Telangana | లోక్‌సభలోనూ కాంగ్రెస్‌కే మొగ్గు!.. భారీగా చీలిన బీఆరెస్ ఓట్లు!

తెలంగాణలో త్రిముఖ పోటీ తిరుగబడి రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీగా మారిందని, దీంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బీఆరెస్ నిర్ణయించనున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి

Telangana | లోక్‌సభలోనూ కాంగ్రెస్‌కే మొగ్గు!.. భారీగా చీలిన బీఆరెస్ ఓట్లు!

కొన్ని కాంగ్రెస్‌కు, కొన్ని బీజేపీకి?
పోటీలో చేతులెత్తేసిన గులాబీ?
కమలం, కారు ఒప్పందమా!
కాంగ్రెస్‌ మాత్రం గెలవొద్దన్న బీఆరెస్‌ శ్రేణుల పంతమా!
బీజేపీతో రహస్య ఒప్పందంపై ప్రచారంలో కాంగ్రెస్‌ విమర్శలు
పోలింగ్‌నాడు తిరగబడిన త్రిముఖ పోటీ?
ఆ రెండు పార్టీలు పంచుకున్నవెన్ని?
విజేతలను నిర్ణయించే బీఆరెస్‌ ఓటు!
రాజకీయ పరిశీలకుల్లో జోరుగా చర్చలు

విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో త్రిముఖ పోటీ తిరుగబడి రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీగా మారిందని, దీంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బీఆరెస్ నిర్ణయించనున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆరెస్‌ ఓటింగ్‌ భారీ స్థాయిలో చీలిపోయిందనే అభిప్రాయాల మధ్య మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోమవారం తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆరెస్.. లోక్‌సభ ఎన్నికల్లో తన పట్టు నిలబెట్టుకోవడం కంటే కాంగ్రెస్‌ను ఓడించాలనే ప్రయత్నంలోనే కనిపించిందని సోమవారం జరిగిన పోలింగ్ సరళినిబట్టి రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఓటరు నిర్ణయం తారుమారయ్యే అవకాశం లేదంటున్నారు. బీఆరెస్‌ నుంచి అటు బీజేపీతోపాటు కాంగ్రెస్‌కు కూడా ఓట్లు క్రాస్‌ అయ్యాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌ శాతాలను గమనిస్తే.. క్రాస్‌ఓటింగ్‌తో కాంగ్రెస్‌కే లబ్ధి చేకూరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గెలుపోటముల వాస్తవ చిత్రపటం జూన్ 4వ తేదీన తేలనున్నప్పటికీ తాజా పరిణామాలపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

తిరుగబడిన త్రిముఖ పోటీ?

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందనేది సాధారణ అంచనా. కానీ, పోలింగ్ నాటికి అది ద్విముఖ పోటీగా మారి బీఆరెస్ చేతులెత్తేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పోటాపోటీగా తమ అభ్యర్థులను రంగంలోకి దింపారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఎన్నికల ప్రచార క్రమంలో పరస్పరం చేసుకున్న రాజకీయ విమర్శలు, ఆరోపణలు, భౌతిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, బీఆరెస్ కుమ్మక్కయ్యాయనే ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఏ స్థానంలో బీఆరెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో పెట్టిందో సీఎం రేవంత్ బహిరంగంగానే విమర్శించారు. ఈ ఆరోపణను బీఆరెస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించడమే కాకుండా కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని ఎదురుదాడి చేశారు.

బీజేపీ ఈ రెండింటినీ కాదని కాంగ్రెస్, బీఆరెస్ కలిసిపోయాయని విమర్శించింది. ఈ ఆరోపణలను పక్కనబెడితే ప్రచారపర్వంలో సైతం పలుచోట్ల బీఆరెస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ సీరియస్‌గా లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. బీఆరెస్ వరంగల్ లాంటి నియోజకవర్గాల్లో తన బలానికి తగిన విధంగా పనిచేయడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత ఈ ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు గెలవడం పక్కనపెడితే బీజేపీ, బీఆరెస్ అభ్యర్థుల గెలుపొటములను నిర్ణయించే పరిస్థితి నెలకొందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. బీఆరెస్ పాత్ర మారిపోయిందంటున్నారు. అదే సమయంలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ సభలకు భారీగా జనం హాజరైన విషయాన్ని విస్మరించకూడదని గుర్తు చేస్తున్నారు.

బీఆరెస్‌ నుంచి క్రాస్‌ ఓటింగ్‌?

బీఆరెస్ నాయకత్వం కావాలని చేసిందా? లేక లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం చేసుకున్నదా? అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందా? పార్లమెంటు ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదా? కారణలేమైనా.. నిన్నమొన్నటి వరకు బీఆరెస్‌కు ఉన్న ఓటు బ్యాంకుకు గండిపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే బీఆరెస్ ఓటు బ్యాంకు గణనీయంగా చీలిపోయిందని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ గెలిచినా ఫర్వాలేదు కానీ.. కాంగ్రెస్‌ మాత్రం గెలవకూడదన్న పార్టీ శ్రేణుల పంతం కూడా క్రాస్‌ ఓటింగ్‌కు కారణమైందని అంచనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల బీఆరెస్‌ శ్రేణులు బీజేపీకి ఓటు చేయించారనే వాదన వినిపిస్తున్నది. ఈ చీలిపోయిన లేదా క్రాస్‌ అయిన ఓట్లే ఈ ఎన్నికల్లో కీలకంకానున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఓట్లు ప్రత్యర్థి పార్టీలుగా చెబుతున్న కాంగ్రెస్, బీజేపీ ఏ మేరకు తమ ఖాతాలో వేసుకున్నాయో? అవే ఇప్పుడు ఫలితాలను నిర్ణయిస్తాయని చెబుతున్నారు.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటకీ బీఆరెస్ ఇప్పటికీ రాష్ట్రంలో బలమైన పార్టీగానే ఉన్నది. కానీ, ఎన్నికల్లో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి నష్టం వాటిల్లిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు దారి మళ్ళి కొంత బీజేపీ, కొంత కాంగ్రెస్‌కు మళ్ళిందంటున్నారు. ఇది ఏ మేరకు, ఏ నియోజకవర్గం అనే దాన్ని బట్టి గెలుపోటములు నిర్ణయం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను గెలిచిన బీఆరెస్ కంటే తామే పోటీలో ముందున్నామంటూ తొడగొట్టింది. తాజా పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు ఇదంతా బీజేపీ సృష్టించిన హైప్‌ మాత్రమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రాస్‌ ఓటింగ జరిగినప్పటికీ.. కరుడుగట్టిన బీఆరెస్‌ ఓటర్లు కారు గుర్తుకే ఓటేశారని అంటున్నారు.

మరో విశ్లేషణ ప్రకారం బీఆరెస్ ఓటు మెజార్టీ బీజేపీకి మళ్ళినప్పటికీ అందులో సగం కాంగ్రెస్‌కు మళ్ళినా ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉన్నందున బీఆరెస్ ఓటు బ్యాంకుకుతోడు తటస్థులు ఆ పార్టీ వైపు కొంతశాతం మళ్ళినా బీజేపీ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉండే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే ఎన్నికల ప్రచారం, తాజా పోలింగ్ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరిగి మూడవ పక్షమైన బీఆరెస్ ఫలితాలను నిర్ణయించే ప్రధాన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటున్నారు. ఈ విశ్లేషణే నిజమైతే బీఆరెస్ శకం ముగిసి రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అనే స్థాయిలో పోటీ పెరుగనున్నది. ఇది ఒక ప్రమాదకర పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రమాదం ఉందని ప్రగతిశీల శక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంచనా కాకుండా నిశ్శబ్ద ఓటింగ్ అనూహ్య ఫలితాలకు దారితీస్తే తప్ప కాంగ్రెస్, బీజేపీని కాదని కొన్ని స్థానాల్లోనైనా బీఆరెస్ విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అక్కడ స్నేహపూర్వక పోటీ?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఎంఐఎం తన పాత దోస్త్ అయిన బీఆరెస్‌తో అదే స్నేహం కొనసాగిస్తుందా? లేదా? అనేది తాజాగా సందిగ్ధంగా మారింది. బీఆరెస్‌తో శత్రుత్వం లేకపోయినా మరో వైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తో సాన్నిహిత్యం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంతో ప్రస్తుతానికి కాంగ్రెస్, బీఆరెస్ రెండు పక్షాలు దోస్తీ కొనసాగిస్తుండగా అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. అయినప్పటికీ రెండు పార్టీలు హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో తమ అభ్యర్థులను పోటీపెట్టినప్పటికీ అది స్నేహపూర్వక పోటీగానే భావించాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంఐఎం తరుఫున ఆ పార్టీ నేత అసదుద్దీన్ పోటీచేయగా ఆయనపై మాధవీలతను బరిలో దింపి బీజేపీ సవాలు విసిరింది. కాంగ్రెస్ నుంచి ఎండీ వలీఉల్లా సమీర్, బీఆరెస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీలో నిలిచినప్పటికీ ఎఐఎం, బీజేపీ మధ్య ప్రధాన పోటీ సాగిందని ఓటింగ్‌ సరళిని అంచనా వేసినవారు చెబుతున్నారు.