Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. వెంటనే థైరాయిడ్‌ పరీక్షలు చేయించండి..!

Health tips : వృద్ధాప్యానికి చేరువవుతున్నా కొద్ది కొందరిలో థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. థైరాయిడ్‌ లెవల్స్‌ తగ్గడమే ఎక్కువగా జరుగుతుంది. థైరాయిడ్‌ లెవల్స్‌ తగ్గడాన్నే హైపో థైరాయిడిజమ్‌ అంటారు. పరీక్షలు చేయించుకోకపోతే ఈ హైపో థైరాయిడిజమ్‌ ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే థైరాయిడ్‌ లక్షణాలు స్పష్టంగా లేకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించటమే ప్రధాన కారణం.

అయితే థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపకశక్తి, విషయ గ్రహణ సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. అధిక బరువు, మగత, పొడి చర్మం, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని చాలావరకు వృద్ధాప్య సంబంధ మార్పులుగా భావిస్తుంటారు. కానీ వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వృద్ధాప్యంలో వచ్చే హైపో థైరాయిడిజం లక్షణాల గురించి అవగాహన పెంచుకుని, అనుమానం వస్తే తక్షణమే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

హైపోథైరాయిడిజం లక్షణాలు

కొలెస్ట్రాల్‌ పెరగటం

చాలా సందర్భాల్లో వృద్ధుల్లో ఇదొక్కటే హైపో థైరాయిడిజమ్‌ లక్షణం కావొచ్చు. ఎందుకంటే థైరాయిడ్‌ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్‌ను విడగొట్టలేదు. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించలేదు. దాంతో రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.

గుండె బలహీనం

హైపో థైరాయిడిజమ్‌ వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి. గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తుంది. నెమ్మదిగా నడుస్తుంటారు. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లలో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది.

మలబద్ధకం

థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. దాంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణమైన ఆహారం విసర్జితమవడం కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది.

ఒంట్లో నొప్పులు

కొంతమందిలో ఒళ్లు నొప్పులు ఒక్కటే థైరాయిడ్‌ సమస్యకు సంకేతం కావొచ్చు. హైపో థైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం తగ్గుతుంది. దాంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతుంటాయి.

మానసిక సమస్యలు

తక్కువ వయసులో థైరాయిడ్‌ పనితీరు తగ్గిన వారిలో డిప్రెషన్‌ ఉండటం ఎక్కువగా చూస్తుంటాం. ఇది వృద్ధుల్లోనూ తక్కువేమీ కాదు. హైపో థైరాయిడిజం వృద్ధాప్యంలో కుంగుబాటుకు గురిచేస్తుంది.

మతిమరుపు

ఏదీ ఎక్కువసేపు జ్ఞాపకం ఉండకపోవడం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం లాంటివి కూడా హైపో థైరాయిడిజమ్‌ లక్షణాలు. ఎందుకంటే మెదడు పనితీరు, విషయ అవగాహనలో థైరాయిడ్‌ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి.