విధాత, హైదరాబాద్: తెలంగాణ సమాజం బీజేపీని తిరస్కరించిందా? అంటే అవుననే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా ప్రయత్నాలు సాగించిన బీజేపీకి ఏ మాత్రం మింగుడు పడని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికారం మాదే అని ప్రకటించిన బీజేపీకి 72 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కనీయలేదు. కేవలం 8 స్థానాలకే కట్టడి చేశారు. ఈ ఎనిమిది సెగ్మెంట్లలో కూడా పార్టీ బలం కంటే అభ్యర్థి బలమే కీలకమన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు స్టార్ లీడర్లుగా గుర్తింపు పొందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్, దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావులను ప్రజలు ఓడించడం గమనార్హం. గద్వాల రాజకీయ కోటను ఏలిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సొంత ఇలాకాలో బీజేపీ అభ్యర్థికి కేవలం 7558 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో జాతీయ నాయకుడు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడికి డిపాజిట్ కూడా దక్కలేదు.
పాల పొంగులా బీజేపీ
బీఆరెస్‌తో నువ్వా? నేనా? అన్న తీరుగా ఒక దశలో పోరాటం చేసిన బీజేపీ ఒక్క సారిగా పాల పొంగులా చల్లారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలన్న తీరుగా బీజేపీ అధిష్ఠానం అంతా ఇక్కడే తిష్ఠ వేసింది. ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అనేక మంది నాయకులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులంతా ఇక్కడే మకాం వేసి బీజేపీని గెలిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనేక సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక సభలో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించగా, మరో సభలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై కమిటీ వేస్తానని ప్రకటించారు. ఈ రెండు తురుపు ముక్కలతో కాంగ్రెస్, బీఆరెస్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకుంటామని బీజేపీ భావించినా.. ప్రజలు మాత్రం ఆ మాయలో పడలేదు. మోదీ చేసిన ఈ రెండు వాగ్దానాలను నమ్మలేదు.
గంగా జమున తెహజీబ్.. తెలంగాణ
తెలంగాణ సమాజం భిన్నత్వంలో ఏకత్వం.. ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి సహ జీవనం చేస్తారు. పైగా నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా, భూస్వాముల దోపిడికీ వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి సాయుధ పోరాటం చేశారు. భూమి కోసం జరిగిన ఈ సాయుధ పోరాటంలో అసువులు బాసిన బందగి ఒక ముస్లిం, దొడ్డి కొమురయ్య ఒక హిందువు.. వీరిద్దరిదీ పక్కపక్కన గ్రామాలే.. ఇలా కుల మతాల ప్రస్తావన లేకుండా యావత్ తెలంగాణ సమాజం భూస్వాముల దోపిడీకి అండగా నిలిచిన నిజాం నవాబుపై సాయుధ పోరాటం సాగించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన అగ్రనేతల్లో మఖ్దూం మొహియుద్దీన్ అనే ముస్లిం కూడా ఉన్నారన్న సంగతి జగమెరిగిన సత్యమే. ఇలాంటి మత రహిత సమాజంలో మతం పేరుతో ప్రజలను రెండు వర్గాలుగా విభజించి ఓట్లు దండుకోవాలనే పార్టీలకు చోటు లేదని ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విద్వేష ప్రసంగాలకు చెల్లుచీటీ
బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలకు, తిట్ల దండకాలకు తెలంగాణ ప్రజలు చెల్లు చీటిపాడారని, శాంతికి, అభివృద్ధికే తాము పట్టం కడతామని ఓటు ద్వారా తేల్చి చెప్పారని ఓ సీనియర్ జర్నలిస్టు అన్నారు. తెలంగాణలో జనసేనతో కలిసి 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి 72 సెగ్మెంట్లలో డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. పైగా వీరి పోటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, పరోక్షంగా అధికారంలో ఉన్న బీఆరెస్‌కు కొన్ని చోట్ల లబ్ధి చేకూర్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. మరో వైపు తాము కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏమి చేశామో… ఇక్కడ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో స్పష్టంగా చెప్పకుండా.. ఉత్తి విమర్శలకే పరిమితం కావడాన్ని కూడా తెలంగాణ సమాజం స్వీకరించలేదన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ముఖ్యంగా అవినీతి పరులను జైల్లో పెడతామన్న బీజేపీ ఆ దిశగా ఉత్త ప్రకటనలు మినహా ఎన్నికల ఎలాంటి కార్యాచరణను తీసుకోలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావులు మాటలకే కానీ చేతలకు కాదన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారని, అందుకే వీరిని తిరస్కరించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా బీజేపీ, బీఆరెస్‌లు ఒక్కటేనన్న అభిప్రాయానికి వచ్చారన్న చర్చ కూడా బలంగా జరుగుతోంది. దీంతో బీజేపీని తెలంగాణ ప్రజలు తిరస్కరించి ఉండ వచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్‌ను తన కంచుకోటగా మార్చుకున్న బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ.. అక్కడ తన రాజకీయ వారసుడిగా బరిలోకి దింపిన బీజేపీ అభ్యర్థికి 7,558 మించి ఓట్లు రాలేదంటే ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. అలాగే మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు మిథున్ కుమార్‌రెడ్డిని బరిలోకి దించి, డిపాజిట్ కూడా తెచ్చుకోలేక పోయారంటున్నారు. ఇలా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ జర్నలిస్టులు సంగప్ప, కేటీఆర్‌పై పోటీ చేసిన రాణి రుద్రమరెడ్డి కూడా డిపాజిట్ తెచ్చుకోలేక పోయారు.
బీఆరెస్ నుంచి అప్పటి సీఎం కేసీఆర్ చేత గెంటి వేయబడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగారు. కేసీఆర్ అధికారికంగా, అనధికారికంగా వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఈటల గెలుపును అడ్డుకోలేక పోయారు. ఈటల గెలుపుతో రాష్ట్ర బీజేపీలో ఒక జోష్ వచ్చింది. కేసీఆర్‌కు సవాల్ విసిరి నిలబడేది బీజేపీనే అన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఏ ఎన్నిక అయిన బీఆరెస్‌దే గెలుపు అన్న ధీమాతో ఉన్న బీఆరెస్ అధినేత కేసీఆర్‌ను నాడు ఈటల కట్టడి చేశారు. కానీ ఏడాది తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇదే తీరుగా ఉప ఎన్నికల్లో గెలుపొందిన రఘునందన్ రావు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఉప ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తిగతంగా చూసి ఓటే వేశారని, కానీ సాధారణ ఎన్నికల్లో పార్టీ పరంగా చూసి ప్రజలు తిరస్కరించారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది.