Site icon vidhaatha

King Cobra | బుసలు కొడుతున్న 19 అడుగుల కింగ్‌ కోబ్రాతో ఆ ఆటలేంట్రా బాబూ!

King Cobra | సాధారణంగా పాములను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అదే ఏ నాగుపామో, కొండచిలువలో అయితే చెప్పనక్కర్లేదు! అలాంటిది ఇక కింగ్‌ కోబ్రా కనిపిస్తే? గుండెలు దడదడలాడిపోతాయి. కానీ.. స్నేక్‌ క్యాచర్స్‌ మాత్రం బొమ్మలాట అడుకుంటున్నట్టో.. లేదా కుందేలుతో ఆడుకుంటున్నట్టో అన్నంత ఈజీగా పాములతో సరదా చేష్టలు చేస్తూ ఉంటారు.

మనం పాముల దగ్గరకు వెళ్లేందుకు కూడా భయపడతాం కానీ.. వారు ఉట్టి చేతులతో పాములను అలవోకగా పట్టేస్తారు. కింగ్‌ కోబ్రా అయినా సరే.. వాళ్ల చేతిలో బందీ అయిపోతుంది. ఇక ఆ కింగ్‌ కోబ్రాను ఏదో ట్రోఫీ ఎత్తినట్టుగా పోజులు ఇస్తూ వీడియోల ముందు విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటిదే ఒక వీడియో తాజాగా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నది. 5.85 మీటర్లు.. అంటే 19.2 అడుగుల పొడవు ఉన్న ఆ కింగ్‌ కోబ్రాను చూస్తే వణుకుపట్టడం ఖాయం.

సదరు కింగ్‌ కోబ్రా నల్లగా నిగనిగలాడుతూ బుసలు కొడుతూ ఈ వీడియోలో కనిపిస్తుంది. దానిని పట్టుకున్న యోగేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి దానితో విన్యాసాలు చేస్తూ అబ్బురపర్చాడు. దాదాపు పది పదిహేను అడుగుల పొడవు ఉన్న కింగ్‌ కోబ్రాను కోతినో కొండముచ్చునో ఆడించినట్టు ఆడిస్తూ వీడియో చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు కళ్లార్పకుండా చూస్తున్నారు.

అనేక మంది ఈ వీడియోను తమ ఎక్స్‌ ఖాతాల్లో షేర్‌ చేసుకుంటున్నారు. వాటికి స్పందనలు కూడా చిత్రవిచిత్రంగా వస్తున్నాయి. ఇతనికేమైనా పిచ్చా? అని కొందరు ప్రశ్నించారు. అదేమన్నా మీ కుటుంబంలో సభ్యురాలా?.. అంటూ ఆరా తీసిన ఒక యూజర్‌.. డ్యూడ్‌ ఈజ్‌ సో చిల్‌ అంటూ ప్రశంస కురిపించాడు. చాలా అందంగా ఉందని కొందరు, అమ్మో.. చాలా డేంజరస్‌ అంటూ కొందరు స్పందించారు. అంత పట్టుకుంటున్నా ఆ కోబ్రా అతడిపై ఎందుకు దాడి చేయడం లేదనికొందరు డౌటనుమానాలు లేవనెత్తారు. మరి మీకేమనిపించింది?.

Exit mobile version