ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో చేపట్టిన సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ విధానం స్వాగతించదగినది. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు వంటి నిరుద్యోగులను తీవ్ర నైరాశ్యాలకు గురిచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దానికి అనుగుణంగా నియామకాలు పక్కగా నిర్ణీత గడువులో పూర్తి కావాలంటే ఇయర్ క్యాలెండర్ తప్పనిసరి. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం ముదావహం. గత ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులు,నోటిఫికేషన్లలో లోపభూయిష్టమైన విధానాల వల్ల నిరుద్యోగులు చాలా నష్టపోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.
మరో ముఖ్యమైన విషయం రాజ్యాంగబద్ధమైన సర్వీస్ కమిషన్‌లో రాజకీయ జోక్యం ఉండరాదని విద్యావేత్తలు మొదటి నుంచీ చెబుతున్నారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటిసారి జాగ్రత్తలు తీసుకున్నా రెండవసారి మాత్రం సుప్రీంకోర్టు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. ఫలితంగా కొంతమంది సర్వీస్ కమిషన్ సభ్యుల అర్హతలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఆ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నది. ప్రశ్నపత్రాల లీకేజీ సమయంలోనే సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యులంతా రాజీనామా చేయాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, విపక్ష నేతలు కూడా డిమాండ్ చేశారు. ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పినా అప్పటి ప్రభుత్వం వద్దని వారించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. దీంతో సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. వాళ్ల రాజీనామాలు ఆమోదం పొందితే కొత్త బోర్టులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులు ఉండే అవకాశం ఉన్నది.
కొత్తబోర్డులో సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనల మేరకు కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకాలు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలి. సర్వీస్ కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం నియామకాలపై హామీలు ఇచ్చింది. మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నది. అయితే వివిధ కారణాల రీత్యా ఆ ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ నియామకాల బోర్డులు ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాయి? ఎన్ని నోటిఫికేషన్ల పరీక్షలు రద్దయ్యాయి? ఎన్ని పూర్తయ్యాయి? ఫలితాల వెల్లడి, కోర్టు పరిధిలో ఉన్న కేసులకు సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వం కోరింది. దీనికి కొంత గడువు పట్టొచ్చు. అయితే వివాదాలు లేని వాటి ప్రక్రియ కొనసాగించడమే మేలనే అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తమౌతున్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ హైకోర్టు సింగిల్, ఫుల్ బెంజ్ రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, ఇప్పటికే గ్రూప్-2 వంటి పరీక్షల షెడ్యూల్, డీఎస్సీ షెడ్యూల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి.
వీటిపై కూడా ప్రభుత్వం త్వరగా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుత పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా పెంచుతారా? లేక ఈ పరీక్షలు పూర్తైన వెంటనే వేరే నోటిఫికేషన్ల ద్వారా వాటిని భర్త చేస్తారా? అన్న అంశాలపై నిరుద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. నియామకాలపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా వీటిపై స్పష్టత ఇవ్వాలి. అలాగే సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పాటు నిర్దిష్ట ప్రణాళిక కూడా ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.