Hyderabad | యూరియా కొరతకు కారణం ఏంటో బీఆర్ఎస్ కు తెలియదా అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయమై మంత్రి స్పందించారు. యూరియాపై బీఆర్ఎస్ ఆందోళన కపట నాటకమని ఆయన అన్నారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా ఆయన చెప్పారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ ప్రేరేపిత ఉద్యమాలను ప్రజలు హర్షిస్తారా అని ఆయన ప్రశ్నించారు. జియో పాలిటిక్స్ వల్ల దేశీయ ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు లేక యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ చేస్తోందని మంత్రి మండిపడ్డారు.
తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ఫ్యాక్టరీ మరమ్మత్తుల కారణంగా యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు రామగుండం నుంచి రాష్ట్రానికి కేటాయింపులు కూడా తగ్గాయనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై కేంద్రాన్ని కోరిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఇటీవల పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. ఆ తర్వాత రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి యూరియాను సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.