Adhiparasakthi Temple| రూ.10కోట్ల పంచలోహ విగ్రహం..ప్రతిష్టాపనోత్సవానికి సిద్దం

తమిళనాడులోని సేలం జిల్లా పనైమరత్తుపట్టిలోని పురాతన ఆదిపరాశక్తి ఆలయంలో కొత్తగా రూ. 10కోట్ల వ్యయంతో రూపొందించిన అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రతిష్టాపనోత్సవానికి సిద్దమైంది.

విధాత : తమిళనాడులోని సేలం జిల్లా పనైమరత్తుపట్టిలోని పురాతన ఆదిపరాశక్తి ఆలయంలో కొత్తగా రూ. 10కోట్ల వ్యయంతో రూపొందించిన అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రతిష్టాపనోత్సవానికి సిద్దమైంది. పనైమరత్తుపట్టిలోని పురాతన ఆదిపరాశక్తి ఆలయం ప్రవేశద్వారం వద్ద ప్రతిష్ఠించేందుకు 65 టన్నుల బరువు, 38 అడుగుల పొడవైన పంచలోహ విగ్రహాన్ని రూపొందించారు. కుంభకోణంలోని సత్రం కరుప్పూర్‌ ధరణి మెటల్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ 2016 నుంచి ఈ విగ్రహా రూపకల్పన పనిలో నిమగ్నమైంది.

ఐదేళ్ల శ్రమకు ప్రతిరూపం పంచలోహ విగ్రహం

స్థపతి గోపు నేతృత్వంలో 30మందికి పైగా సిబ్బంది ఐదేళ్ల పాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహంలోని ప్రతి భాగాన్ని మొదట విడివిడిగా మైనంతో అచ్చు పోసి, 38 అడుగుల ఎత్తైన ఆదిపరాశక్తి మైనపు విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, సీసం, జింక్ అనే ఐదు లోహాలను (పంచలోహాలు) కరిగించి ఒకే వార్పులో విగ్రహాన్ని తయారు చేశారు. అనంతరం శిల్పులందరూ కలిసి విగ్రహాన్ని పాలిష్ చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

విగ్రహం తయారీ పూర్తయిన నేపథ్యంలో మూడు అతిపెద్ద క్రేన్ల సాయంతో లారీలో విగ్రహాన్ని ఎక్కించి ప్రత్యేక పూజలు చేసి మేళతాళాల నడుమ పనైమరత్తుపట్టి అమ్మవారి ఆలయానికి తరలించారు. దారిపొడవునా ప్రజలు అమ్మవారి విగ్రహంపై పువ్వులు చల్లి, మంగళహారతులు పట్టి దర్శించుకున్నారు. ఆదివారం విగ్రహాం ఆలయానికి చేరింది. అదిపరాశక్తి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ఆలయంలోని 13 అడుగుల నల్లరాతి పీఠంపై ప్రతిష్ఠించనున్నారు.

Latest News