Woman Curator| ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదని నిరూపిస్తూ ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. పురుషులకి ధీటుగా వారు విజయాలు సాధించడం చూసి దేశం గర్వపడుతుంది. ఇక క్రికెట్‌లో కూడా మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహిళా క్రికెట్ పోటీలు జరుగుతుండడం మనం చూస్తున్నాం. ఇక మహిళా అంపైర్స్, లేడి కామెంటేటర్స్ ఇలా క్రికెట్‌లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ తొలి మహిళా క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా ప్రణీషా గోరెంట్ల అవతరించింది. గతంలో కర్ణాటకకు చెందిన జసింతా కళ్యాణ్ దేశపు తొలి మహిళా క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా అవతరించారు.ఒకప్పుడు రిసెప్షనిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత పిచ్ క్యూరేటర్‌గా మారింది.
అయితే ఇప్పుడు ప్రణీషా గోరెంట్ల అసిస్టెంట్ క్యూరేటర్‌గా అవతరించింది. ఆమెకి హెచ్‌సిఎ సెక్రటరీ ఆర్ దేవరాజ్ అధికారిక లేఖని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకి దక్కిన ఈ ఘనత పట్ల స్పందించిన ప్రణీషా.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)లో సర్టిఫైడ్ క్యూరేటర్‌గా ఉండాలని నేను అనుకున్నాను. ఇది నా కెరీర్‌కు గొప్ప ప్రోత్సాహం అని 29 ఏళ్ల ప్రణీషా అన్నారు. భారతదేశంలో ఇప్పుడు ఇద్దరు మహిళా క్యూరేటర్లు ఉండగా, అందులో ఒకరు కర్ణాటక నుండి, మరొకరు విదర్భ నుండి. అయితే ఆల్ రౌండర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రణీషా హైదరాబాద్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఒకప్పుడు అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో తమిళనాడుపై 32 బంతుల్లో 52 పరుగులు చేసిన ప్రణీషా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చేసిన ప్రణీషా చీలమండ గాయం వలన ఆటకి కాస్త విరామం ఇచ్చింది. ఇక అదే సమయంలో ఆమె నాన్న వరంగల్‌కి బదిలీ అయ్యారు. దాంతో ఆటపై మక్కువ చంపుకోలేక క్యూరేటర్‌గా మారడానికి ఆసక్తి చూపింది. దేశంలో తక్కువ మంది మహిళా క్యూరేటర్స్ ఉన్నారని తెలుసు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో ఒక వెబ్ సైట్ కనుగొన్నాను. అందులో వికెట్ మేకింగ్‌కి సంబంధించిన నైపుణ్యం గురించి తెలుసుకున్నాను. అయితే తండ్రి ప్రోత్సాహంతో భూమిని లీజుకి తీసుకొని అక్కడ వికెట్ తయారు చేసింది. అక్కడ కొన్ని మ్యాచ్‌లు ఆడగా, 2019-20లో కోవిడ్ రావడంతో ఆమె ప్రణాళికలకి చెక్ పడింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన తన తల్లిదండ్రులు మళ్లీ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ప్రణీష ఈ ఏడాది గ్రౌండ్ స్టాఫ్‌గా ఉండాలని హెచ్‌సీఏ అధికారులను ఆశ్రయించింది. క్యూరేటర్ ఉద్యోగంపై ఆమెకున్న ప్రేమను చూసి, భారత మాజీ కెప్టెన్ పూర్ణిమ రావు మరియు అర్చన, ప్రణీషా పేరును HCAకి ప్రతిపాదించారు.
అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మరియు దేవరాజ్ ఈ ఏడాది జనవరిలో ఆమెను క్యూరేటర్‌గా తీసుకున్నారు . రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆమెకి మంచి అనుభవం కలిగించింది. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె పలు పిచ్‌ల తయారీలో ఆమె పాత్ర ఉందని తెలుస్తుంది.