హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత):
Telangana SC, ST Welfare Ffunds Uunspent | ప్రభుత్వాలు ఏవైనా దళిత, గిరిజనులపై ప్రకటించే ప్రేమ అంత నటనేనా? నిజంగా వారి అభివృద్థిని పాలకులు కోరుకోవడం లేదా? ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ పద్దులు, నిధుల విడుదల, ఖర్చుల తీరు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎస్సీ, ఎస్టీల కోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వాలు దాదాపు లక్ష కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయలేదని దళిత, గిరిజన సంఘాలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం వాటిని క్యారీ ఫార్వర్డ్ కూడా చేయలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా దళితుడే బాధ్యతలు చేపట్టినా ఈ వర్గాల సంక్షేమానికి ఒరిగిందేమిటన్న చర్చ జరుగుతోంది. దళిత, గిరిజ సంక్షేమానికి నిధులు కేటాయిస్తారు కానీ విడుదల చేయరని, ఒక వేళ విడుదల చేసినా బడ్జెట్ సంవత్సరం ముగింపు సమయంలో విడుదల చేస్తారని, ఫలితంగా వాటిని ఖర్చు చేయలేరని, దీంతో ఈ నిధులు మురిగిపోయినట్లు చూపిస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది గిరిజన సంక్షేమ శాఖకు రూ.1000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు కేటాయించి ఆర్థిక సంవత్సరం చివరలో విడుదల చేయడంతో అవి వినియోగించలేక మురిగిపోతున్నాయని ఆయన తెలిపారు.
బీఆరెస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ మానసపుత్రికగా వెలువడిన దళిత బంద్ స్కీమ్‌కు 2021-22 బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించి నయాపైస ఖర్చు చేయలేదు. ఎస్సీ సంక్షేమానికి 2021-22లో రూ.4,874 కోట్లు కేటాయించి నయాపైస ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది. ఇదే తీరుగా ఎస్టీ డెవలప్‌మెంట్‌కు రూ. 2918 కోట్లు, బీసీ డెవలప్‌మెంట్‌కు రూ.1,437 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి 2024 సంవత్సరం వరకు వడ్డీ లేని రుణాల కింద రూ.1,067 కోట్లు కేటాయించిన పాలకులు ఖర్చు చేసింది రూ.297 కోట్లు మాత్రమే. రూ.770 కోట్లు అలాగే మురిగిపోయాయి. అలాగే ఈ వర్గాల సంక్షేమ కోసం ఇతర అలకేషన్ల కింద రూ. 7,848 కోట్లు కేటాయించిన పాలకులు రూ.2,685 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ. 5,163 కోట్లు మురగబెట్టారు. ఇలా దాదాపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులలో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయలేదన్న ఆరోపణలు బలంగా వెలువడుతున్నాయి.
బీఆరెస్ సంక్షేమానికి పాతరేసిందని ఆరోపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదని దళిత సంఘాల నాయకులు అంటున్నారు. ఈ ఏడాది గిరిజన సంక్షేమ శాఖకు రూ.2300 కోట్లు కేటాయించి నిధులు విడుదల చేయలేదని గిరిజన నేత ఒకరు అన్నారు. మొదటి క్వార్టర్ పూర్తయిందని, రెండ క్వార్టర్ కూడా ఈనెలాఖరుతో పూర్తి కావస్తుందని కానీ నిధుల విడుదలకు జీవోలు ఇవ్వలేదని చెపుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఆర్థిక శాఖ మంత్రి వద్దకు వెళ్లిన ఫైల్స్ అలానే పెండింగ్‌లో ఉన్నాయని ఒక నాయకుడు ఆరోపించారు. బడ్జెట్ ఆమోదం పొంది ఆరు నెలలు పూర్తి కావస్తున్నా… నిధులు విడుదల చేయనప్పుడు అవి కేటాయించడంతో లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గిరిజన ఆర్థికాభివృద్ది సంస్థ(ట్రైకార్)కు గత ఏడాది 360 కోట్ల నిధులు కేటాయించారు కానీ నయాపైస విడుదల చేయలేదు..ఇది ఒక్క ఏడాది ముచ్చట కాదని, గత ఐదారేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తామేమి తీసి పోలేదన్నట్లుగా వ్యవహరిస్తోందని ఒక గిరిజన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులు విడుదల కాలేదు.. సరికదా ఈ ఏడాది కేటాయించిన నిధులు విడుదల చేయడానికి కనీసం ఒక్క జీవో కూడా ఇవ్వలేదని సదరు నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కేటాయింపులు, ఖర్చు (2014–15 నుంచి 2023–24 వరకు)
క్యాటగిరీ/స్కీమ్ | సంవత్సరం | కేటాయింపు | ఖర్చు | మురిగిపోయినవి |
దళిత బంధు | 2021–22 | 17,700 | 0 | 17,700 |
ఎస్సీ సంక్షేమం (CAG) | 2021–22 | 4,874 | 0 | 4,874 |
ఎస్టీ అభివృద్ధి (CAG) | 2021–22 | 2,918 | 0 | 2,918 |
బీసీ అభివృద్ధి (CAG) | 2021–22 | 1,437 | 0 | 1,437 |
వడ్డీ లేని రుణాలు | 2014–24 | 1,067 | 297 | 770 |
ఇతర కేటాయింపులు | 2014–24 | 7,848 | 2,685 | 5,163 |