Swati Maliwal | స్వాతి మాలీవాల్‌ దాడి ఘటనలో బిభవ్‌ అరెస్ట్

సంచలనం సృష్టించిన ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ దాడి కేసులో ప్రధాన నిందితులు ఢిల్లీ సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు

Swati Maliwal | స్వాతి మాలీవాల్‌ దాడి ఘటనలో బిభవ్‌ అరెస్ట్

విధాత: సంచలనం సృష్టించిన ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ దాడి కేసులో ప్రధాన నిందితులు ఢిల్లీ సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్వాతి మాలీవాల్‌ ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై బిభవ్‌ తరఫున న్యాయవాది మీడియాతో మాట్లాడారు. తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. విచారణకు సహకరిస్తామని ఈ-మెయిల్‌ చేసినట్లు తెలిపారు.

మరోవైపు ఈ కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. ఢిల్లీ ఎయిమ్స్‌ మాలీవాల్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆప్‌ ఎంపీ ఎడమ చెంప, కుడి కాలిపై గాయాలున్నాయని వైద్య నివేదికలో తేలింది. సుమారు మూడు గంటల వైద్య పరీక్షల అనంతరం పలు చోట్ల గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇప్పటికే స్వాతి మాలీవాల్‌ దాడి ఘటనను పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈనెల 17 న సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఆమెను తీసుకెళ్లిన పోలీసులు అదనపు డిప్యూటీ కమిషనర్‌ నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్‌ నిపుణులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మరోవైపు తమ మందు విచారణకు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది.