Site icon vidhaatha

SC, ST Sub Plan | ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలుకు ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి

SC, ST Sub Plan | హైద‌రాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలుకు ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఈ చట్టం అమలుకు ఆర్థిక శాఖ ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారి ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని చట్టం చాలా స్పష్టంగా చెబుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం సబ్ ప్లాన్ నిధులలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు – ప్రణాళికల గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ‌నున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దళిత గిరిజన ఆవాసాల్లో కమ్యూనిటీ హాల్స్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని చెప్పారు. సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారుల పని విధానం ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో ఉన్న అధికారులు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అర్థం చేసుకొని చట్టం ప్రకారం వారి నిధులను వారికే ఖర్చు పెట్టాలని సూచించారు.  ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్‌గా అమలు చేయడానికి ఉన్నతాధికారులు మేధోమథనం చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అమలు చేసి దళిత గిరిజన జీవితాల్లో మార్పు తీసుకువస్తేనే ఆ చట్టానికి అర్థం, పరమార్థం ఉంటుందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సబ్ ప్లాన్ చట్టాన్ని ఎంత సీరియస్‌గా అమలు చేయాలో ఉన్నతాధికారులు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత అన్ని శాఖల అధికారులకు నిధుల కేటాయింపు, ఖర్చుపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీల భూములను అభివృద్ధి చేయడానికి ఇందిరా జల ప్రభ పథకం అమలు కోసం అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు దళిత, గిరిజనుల వ్యవసాయం కోసం కావాల్సిన నీటి వనరులను సమకూర్చడానికి బోర్లు వేయించాలని, భూగర్భ జలాలు పెరగడానికి చెక్ డ్యాముల నిర్మాణం చేయాలని చెప్పారు. పోడు సాగు చేసుకునే ఆదివాసి రైతులకు ఆదాయం వచ్చే విధంగా మరియు అడవిని కాపాడుకునే విధంగా ఫామ్ ఆయిల్, పండ్ల తోటల పెంపకం, అంతర్గత పంటల సాగుకు డిజైన్ చేయాలని సూచించారు. అడవి – ఆదాయం రెండు ఉండే విధంగా కొత్త పథకాలను తీసుకురావాలని సూచించారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు, నిధుల ఖర్చు గురించి అధికారులను అడిగి ఆరా తీశారు. గతం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా 24 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టడానికి అధికారులు కచ్చితంగా దృష్టి సారించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రతినెల సబ్ ప్లాన్ చట్టం అమలు, నిధుల వ్యయంపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి ఆర్థిక శాఖ నుంచి పర్యవేక్షణ చేయాలని సూచించారు. మళ్లీ వారం రోజుల్లో ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశానికి అధికారులు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలతో రావాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానీయా, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ శ్రీదేవి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి గౌతమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version