రేవంత్ రెడ్డిది బండరాయి ప్రభుత్వం : ఎంపీ ఈటల

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై స్పందించకపోతే తెలంగాణ సమాజం తిరగబడుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

రేవంత్ రెడ్డిది బండరాయి ప్రభుత్వం :  ఎంపీ ఈటల

హైద‌రాబాద్‌, విధాత‌: ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌ రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కార్ కు చీమకుట్టినట్టు కూడా లేదని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సంతోషపడేవారని, అసెంబ్లీ సమావేశాలప్పుడు వినతి పత్రాలు ఇస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేద‌ని భావించేవార‌న్నారు. ఈ మేర‌కు అప్ప‌ట్లో కొన్ని స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం అయ్యేవ‌ని చెప్పారు. కానీ ఇప్పుడు ధర్నాలలో అఖిలపక్ష నాయకులు మాట్లాడినా, సభలో ప్రతిపక్ష నాయకులు సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదనడానికి సజీవ సాక్ష్యం ఫీజు రియింబ‌ర్స్ మెంట్‌ బకాయిలేన‌న్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, మేధావులు, ఎస్సీ ఎస్టీ సంఘాల విస్తృతస్థాయి శానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రియింబ‌ర్స్ మెంట్‌ బకాయిలు కొద్ది మంది కాలేజీ యాజమాన్యాల సమస్య కాదు లక్షల మంది తల్లిదండ్రుల వేదన అని అన్నారు. ఫీజు కట్టలేదని కాలేజీలో అవమానం ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్న వారి దీన గాధ ఇదని తెలిపారు. మ‌నిష‌నే వాడికి ప్రాణం విలువ, బాధ‌ తెలుస్తుంద‌ని, కానీ రేవంత్ రెడ్డి స‌ర్కారు మానవత్వం కోల్పోయి బండరాయి లెక్క మారిందన్నారు. మీరు స్పందించకపోతే తెలంగాణ సమాజం తిరగబడుతుందని రేవంత్ రెడ్డిని ఈట‌ల రాజేంద‌ర్‌ హెచ్చరించారు.

తున‌క‌లు చేసి అమ్ముకుంటున్నారు కానీ…

ఎన్నికల్లో హామీలు ఇస్తున్నప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నేను ప్రశ్నిస్తే… ఆయనకే తెలివి ఉందా మాకు లేదా అని నాడు రేవంత్ త‌న‌ను దబాయించి, హైదరాబాదులో తునక భూమి అమ్మితే వేలకోట్ల రూపాయలు వస్తాయని, దీంతో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని చెప్పిన‌ వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఈట‌ల అన్నారు. అధికారంలోకి వ‌చ్చివచ్చి రెండు సంవత్సరాలు దాటిందని, హైద‌రాబాద్ లో తునకలు అమ్ముకుంటున్నారు కానీ ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ మాత్రం ఇవ్వ లేద‌న్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నట్టుగానే సీఎం రేవంత్‌ చుట్టూ కూడా ల్యాండ్ బ్రోకర్లు, ల్యాండ్ మాఫియా తయారయ్యారని ఈట‌ల ఆరోపించారు.

రేవంత్ ..రూ. 7 వేల కోట్ల భూమిని బ్రోక‌ర్ల‌కు ఎందుకు క‌ట్ట‌బెట్టావ్

ఎల్లమ్మబండలో ఉన్న ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని సుప్రీంకోర్టులో నెగ్గింది అంటేనే వారితో ఈ ప్రభుత్వం ఎంతగా కొల్యూడ్ అయిందో అర్థమవుతుందన్నారు.. దాని విలువ 7వేల కోట్లు. అయితే ఫీజు రియింబ‌ర్స్ మెంట్‌ ఇచ్చేది 9 వేల కోట్లు అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు దమ్ముంటే.. ప్రజల పట్ల ప్రేమ ఉంటే నిజంగా సమస్యలు పరిష్కరించాలని ఉంటే… ఎందుకు ఈ భూమిని బ్రోకర్లకు కట్టబెడుతున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ల్యాండ్ బ్రోక‌ర్ల‌కు అండ‌గా హైడ్రా

హైడ్రా వస్తే పేదల భూములు… ఇండ్లు… పార్కులు కాపాడుతారని అనుకున్నాం… ల్యాండ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అనుకున్నాం… కాని ఇందుకు విరుద్దంగా హైడ్రా ఈ ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలుస్తుంది. అని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. గాజులరామారం ద‌గ్గ‌ర‌ సర్వేనెంబర్ 7లోని 300 ఎకరాల భూమిలో పేద‌ల ప్ర‌జ‌లు 40 గజాల్లో వేసుకున్న గుడిసెలను కూల‌గొట్టిన హైడ్రా ల్యాండ్ మాఫియా చేతిలో ఉన్న భూమిని మాత్రం ముట్టుకోలేద‌న్నారు. పేదల ఇండ్లు కూలగొట్టి 15 వేల కోట్ల రూపాయల విలువగల భూమిని కాపాడామని ప్రకటన ఇచ్చుకోవడం నిస్సిగ్గుగా ఉందన్నారు.

సీఎం కార్యాల‌యం, ఆర్థిక శాఖ మంత్రి చెపితేనే బిల్లులు

రూ. 5వేల కోట్ల పెట్టి గాంధీ విగ్రహాలు పెడతాను, లక్షన్నర కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి చెప్తున్నార‌ని, అవి చేస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మా పిల్లల ఆత్మహత్యలు ఆపి, మా పిల్లలకు దూరమవుతున్న విద్య అందించిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని ఈట‌ల రాజేంద‌ర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. నిధులు విడుద‌ల చేయ‌మంటే చీఫ్ సెక్రటరీ.. ఫైనాన్స్ సెక్రెటరీలు మా చేతిలో కూడా ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారన్నారు. పేరుకే ప్రజాస్వామ్యం తప్ప పవర్ అంతా సెంట్రలైజ్ అయిపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి చెప్పితే తప్ప బిల్లులు రాని పరిస్థితి ఉందని, ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌న్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వారు దాచుకున్న బెనిఫిట్స్ అందడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంట్రాక్టు పని చేసిన వారు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కానీ బిల్లుల కోసం బ్రోకరిజం చేసే వాళ్ళు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు.

సంపాద‌న ఎజెండా త‌ప్ప‌…

రేవంత్ స‌ర్కారుకు డబ్బులు సంపాదించాలి.. కేంద్ర పార్టీకి పంపించాలి అనే ఎ జెండా తప్ప మరోటి లేదని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లుగా మీరు పనులు చేస్తున్నారు.. కానీ మీరు చేస్తున్నవన్నీ లెక్క రాసి పెడుతున్నామన్నారు. సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం సత్తా చూపిస్తుందన్నారు. దేనికైనా హద్దు పద్దు ఉంటుందని… తెలంగాణ సమాజానికి మాయ చేయడం రాదు బరిగిసి కొట్లాడుతుందన్నారు. మీరు… పాతబకాయిలు అని తప్పించుకుంటున్నారని… పాత బకాయిలు ఉన్న ఇళ్ల బిల్లు, కరెంటు బిల్లు, నల్లాబిల్లును వసూలు చేయడం లేదా ? అని అడిగారు. బకాయిలు ఎట్లా వసూలు చేసుకుంటున్నారో గతంలో ఉన్న బకాయిలను కూడా చెల్లించాలని జ్ఞానం మీ ప్రభుత్వానికి లేదా ? అని రేవంత్ స‌ర్కారును ఈట‌ల నిల‌దీశారు.

పోస్టింగ్ ల కోసం బాసిన‌లుగా మార‌కండి

అధికారులారా మీరు బానిసలు లెక్క పనిచేయకండని ఈట‌ల రాజేంద‌ర్ హిత‌వు ప‌లికారు. వాళ్లకంటే సోయి లేదు… ఐఏఎస్ అధికారులు మీరేనా చెప్పండి… మంచి పోస్టింగుల కోసం వాళ్ల దగ్గర బానిస లెక్క మారటం జుగుప్సాకరంగా ఉంద‌న్నారు. తెలంగాణలో సామాన్య ప్రజలకు దిక్కు మొక్కు లేకుండా పోయిందని ఈట‌ల అన్నారు. చట్టం చట్టబండలై బాసుల ఆదేశాల మేరకే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్ర‌జాస్వామిబద్ధంగా… న్యాయబద్ధంగా… ధర్మబ‌ద్ధంగా పాలన జరగడం లేదని,ఇది మంచిది కాద‌న్నారు. తెలంగాణ తెచ్చుకుంది ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని సమాజం కోసమ‌న్నారు. కొంతమంది సంఘాల నాయకులు మాట్లాడినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని, మీరు కన్నెర్ర చేస్తేనే పరిష్కారం అవుతుందని, కర్రు కాల్చి వాత పెట్టే స్థాయికి రాకపోతే వీరు మారరని ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ స‌మాజానికి పిలుపు ఇచ్చారు. మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి త‌న‌ సంపూర్ణ మద్దతు ఉంటుందనీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

Devji surrendered | లాంఛనంగా లొంగిపోయిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్‌, గంగన్న.. మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన డీజీజీ
కేరళ పేరు మారనుంది… ఇక నుంచి కేరళం