Viral Video | చెట్టుమీద కాయలను పక్షులు చిలక్కొట్టుడు కొడతాయి. కానీ.. బంగారం ఎత్తుకెళ్లిన పక్షుల గురించి మీరు విన్నారా? పక్షులేంటి బంగారం కొట్టుకుపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! ఆసక్తికర ఘటన బెంగళూరులో చోటు చేసుకున్నదంటూ ఒక వీడియో వైరల్ అవుతున్నది. ఇలా పక్షులు ఎత్తుకుపోయినట్టు చెబుతున్నవి అంతో ఇంతో బంగారు ఆభరణాలు కావు.. ఏకంగా సుమారు కిలో బరువు ఉంటాయట. ఇలా ఎత్తుకుపోయిన బంగారం ఎక్కడ పడేశాయని అనుకుంటున్నారా? ఈ సంగతి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. అవి ఆ బంగారు ఆభరణాలను మోసుకుపోయి.. తమ గూడును అలంకరించుకున్నాయిట!
https://twitter.com/srk9484/status/1912315055716303036
బెంగళూరులోని హైకోర్ట్ రోడ్‌లో బంగారు నగల దుకాణాలు ఉన్నాయని, వాటిలోంచి బంగారు ఆభరణాలను కొన్ని పక్షులు ఎత్తుకెళ్లిపోయాయని ఒక వీడియో వైరల్ అవుతున్నది. ఇది గమనించిన వ్యాపారులు వాటి వెంటపడ్డారట. తీరా చూస్తే సమీపంలోని ఒక చెట్టుపై కట్టుకుంటున్న గూడుకు వాటిని వాడుకున్నాయట. ఆ బంగారు గూడులో పెట్టిన గుడ్లను ఆ పక్షులు పొదుగుతున్నాయని, అవి పొదిగేదాకా వాటిని కదిపే వీలు లేకపోవడంతో వాటిని నగల వ్యాపారుల కాపాడుకుంటున్నారని అందులో ఉంది.
ఈ వార్త అక్కడా ఇక్కడా పాకి.. నెట్టింటికి చేరింది. తమ బంగారు గూడుపై దర్జాగా కూర్చొని ఉన్న ఆ పక్షుల వీడియో వైరల్‌గా మారింది. చిలక్కొట్టుడు కొట్టే పక్షులు బంగారాన్ని కొట్టేసిన తీరు చూసి నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు. కొందరు ఔత్సాహికులు మాత్రం అది ఏఐతో సృష్టించిన వీడియో అని తేల్చేశారు. ఇది ఫేక్ వీడియో అని, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక న్యూస్ లేదని అంటుండం విశేషం. ఏది ఏమైనా ఆ వీడియోలో బంగారు గూడు మాత్రం నగలతో మెరిసిపోతూ ముచ్చటగొలుపుతున్నది.