ప్రతి నియోజకవర్గంలో 3500 పేదలకు ఇళ్ల మంజూరు
గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోపే మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శనివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. గాంధీ నగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. పదేళ్లలో బీఆరెస్ ప్రభుత్వం కేవలం 1 లక్షల 50 వేల ఇళ్లు మాత్రమే నిర్మిస్తే నేడు ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలోనే 4 లక్షల 50 వేలు ఇళ్లు నిర్మించబోతున్నదని ప్రకటించారు. ప్రతి నియోజవర్గానికి తొలి విడతలో 3,500ఇళ్లను మంజూరీ చేస్తామన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రతి గ్రామంలో అర్హులైన వారందరు ఇళ్లు నిర్మించుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూడా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నదని స్పష్టం చేశారు. బీఆరెస్ హయాంలో సీఎం కేసీఆర్ ఏ వేదికపైకి ఎక్కినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మాయమాటలు చెప్పారని, తన సొంత నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లను పేపర్లలో ఫోటోలు వేయించుకుని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు అడిగారని దుయ్యబట్టారు. ధరణి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడలేదట.. కోట్ల రూపాయల చేతులు మరలేదట… రైతులు, జనం నష్టపోలేదట అంటూ బీఆరెస్ చెబుతుందని మండిపడ్డారు. ధరణి వల్లనే బీఆరెస్ ఓటమి చెందిందని ఇప్పటి బీఆరెస్ గుర్తించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ కూడా అప్పటి ప్రభుత్వం తీరుపైనా నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పక్షానే మా ప్రభుత్వం నిలుస్తుంది
ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా.. జోడెద్దుల్లా ముందుకు తీసుకెలుతుందని, రైతులు, పేదలు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికంగా ఎంత భారమైనా రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు. గతం ప్రభుత్వం 7 లక్షల 20 వేల కోట్లు అప్పులు చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం పట్టుపట్టి రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని ఈ నెలాఖరు వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని వెల్లడించారు. రైతును రాజును చేసేందుకు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తుందన్నారు. రెవెన్యూ భూమిగా ఉండి రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే చేసి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన పనిముట్లలో ఇవ్వాల్సిన రాయితీలను బీఆరెస్ ప్రభుత్వం మర్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా చేసేందుకు రైతు రుణమాఫీతో పాటు రైతుభరోసా, వ్యవసాయ పనిముట్లపై రాయితీ, పంట ఇన్సురెన్సు, విత్తనాలపై రాయితీలు ఇస్తున్నదన్నారు. వెనక పడ్డా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.