విధాత : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 189పరుగులతో సరిపెట్టుకుంది. 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా 62.2 ఓవర్లలో 189 పరుగుల వద్ద ముగిసింది. దీంతో సఫారీ జట్టుపై 30 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39; 119 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ (29; 89 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (27; 24 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (27; 45 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులతో రాణించారు.
వరుసగా వికెట్లు పడటంతో పాటు భారత్ బ్యాటర్లలో ఒక్కరైనా భారీ స్కోర్ చేయకుండా దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేయడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది. శుభ్‌మన్ గిల్ (4*) గాయంతో రిటైర్ హార్డ్ గా వెనుతిరిగి మళ్లీ బ్యాటింగ్ కు రాలేదు. యశస్వి జైస్వాల్ (12), ధ్రువ్ జురేల్ (14) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 4, మార్కో జాన్సెన్ 3, కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
