వాత తక్షణ సహాయక చర్యల కోసం విమానాన్ని సునాయాసంగా కనుగొనడానికి, విమానం బయటి గోడలు నారింజ రంగులోకి మారి మెరుస్తూ ప్రకాశిస్తాయి. GPS, ఇన్‌ఫ్రారెడ్‌ బీకన్లు, ఎగ్జిట్‌ లైట్స్‌ వంటి సంకేతాలు తమంతటతామే యాక్టివేట్‌ అవుతాయి. దీంతో రెస్క్యూ టీమ్స్‌కు ఆ ప్రదేశాన్ని గుర్తించడం సులభమవుతుంది. ముఖ్యంగా ఈ వ్యవస్థను కొత్త విమానాల్లోనే కాకుండా, ఇప్పటికే ఉన్న వాటికి కూడా రెట్రో ఫిట్‌ చేయవచ్చని డిజైనర్లు చెబుతున్నారు.

REBIRTH భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది?

ఈ ఆలోచనపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీనిని విప్లవాత్మక ఆవిష్కరణగా ప్రశంసిస్తే, మరికొందరు “అంత పెద్ద ఎయిర్‌బ్యాగ్‌లు ఆకాశంలో ఎలా పనిచేస్తాయి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. “మంచి ఇంజిన్లు నిర్మిస్తే ఎయిర్‌బ్యాగ్‌ల అవసరం ఉండదు” అని విమర్శించే వారు కూడా ఉన్నారు. కానీ విమాన ప్రమాదాలు మానవ ప్రాణాలను ఎలా హరిస్తాయో చూసినప్పుడు, ఇలాంటి సాంకేతికత ఆవిష్కరణలు  కనీసం కాపాడే ప్రయత్నాలు చేయడాన్ని ప్రోత్సహిస్తాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ డైసన్‌ అవార్డు గెలిస్తే వారికి 40,000 డాలర్లు మరియు ప్రాజెక్ట్‌ను ప్రయోగ పరీక్షల దశకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. ల్యాబ్‌లో వివిధ రకాలైన పరీక్షలు చేసి విజయం సాధిస్తే, క్రమంగా నిజమైన విమానాల్లో ప్రయోగాలు చేయాలని వారు భావిస్తున్నారు. “REBIRTH అనేది ఇంజినీరింగ్‌ కంటే ఎక్కువ. ఇది ఒక దుఃఖం నుంచి పుట్టిన ఆలోచన. భవిష్యత్తులో కనీసం ఒక ప్రాణాన్నైనా రక్షించగలిగితే అదే మా విజయం” అని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఒక దుర్ఘటనను చూసి పుట్టిన ఈ ఆలోచన ఆచరణలో సాధ్యమా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా విమానయాన భద్రతపై ఒక కొత్త చర్చకైతే నాంది పలికింది. విమాన ప్రయాణం సురక్షితం అనే నమ్మకాన్ని బలపర్చే దిశగా REBIRTH  బహుశా ఒక మొదటి అడుగు అని చెప్పవచ్చు. ఈ ఆవిష్కరణకు ఇంజనీర్లు మరిన్ని మెరుగులు దిద్దితే, భవిష్యత్తులో క్రాష్​ ప్రూఫ్​ విమానాలు నిజంగానే గాల్లోకి ఎగురుతాయేమో. మంచిదే. ఆశపడటంలో తప్పు లేదు కదా. ఆశే అన్ని ఆవిష్కరణలకు మూలమనేది మాత్రం నిజం.