విధాత, హైదరాబాద్ : రైతులను రాజులు చేశామని, రైతు ప్రభుత్వమని ఇంతకాలం అబద్ధాలతో బీఆరెస్ పాలన సాగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చకు ఆయన సమాధానమిచ్చారు. బీఆరెస్ పాలనలో రైతుల ఆదాయం పెరుగకపోగా, ఆత్మహత్యలు పెరిగాయనాన్నారు. వారు చెప్పినట్లుగా కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరిస్తే తెలంగాణలో పంప్‌సెట్ల సంఖ్య 10లక్షలు ఎలా పెరిగిందో వారే చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. రైతు ఆదాయంలో దేశంలో 25వ స్థానంలో ఉందని, మొదటి స్థానంలో ఉన్న మేఘాలయలో 29,348గా ఉంటే మన రాష్ట్రంలో 9,403గా మాత్రమే ఉందన్నారు. బీఆరెస్ పాలనలో 8వేలకు పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కేంద్రం పేర్కొన్నదని చెప్పారు. బీఆరెస్ హయాంలో రకరకాల సమస్యలతో ప్రభుత్వం నుంచి భరోసా లేక 1,21,965మంది చనిపోయారని, వారిలో 1,98,001 మంది రైతుబీమా అందించారన్నారు.
చనిపోయాక 5లక్షల బీమాను అందించి రైతులకు వెలకట్టిన గత ప్రభుత్వం రైతులు జీవించివుండగా వారికి అవసరమైన పథకాలను పంటల బీమాను, సబ్సిడీలను మాత్రం అందించలేదని విమర్శించారు. ముందు వరి వేసుకోవాలని చెప్పి, ధాన్యం కొనుగోలు చేయలేక మాట మార్చి, వరి వేస్తే ఉరి అని చెప్పిన కేసీఆర్.. తన ఫామ్ హౌజ్‌లో 150ఎకరాల వరిసాగు చేశాడని రేవంత్ ఆరోపించారు. దానిని మేం బయట పెట్టేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేశారని చెప్పారు.
ఖమ్మంలో మిర్చి రైతులకు సంకేళ్లు వేసిన నిరకుంశ పాలకులు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ నిలదీశారు. వ్యాపారులు, దళారులతో కుమ్మక్కై తరుగు పేరుతో దోచుకుని, రైతులకు క్వింటాల్‌కు 1400 మాత్రమే మద్దతు అందించారని విమర్శించారు. కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో పండించిన వరి ధాన్యం క్వింటాల్‌ను 4,250రూపాయలకు మెడమీద కత్తి పెట్టి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పగా, అందుకు తాము సిద్ధమంటూ కేటీఆర్ బదులిచ్చారు.