Bandi Sanjay Vs KTR : లగ్జరీ కార్ల స్కామ్ లో కేటీఆర్..విచారణకు బండి సంజయ్ డిమాండ్

లగ్జరీ కార్ల స్కామ్ లో కేటీఆర్ పాత్రపై బండి సంజయ్ విచారణ డిమాండ్. బసరత్ ఖాన్ స్మగ్లింగ్ కార్లలో కేటీఆర్ వాడిన వాహనం వివాదం రేపుతోంది.

Bandi Sanjay Vs KTR

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ తో ఉన్న సంబంధంపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బసరత్ ఖాన్ అక్రమంగా దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు? బీఆర్ ఎస్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అని ప్రశ్నించారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి?..వాటికి మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని దర్యాప్తు సంస్థలు విచారించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కార్లకు చెల్లింపులు బినామీ పేర్లతోనా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారా జరిగిందా? అన్నది విచారణలో తేల్చాలన్నారు. ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందిందని ? వాస్తవాలు బయటకు రావాలంటే సంబంధిత శాఖలు విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ల్యాండ్ క్రూజర్ కార్ల స్మగ్లర్ తో కేటీఆర్ లింకులు?

ల్యాండ్ క్రూజర్ కార్లు స్మగ్లర్ బసరత్ ఖాన్ తో కేటీఆర్ కు లింకులు ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ల్యాండ్ క్రూజర్ కార్ల స్కామ్ లో ఆయన ప్రమేయంపై ఆరోపణలు చోటుచేసుకున్నాయి. బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనం కేటీఆర్ వాడుతుండటం ఇప్పుడు వివాదస్పదమైంది. ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లింగ్ కేసులో మొత్తం 8 వాహనాలను స్మగ్లింగ్ చేసినట్లు నిందితుడు బసరత్ ఖాన్ డీఆర్ఐ అధికారుల విచారణలో ఒప్పుకున్నాడు. తాను స్మగ్లింగ్ చేసిన 8 ల్యాండ్ క్రూజర్ల వాహనాల నెంబర్ల వివరాలతో అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాహనాల్లో కేటీఆర్ వాడుతున్న వెహికల్ (టీఎస్09డి 6666) కూడా ఉన్నట్లు బసరత్ ఖాన్ అంగీకరించాడు. కేటీఆర్ వాడే వాహనం ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దీంతో ఎట్ హోం కంపెనీకి..నిందితుడికి ఉన్న సంబంధాలపై డీఆర్ఐ అధికారులు ఫోకస్ పెట్టారు. అలాగే కేటీఆర్ కుటుంబానికి, ఎట్ హోం కు మధ్య ఉన్న లింక్ పై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.