iPhone 17 on Sale | ఐఫోన్​ 17 అమ్మకాలు ప్రారంభం – ఆపిల్ స్టోర్ల వద్ద తోపులాటలు, తొక్కిసలాటలు

ఐఫోన్​ 17 విక్రయాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆపిల్ స్టోర్ల వద్ద అభిమానులు అర్థరాత్రి నుండే గుంపులు గుంపులుగా చేరి, క్యూలలో నిలబడ్డారు. ఇక తోపులాటలు షరామామూలుగానే.

iPhone 17 on Sale | ఆపిల్ తాజా ఫ్లాగ్‌షిప్ ఐఫోన్​ 17 సిరీస్​ ఫోన్ల అమ్మకాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. భారత్‌లోనూ ముఖ్య నగరాల్లోని ఆపిల్ స్టోర్ల వద్ద అర్థరాత్రి నుండే అభిమానులు పెద్ద సంఖ్యలో క్యూల్లో నిలబడి కొత్త ఐఫోన్​ను  తమ చేతుల్లోకి తీసుకోవడానికి పోటీపడ్డారు.

హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో స్టోర్ల ముందు తెల్లవారుజామునే అభిమానులు గుంపులు గుంపులుగా చేరుకున్నారు.  ప్రీ బుకింగ్​ చేసుకున్నవారు, ఇప్పుడే కొనాలనుకున్నవారు అందరూ ఒకేసారి స్టోర్లకు రావడంతో, క్యూల్లో తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. కొన్నిచోట్ల ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల్లో అభిమానులు ఒకరిని ఒకరు తోసుకుంటూ, అరుచుకుంటూ ఐఫోన్ పట్టుకోవడానికి తహతహలాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అత్యంత పలుచని ఐఫోన్​ 17 ఎయిర్​ను చూడటానికి ప్రజలు ఎగబడ్డారు.

చివరికి కొత్త ఐఫోన్​ 17 తమ చేతిలోకి వచ్చిన అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో అన్‌బాక్సింగ్ వీడియోలు షేర్ చేస్తూ #iPhone17 హ్యాష్‌టాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఒకవైపు అభిమానులు “ఇదే అత్యంత స్లీక్ డిజైన్, కెమెరా నిజంగా అద్భుతం” అంటూ పొగిడితే, మరికొందరు మాత్రం “ఒక ఫోన్ కోసం ప్రాణాలకు ప్రమాదం కలిగేలా ఏంటీ తన్నులాటలు?” అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లోనూ ఆపిల్ అభిమానులు, ఆండ్రాయిడ్ అభిమానులు మధ్య వాదోపవాదాలు చెలరేగాయి. ఆపిల్ అభిమానులు “ఐఫోన్  17 టెక్నాలజీలో గేమ్చేంజర్” అని చెబుతుంటే, ఆండ్రాయిడ్ ఫ్యాన్స్​ మాత్రం “ధర ఎక్కువ, ఫీచర్లు పెద్ద గొప్పవేం కావు” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

భారత్‌లో ₹1.5 లక్షలకుపైగా ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఐఫోన్‌పై ఉత్సాహం, చర్చలు ఊపందుకున్నాయి. అభిమానుల గుంపులు, స్టోర్ల వద్ద జరిగుతున్న తోపులాటలు మరోసారి ఐఫోన్​ విడుదల  కేవలం ఒక ప్రోడక్ట్ లాంచ్​గా కాకుండా, ఒక పండుగలా మారుతోందని రుజువు చేశాయి.

Latest News