Hyderabad Pre-Launch Projects | నిలిచిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు.. కొనుగోలుదారుల అరిగోస.. నిపుణులు ఏమంటున్నారు?

మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కల! ఆ కల కోసం రేయింబళ్లు కష్టపడతారు. కడుపు కట్టుకొని రూపాయి రూపాయి పోగేస్తారు. పొదుపు చేసుకున్న సొమ్మునంతా తీసుకెళ్లి బిల్డర్‌ చేతిలో పోస్తారు! ఇక రెండేళ్లలో సొంతింటికి వెళ్లడమేనంటూ కలలు కంటూ ఉంటారు. కలల తీరానికి చేరుకునే మార్గంలా ఈఎంఐలు మొదలవుతాయి కానీ.. ఏం విచిత్రమోకానీ.. కలల తీరం మాత్రం చేతికి అందడం లేదు. ఇదే రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం! మహా మోసం!

hyderabad prelaunch scam crisis image created with AI help

Hyderabad Pre-Launch Projects | ప్రీలాంచ్‌.. ఫ్రీ లాంచ్‌.. ఎర్లీబర్డ్‌.. పేరు ఏదైతేనేం.. ముందుగానే కస్టమర్ల నుంచి భారీగా అడ్వాన్సులు కట్టించుకోవడం.. ఆ తర్వాత సదరు నిర్మాణ భూమి.. చిక్కుల్లో పడినా.. లేదా ఒక ప్రాజెక్టు కోసం సమీకరించిన సొమ్మును మరో ప్రాజెక్టుకు మళ్లించినా.. వాటిపై ఈడీ, ఐటీ సోదాలు.. ఆస్తల సీజ్‌తో ప్రాజెక్టుల పని నెమ్మదించడం! కొన్ని కేసులలో అటకెక్కించడం! మరికొన్ని వెంచర్లు ప్రారంభించిన తర్వాత అనుమతులు లేక ఆగిపోతున్నాయి. హైదరాబాద్‌లో, నగరం చుట్టుపక్కల ఇలా అనేక ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కునారిల్లుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. నిజానికి ఇక్కడ తప్పు చేసింది బిల్డర్‌ అయితే.. శిక్ష మాత్రం ఆ వెంచర్లలో ఫ్లాట్లు బుక్‌ చేసిన కొనుగోలుదారులకే పడుతున్నది. ఎందుకంటే.. అప్పటికే ఈఎంఐలు ప్రారంభం అయి ఉండటంతో.. ప్రతి నెలా వాటిని కట్టక తప్పదు. మరోవైపు సొంతిల్లు చేతికి అందేదీ లేదు. వీటికి తోడు ఇప్పటికే ఉంటున్న ఇంటికి ప్రతి నెలా అద్దె చెల్లించకా తప్పదు. ఇలా ఒక పనికి డబుల్‌ భారాలు మధ్యతరగతి కలలను ఛిన్నాభిన్నం చేసి పారేస్తున్నాయి. మరోవైపు అక్రమాల పేరిట నిర్మాణాలు ఆపించి.. ఆస్తులు సీజ్‌ చేస్తున్న ఈడీ, ఐటీ తదితర సంస్థలు.. వాటిల్లో డబ్బు పెట్టి మోసపోయిన సామాన్యులకు పరిష్కారాలు చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సదరు వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అటు ప్రాజెక్టు పూర్తికాక, ఇటు ఈఎంఐ, ఇంటి అద్దెల చెల్లింపు భారాలతో సతమతమవుతున్నారు. కొందరు ధైర్యం చేసి ‘రెరా’ను ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నా.. చాలామంది ఫిర్యాదు చేసేందుకు సాహసించకపోవడం, ఉన్న డబ్బులకు కూడా తిరకాసు వస్తుందేమోనన్న భయాలు.. రియల్టర్లకు కలిసి వస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

బిల్డర్ అవతారమెత్తాల్సిన దుస్థితిలో కొనుగోలుదారులు

దుండిగల్ మునిసిపాలిటీ పరిధి భౌరంపేటలో జయ ప్లాటినం.. 60 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని ప్రారంభించింది. కొందరు ఫ్లాట్స్‌ బుక్‌ చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ 2022లో బిల్డర్ పనులు నిలిపివేశారు. బిల్డర్ వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా స్పందించకపోవడం, పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో విసుగుచెందిన కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన రెరా.. డెవలపర్‌కు జారీ అయిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. నిర్మాణ బాధ్యతలను కొనుగోలుదారులకు అప్పగించింది. కాంట్రాక్టర్ ద్వారా పెండింగ్ పనులు పూర్తి చేయించుకున్న కొనుగోలుదారులు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తెప్పించుకున్నారు. జయ డైమండ్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌దీ అదే కథ. కొన్ని నెలలుగా పనులు జరుగకపోవడంతో కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించగా, బిల్డర్‌ను తప్పించి నిర్మాణాలు పూర్తి చేసే బాధ్యతను కొనుగోలుదారులకే అప్పగించారు.

అమీన్‌పూర్‌లో ఫ్రీ లాంచ్ మోసం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ… సాహితి శర్వణి ఎలైట్ పేరుతో ఫ్రీ లాంచ్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ సంస్థ యజమాన్యంపై మొత్తం 17 ప్రాజెక్టుల విషయంలో కేసులు నమోదయ్యాయి. అమీన్‌పూర్‌లో 23 ఎకరాల విస్తీర్ణంలో 11 భారీ టవర్లను ఈ సంస్థ ప్రకటించింది. ఒక్కో టవర్‌లో 33 అంతస్తులు నిర్మాణం చేస్తున్నట్లు అందమైన బ్రోచర్లు ముద్రించి, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో వందల మంది ఎగబడి ఫ్రీ బుకింగ్ చేసుకున్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువగా అమీన్‌పూర్‌, మాదాపూర్, కూకట్‌పల్లి, తెల్లాపూర్ ప్రాంతాలలో ఫ్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించారు. సుమారు 2,500 మంది కొనుగోలుదారుల నుంచి రూ.3వేల కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడమే కాకుండా, మోసపూరితంగా వినియోగదారులను నిండా ముంచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో సంస్థ యజమాని బూదాటి లక్ష్మీనారాయణ, ఇతర డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు డైరెక్టర్ పురుషోత్తంరావును అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి నుంచి రూ.174 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం 64 కేసులలో 19 కేసులలో మాత్రమే చార్జీషీట్ దాఖలు కాగా మిగతా కేసులపై విచారణ జరుగుతోంది.

ఉపశమనం లేని శ్రీవారి బృందావ‌నం

గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలో శ్రీవారి బృందావ‌నం కథ మరోటి. ఇక్కడ ‘నివాస’ ప్రాజెక్టును 0.98 ఎకరాల విస్తీర్ణంలో డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ యూనిట్లను నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పించింది. మే 2024 నాటికి ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. బిల్డర్ సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోవడంతో కొనుగోలుదారులు రెరాలో ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదును పరిశీలించిన రెరా… పనులు, బుకింగ్స్‌, లావాదేవీలు నిలిపివేయాలని, కొత్తగా విక్రయాలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది.

తెల్లాపూర్‌లో రూ.4.41 కోట్ల మోసం

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో అనుమతులు లేకుండా జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది మంది కొనుగోలుదారుల నుంచి రూ.4.41 కోట్లు వసూలు చేసింది. అయినా.. పనులు ప్రారంభించకపోవడంతో సదరు సంస్థపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)లో కేసు నమోదు చేశారు. ఆరు నెలల్లో అనుమతులు తీసుకుని పనులు మొదలు పెడ్తామని చెప్పి తమ నుంచి డబ్బులు వసూలు చేశారని కే మహేశ్‌, టీ చంద్ర కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. బిల్డర్‌ హామీ ప్రకారం 2021 డిసెంబర్‌లో రూ.35 లక్షల చొప్పున చెల్లించి ఎంఓయూ చేసుకున్నామని ఫిర్యాదులో తెలిపారు. పనులు ప్రారంభించకపోవడంతో బిల్డర్‌ను నిలదీశారు. ఎట్టకేలకు 2023 జూన్‌లో భూమి పూజ చేసి.. కొనుగోలుదారులను సంస్థ శాంతిపచేసేందుకు ప్రయత్నించింది. కానీ.. 2025లో తిరకాసు పెట్టింది. పెరిగిన విస్తీర్ణానికి అదనంగా డబ్బు చెల్లించాలని, దానికి జీఎస్టీ కూడా వర్తిస్తుందని చెప్పడంతో.. తాము మోసపోయినట్టు గుర్తించామని బాధితులు పేర్కొన్నారు. ఇదే విషయంలో నిలదీయడంతో సంస్థ యజమాని సుధాకర్‌.. 2025 ఆగస్ట్‌లో ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

మాట తప్పిన వాసవి డెవలపర్స్

హఫీజ్‌పేటలో వాసవి రియల్టర్స్… వాసవి లేక్ సిటీ పేరుతో భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. 2023లో పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇప్పటికి అనేకసార్లు తేదీలు సవరించారు. అయినా.. కొనుగోలుదారులకు ఫ్లాట్లు అప్పగించలేదు. ఒప్పందం ప్రకారం డెవలపర్ పనులు పూర్తి చేయనందున వినియోగదారులకు 10.8 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని రెరా ఆదేశించింది. ఒక్కో వినియోగదారుడు రూ.1 కోటి వరకు డెవలపర్‌కు చెల్లించి, బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, ఆర్థికంగా నష్టపోతూ, మానసికంగా వేదన అనుభవిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని దుస్థితి నెలకొంది. ఇదే సంస్థ బాచుపల్లిలో వాసవి అర్బన్ పేరుతో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించింది. 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తొలుత చెప్పి, దాన్ని మరో 12 నెలలు పొడిగించారు. దీంతో కొనుగోలుదారులు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రెరాకు ఫిర్యాదు చేయడంతో డెడ్ లైన్ ఆగస్టు 2026కు తగ్గించారు. కొందరు కొనుగోలుదారులకు ప్రతి నెలా రూ.7వేల చొప్పున గుడ్ విల్ సపోర్టు కింద డెవలపర్ చెల్లిస్తున్నారు. ఎల్బీ నగర్‌లో వాసవి గ్రూపు 29.37 ఎకరాల్లో 11 టవర్లలో 33 అంతస్తుల ఎత్తులో భారీ అపార్ట్ మెంట్లను నిర్మాణం చేస్తున్నది. డిసెంబర్ 2026 నాటికి కొనుగోలుదారులకు అందచేయాల్సి ఉంది. పనులు పూర్తి కాకపోవడం, కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో 2028 జూన్ నుంచి డిసెంబర్ మధ్య పూర్తి చేసి అప్పగించాలని రెరా గడువు విధించింది. ఇంతకు ముందు వాసవి లేక్ సిటీ ప్రాజెక్టును ఆలస్యం చేయడంతో రెరా పెనాల్టీలు విధించింది.

మూసాపేటలో కోట్ల నిధులు మళ్లింపు

మూసాపేట వై జంక్షన్‌లో అజయ్ సల్కే కుటుంబం ఆధ్వర్యంలోని ‘వైట్ వాటర్స్’ కొనుగోలుదారుల నుంచి అడ్వాన్స్ రూపం వసూలు చేసిన సొమ్ములో రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురుకి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 15 అంతస్తుల వరకే అనుమతులు ఉండగా అదనంగా రెండు అంతస్తులు నిర్మాణం చేసి విక్రయాలు కూడా చేశారని తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టులో 80 శాతం విక్రయాలు పూర్తి చేసిన డెవలపర్, డబ్బులు లేవంటూ కొద్ది నెలలుగా పనులు నిలిపివేశారు. నిజానికి ఈ ప్రాజెక్టులో ‘జనప్రియ’ సంస్థ పేరును ఉపయోగించారు. వాస్తవం ఏమంటే ఆ భూమి.. జనప్రియ సంస్థది. డెవలపర్ మాత్రం వైట్ వాటర్స్.

ఆ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు…

కూకట్‌పల్లి, నార్సింగి, కోకాపేట ప్రాంతాలలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు హెచ్ఎండీఏతో పాటు హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. పనులు అసంపూర్తిగా వదిలేయడం, అనుమతులు లేని నిర్మాణాల కారణంగా వినియోగదారులు అధికంగా నష్టపోతున్నారు. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్‌లో గండిపేట నాలాను కబ్జా చేసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నది. సర్వే పేరుతో హడావుడి చేసిన హైడ్రా ఆ తరువాత చర్యలు తీసుకోకుండా వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

ఐటీ, ఈడీ అకౌంట్ ఫ్రీజ్ చేసినా రెరా జోక్యంతో..

ఐటీ, ఈడీ వంటి సంస్థలు సోదాలు నిర్వహించి అకౌంట్లు సీజ్ చేసిన తరువాత వాటిల్లో ఉన్న డబ్బును వినియోగించి నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉండదు. కేసు తేలే వరకు పరిస్థితి ఏమిటి? బిల్డర్‌కు శిక్ష వేయండి కానీ మమ్మల్ని శిక్షించడమేంటని బాధితులు వాపోతున్నారు. ఫ్లాట్ల కొనుగోలుదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఏంటనేదే నేడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇలా చేయాలి..

ఇవి కూడా చదవండి..

 

Latest News