Revanth Reddy । అయ్య పేరుతో మామ పేరుతో నేను చట్టసభల్లోకి రాలేదు, స్వశక్తితో కష్టపడి ఇక్కడకు తొక్కుకుంటూ వచ్చాను అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసా పై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నల్లమల అడవుల నుంచి, క్రూర మృగాల మధ్య పెరుగుకుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చాను, ఉత్తగ రాలేదు. ఇక్కడ తొక్కితే అక్కడకు పోయారు, అక్కడ తొక్కితే ఇక్కడకు వచ్చాను. వాళ్లు ఒకటే చూశారు కాని నేను మహబూబ్ నగర్ జిల్లా పరిషత్, శాసన సభ, శాసన మండలి, లోక్‌సభ చూసిన అనుభవంతో ఇవాల అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వచ్చాను. వాళ్లు అమెరికా లో, గుంటూరు లో చదువుకున్న చావు తెలివితేటలు నాకు లేవు. నాకు సామాన్యుడి తెలివితేటలు ఉండొచ్చు, రైతు బిడ్డను. అడవిలో నుంచి వచ్చిన నాకు ఎట్ట బయటపడాలో నాకు తెలుసు అధ్యక్షా అని అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా రీజినల్ రింగ్ రోడ్డు వేసుకుందామా, మూసీని అభివృద్ధి చేద్దామా, మెట్రో రైలు పొడిగిద్దామా వద్దా అనేది ప్రధాన ప్రతిపక్షం స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి అడిగారు.
కొడంగల్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో 1300 ఎకరాల భూసేకరణకు అనుమతిస్తే, కోట్ల రూపాయలు గుమ్మరించి, మందు తాగిపించి జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు చేయించి చంపే ప్రయత్నం చేశారు. నా మీద దాడి చేస్తే బాధపడను, అధికారులు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. 95 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్న నియోజకవర్గంలో నేను పనులు చేయకపోతే ఎలా, ఇలా ప్రతిపక్షం కట్టెపెట్టి అడ్డు పడితే తొక్కుకుంటూ వెళ్తానని ఆయన ఆవేశంతో ఊగిపోయారు. గచ్చిబౌలి లో నిర్మించిన క్రీడల స్టేడియం ను డ్రగ్స్, కొకైన్, లిక్కర్ తాగే సన్ బర్న్ వంటి ప్రైవేటు సంస్థకు లీజుకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.