విధాత : యాషెస్ సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్)లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్లు జాక్ క్రాలీ 37 (48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ 34 (26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందింది ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేశఆరు. అనంతరం జాకబ్ బెథెల్ 40 (46 బంతుల్లో, 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. బ్రైడన్ కార్స్ (6), జో రూట్ (15), బెన్ స్టోక్స్ (2) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్ (2*; 9 బంతుల్లో), జెమ్మీ స్మిత్ (3*; 2 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
రెండో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 4/0తో ఆటను ప్రారంభించిన ఆసీస్ జట్టు 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 రన్స్ కలుపుకొని, ఇంగ్లాండ్‌కు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (46; 67 బంతుల్లో 4 ఫోర్లు) చేసిన పరుగులే అత్యధికం కావడం విశేషం. స్కాట్ బోలాండ్ 6, జేక్ వెదర్లాడ్ 5, లబుషేన్ 8, ఉస్మాన్ ఖవాజా 0, కామెరూన్ గ్రీన్ 19, మైఖేల్ నీసర్ 0, మిచెల్ స్టార్క్ 0, రిచర్డ్‌సన్ 7 సహా అంతా బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. సహచరుల నుంచి సహకారం దక్కకపోవడంతో మరోవైపు స్టీవ్ స్మిత్ 24* (39 బంతుల్లో 1 ఫోర్) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4, జోష్ టంగ్, బెన్‌స్టోక్స్ తలో 2, గస్ అట్కిన్సన్ 1 వికెట్ సాధించి అసీస్ పతనాన్ని శాసించారు.
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్ పై 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ బౌలర్లు కాపాడుకుంటారనుకున్నప్పటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్ బాల్ గేమ్ తో విజయ లక్ష్యాన్ని చేధించగలిగారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీసుకున్న ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 152, రెండో ఇన్నింగ్స్ లో 132 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 110పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 178పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో 20 వికెట్లు నేలకూలగా, రెండో రోజు ఆటలో 16 వికెట్లు పడిపోయాయి. చిత్రంగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లెవరూ కనీసం హాఫ్ సెంచరీ సాధించలేకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆస్ట్రేలియా 5 టెస్టుల యాషెస్ సిరీస్ లో తొలి మూడు టెస్టులు గెలుచుకుని సిరీస్ సాధించగా…నాల్గవ టెస్టులో గెలిచి ఇంగ్లాండ్ పరువు నిలుపుకుంది. రెండు రోజుల్లోనే బాక్సింగ్ డే టెస్టు ముగిసిపోవడంతో క్రికెట్ అభిమానులు, మాజీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Duvvada Srinivas | చంపుతారా రండి..ఇక్కడే ఉన్నా : అర్ధరాత్రి హైవేపై దువ్వాడ హల్చల్
Sankranthi Holidays | తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు..!
