Mahindra XEV 9S | మీరిప్పటిదాకా 7 సీటర్​ ఎలక్ట్రిక్‌ SUV చూళ్లేదు కదా.. ఇదిగో.!

మహీంద్రా తమ తొలి 7 సీట్ల ఎలక్ట్రిక్‌ SUV XEV 9Sను నవంబర్‌ 27న ఆవిష్కరించనుంది. ట్రిపుల్‌ స్క్రీన్‌, 3-రో సీటింగ్‌, హార్మన్‌ సౌండ్‌ సిస్టమ్‌తో ఈ SUV EV మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.

Mahindra XEV 9S: India’s First 7-Seater Electric SUV To Debut On November 27

Mahindra XEV 9S: India’s First 7-Seater Electric SUV To Debut On November 27

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా ఎలక్ట్రిక్‌ విభాగంలో మరో మైలురాయిని చేరుకోబోతోంది. “స్క్రీమ్‌ ఎలక్ట్రిక్‌” వార్షికోత్సవంలో భాగంగా నవంబర్‌ 27న బెంగళూరులో తమ తొలి 7 సీట్ల ఎలక్ట్రిక్‌ SUV — XEV 9Sను ఆవిష్కరించనుంది. ఇది కంపెనీ “Born Electric” ప్లాట్‌ఫామ్‌లో రూపొందించిన అత్యాధునిక మోడల్‌గా నిలవబోతోంది. XEV 9S, ఇప్పటికే మంచి ఆదరణ పొందిన XEV 9e కూపే మోడల్‌కు SUV రూపాంతరం. అదే డాష్‌బోర్డ్‌ లేఅవుట్‌తో, అంతకంటే ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యంతో, ఇది పూర్తి కుటుంబ అవసరాలకు సరిపడేలా రూపొందించబడింది.

మహీంద్రా తాజాగా విడుదల చేసిన టీజర్‌లో ఇంటీరియర్స్​ను తళుక్కుమనిపించింది. డాష్‌బోర్డ్‌ మొత్తం వ్యాపించే ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌, రెండు స్పోక్‌ల స్టీరింగ్‌ వీల్‌, స్లైడింగ్‌ మిడిల్‌ రో సీటు వంటి ఫీచర్లు కనిపించాయి. పెద్ద పనోరమిక్‌ సన్‌రూఫ్, బాస్‌ మోడ్‌ సీటింగ్‌ ఫీచర్‌, లెదరెట్‌ సీట్లు, గ్లోసీ బ్లాక్‌ ఫినిష్‌తో ఇంటీరియర్‌ డిజైన్‌ మంచి లగ్జరీ లుక్‌నిస్తుంది.
ఈ SUVలో 3 వరుసలలో ఏడుగురు కూర్చునే సదుపాయం ఉండగా, మధ్య వరుసను జరపగలిగే సౌలభ్యం ఉండటం వల్ల చివరి వరుసలో కూడా విశాలమైన స్థలం లభిస్తుంది. హార్మన్‌ కార్డన్‌ 16-స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ADAS లెవల్‌ 2 డ్రైవర్‌ అసిస్ట్‌, 360-డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో లభించనున్నాయి.

XEV 9S – శక్తివంతమైన బ్యాటరీ : కొత్త సవాళ్లకు సిద్ధంగా..

డ్రైవ్‌ట్రైన్‌ వివరాలను మహీంద్రా ఇంకా వెల్లడించకపోయినా, XEV 9S లో 59 kWh మరియు 79 kWh లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ (LFP) బ్యాటరీలు ఉండే అవకాశం ఉంది. వీటి ద్వారా 542 కిమీ నుండి 656 కిమీ వరకు రన్నింగ్​ రేంజ్‌ లభిస్తుందని అంచనా. 231 హార్స్‌పవర్‌ సామర్థ్యం గల ఎలక్ట్రిక్‌ మోటార్‌, వెనుక యాక్సిల్‌పై అమర్చబడింది. ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (AWD) వెర్షన్‌ను కూడా మహీంద్రా అందించే అవకాశం ఉంది.

బయటి డిజైన్‌ విషయానికి వస్తే, XEV 9S, XUV.e8 కాన్సెప్ట్‌ నుంచి ప్రేరణ పొందిన మోడల్‌గా కనిపిస్తోంది. Y-ఆకారంలో LED DRLs, ట్రైయాంగ్యులర్‌ హెడ్‌ల్యాంప్స్‌, బ్లాంక్‌ గ్రిల్‌, క్రోమ్‌ క్లాడింగ్‌, ఏరోడైనమిక్‌ అల్లాయ్‌ వీల్స్‌, కనెక్టెడ్‌ టెయిల్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు కొత్త డిజైన్‌ను తెలియజేస్తున్నాయి. INGLO ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందినందున, ICE SUVలతో పోలిస్తే ఇది మరింత ఫ్లాట్‌ ఫ్లోర్‌, ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది.

XEV 9S ధరలు సుమారు ₹21 లక్షల నుండి ₹35 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో పోల్చిచూడటానికి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లేనందున  ఈ SUV 7 సీట్ల ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాన్ని సృష్టించే  అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్నవన్నీ ఎమ్​పీవీలో కావడంతో దీనికి పోటీ ప్రస్తుతానికైతే లేనట్లే.