Devji surrendered | లాంఛనంగా లొంగిపోయిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్‌, గంగన్న.. మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన డీజీజీ

తెలంగాణ పోలీసులకు లొంగిపోయారని ప్రచారం సాగిన కీలక నేతలు దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి మంగళవారం డీజీపీ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. వారు లొంగిపోయారని డీజీపీ శివధర్‌ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టు కీలక నేత గణపతి లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 24, 2026 4:58 PM IST
Devji surrendered | లాంఛనంగా లొంగిపోయిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్‌, గంగన్న.. మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన డీజీజీ
  • నాలుగు దశాబ్దాల అజ్ఞాత జీవితానికి స్వస్తి
  • తెలంగాణ నుంచి అజ్ఞాతంలో 11 మంది మావోయిస్టులు
  • గణపతి లొంగుబాటు కోసం ప్రయత్నం: డీజీపీ శివధర్ రెడ్డి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Devji surrendered | తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు లొంగిపోయారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి లొంగిపోయిన నలుగురు నక్సలైట్లతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. లొంగిపోయిన వారిలో దేవ్ జీ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ మిలటరీ కమిషన్ బాధ్యునిగా పనిచేస్తున్నారు. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. వీరిద్దరిపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. దామోదర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండగా, గంగన్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు.

నాలుగు దశాబ్దాల అజ్ఞాతానికి వీడ్కోలు

  • ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (62) 44 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో అజ్ఞాత జీవితంలో ఉన్నారు. 1978లో ఇంటర్మీడియట్ చదువుకున్న క్రమంలోనే దేవ్ జీకి ఆర్‌ఎస్‌యూతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్న క్రమంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ముందుగా ఆదిలాబాద్, ఆ తర్వాత గడ్చిరోలి ప్రాంతంలో పనిచేస్తూ అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుని స్థాయికి ఎదిగారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యునిగా, దాని బాధ్యునిగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు గత ఏడాది 2024 మే 21న మాడ్ అటవీ ప్రాంతంలోని గండికోట అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ వ్యవహరిస్తున్నారు.
  • పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన మల్లా రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్ (76) 1974లో రాడికల్ విద్యార్థి సంఘం ద్వారా విప్లవోద్యమంలోకి వచ్చి ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీలో చేరి దండకారణ్యంలోకి వెళ్లిపోయారు. రాజిరెడ్డి 46 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడిపారు. గతంలో ఆయన ఒక పర్యాయం అరెస్టు అయినప్పటికీ తిరిగి పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
  • ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండల, కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్ (47) పదవ తరగతి చదువుతూ రాడికల్ విద్యార్ధి సంఘంలో పనిచేశారు. గోవిందరావులో పేటలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 1996 మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
  • గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరు గ్రామానికి చెందిన నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న (62) జననాట్యమండలి ద్వారా 1990లో పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ నలుగురు ముఖ్యనాయకులు రెండు రోజుల క్రితం పోలీసుల ముందు లొంగిపోయారు. సోమవారం మీడియా ముందు వారిని ప్రవేశపెట్టారు.

లొంగిపోయిన వారికి అండదండలు

లొంగిపోయిన నక్సలైట్లకు తెలంగాణ ప్రభుత్వ పాలసీ ప్రకారం అన్ని విధాలుగా అండగా నిలుస్తామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. లొంగిపోయిన వారికి అందించే రివార్డుతో పాటు వారు తిరిగి నూతన జీవితాన్ని కొనసాగించేందుకు వీలుగా కొందరికి భూమి, మరికొందరికి ఉపాధి, ఇతర జీవనాధార అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిసే నక్సలైట్లకు అండగా ఉంటామన్నారు. ఈ మధ్యకాలంలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ చెప్పారు. ఇందులో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డీవీసీఎంలు, 25 మంది ఎసీఎస్ లు, 45 మంది ఏసీఎంలు ఉన్నారని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోవడం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పాలసీయే కారణమన్నారు. ఈ మధ్యకాలంలో 5865 మంది లొంగిపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రికార్డులగా అభివర్ణించారు.

రాష్ట్రం నుంచి 11 మంది అజ్ఞాతంలో

తెలంగాణ నుంచి 11 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ చెప్పారు. మావోయిస్టు పార్టీ నేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు, నరహరి ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పారు. ముప్పిడి సాంబయ్య, రాజశేఖర్, రత్నబాయి, నక్క సుశీల, అనిల్ కుమార్, భాగ్య, సంతీత, భవాని, హిడావి ఉన్నారన్నారు.

గణపతి బయట ఉన్నారు

గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ప్రస్తుతం అడవిలో లేరని డీజీపీ చెప్పారు. ఎక్కడో షెల్టర్ లో ఉన్నారని చెప్పారు. ఆయన కూడా లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా గణపతి నేపాల్‌లో ఉన్నట్టు, ఆయన తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆయనను తెలంగాణకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశాన్ని డీజీపీ కొట్టిపడేశారు.

మావోయిస్టుల రిక్రూట్ లేదు

2019 నుంచే తెలంగాణలో మావోయిస్టల రిక్రూట్‌మెంట్‌ నిలిచిపోయిందని డీజీపీ వివరించారు. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అంతమైందని గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ప్రస్తుత లొంగుబాట్లే దీనికి నిదర్శనమంటూ చెప్పుకొచ్చారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయిన ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని డీజీపీ వ్యాఖ్యానించారు.